ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో భారీ మార్పులు
ఏడు నియోజకవర్గాల్లో మార్పులు, ఒక నియోజకవర్గంలో కొత్తవారికి అవకాశం
రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలకు స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపిక ఊపందుకుంది. మూడు నెలల ముందే భారీ ప్రక్షాళన దిశగా వైఎస్సార్‌సీపీ అడుగులు వేస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రితోపాటు పలువురు ఎమ్మెల్యేల స్థానాలు మారుతున్నాయి. విజయవాడ నగరంలో ఉన్న మూడు నియోజక వర్గాల్లో రెండు వైఎస్సార్‌సీపీ గెలవగా ఒకటి టీడీపీ గెలిచింది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కొత్త అభ్యర్థులను బరిలోకి దింపే ఆలోచనలో వైఎస్సార్‌సీపీ ఉంది.
మారిన నియోజకవర్గ అభ్యర్థులు
విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్‌ను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. విజయవాడ తూర్పు నుంచి సామినేని ఉదయభాను రంగంలోకి దిగనున్నారు. ప్రస్తుతం ఉదయభాను జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయవాడ పశ్చిమ నుంచి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిని పోటీలో ఉంచాలనే ఆలోచనలో వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానం ఉంది. అలాగే మైలవరం నుంచి మంత్రి జోగి రమేష్‌ను పోటీలో పెట్టనున్నారని సమాచారం. నందిగామ నియోజకవర్గం నుంచి అమర్లపూడి కీర్తిసౌజన్య (సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జోషి మరదలు) పోటీలో ఉంచాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దించనున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి స్థానంలో కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దించనున్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేయనున్నారు. ఈయన ప్రస్తుతం పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. పెనమలూరు నుంచి దేవినేని అవినాష్‌ను పోటీలోకి దించేందుకు రంగం సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. ప్రస్తుతం ఉన్న వారినే మార్పులు చేయగా నందిగామ నియోజకవర్గానికి మాత్రం కొత్త వారిని రంగంలోకి దించారు.
ఇప్పటికి ఇక్కడ పాతవారే..
మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, నియోజకవర్గాల్లో మార్పులపై అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతాలు లేవు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి సీటు ఇప్పించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కృష్ణమూర్తి మచిలీపట్నం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని ప్రజలకు చెబుతూ అక్కడక్కడ సభలు, సమావేశాలు పెడుతున్నారు.
Next Story