పెద్దమనసు చాటుకున్న పెట్రోలింగ్ పోలీసులు
x
పోలీసు పెట్రోలింగ్ కారులో వైష్ణవికి లిఫ్ట్ ఇస్తున్న పోలీసు

పెద్దమనసు చాటుకున్న పెట్రోలింగ్ పోలీసులు

హైదరాబాద్ పెట్రోలింగ్ పోలీసులు పెద్దమనసు చాటుకున్నారు.పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అమ్మాయి కేంద్రం తెలియక అవస్థ పడుతుంటే పెట్రోలింగ్ పోలీసులు ఆమెకు లిఫ్ట్ ఇచ్చారు.


తేదీ : 21-4-2024, ఆదివారం...సమయం: ఉదయం 9.45 గంటలు...స్థలం: హైదరాబాద్ నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని గురునానక్ హైస్కూల్...నల్గొండ జిల్లా నార్కట్ పల్లి నుంచి వైష్ణవి అనే బాలిక ఆర్ జె సి ప్రవేశ పరీక్ష రాయడానికి తన అమ్మమ్మతో కలిసి ఆటోలో నారాయణగూడకు వచ్చింది.

- వైష్ణవి హాల్ టికెట్ చూస్తే ప్రవేశ పరీక్ష రాయాల్సిన కేంద్రం హాల్ టికెట్ లో అంబర్ పేట పోలీసుస్టేషన్ పరిధిలోని పటేల్ నగర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సిపిఎల్ రోడ్డు అని ఉంది. పరీక్ష కేంద్రం చిరునామా తెలియని వైష్ణవి ఆటోను మాట్లాడుకోగా, ఆటో డ్రైవరు తప్పిదం వల్ల బాలికను నారాయణగూడకు తీసుకువచ్చాడు.
- మరో 15 నిమిషాల్లోనే అంటే ఉదయం 10.00 గంటలకు ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష ప్రారంభం అవుతుంది...అంబర్ పేట పరీక్షా కేంద్రానికి ఎలా వెళ్లాలో తెలియక ఏడుస్తున్న బాలికను చూసిన పెట్రోలింగ్ పోలీసులు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు.
- నారాయణ గూడ గురునానక్ హైస్కూల్ పరీక్ష కేంద్రం వద్ద బాలిక వైష్ణవి, ఆమె అమ్మమ్మ కంగారు పడుతున్నారు. నారాయణగూడ విట్టల్ వాడి నుంచి అంబర్ పేట సీపీఎల్ లో గల పరీక్షా కేంద్రానికి ఎలా వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతుంటే గమనించిన పెట్రోలింగ్ పోలీసులు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. పోలీసు పెట్రోలింగ్ కారులో వైష్ణవిని తీసుకొని, కేవలం 13 నిమిషాల్లోనే అంబర్ పేట సీపీఎల్ లో గల పరీక్షా కేంద్రానికి చేర్చారు. మరో రెండు నిమిషాల్లో పరీక్ష కేంద్రం గేటు మూసివేయనుండగా పోలీసులు వైష్ణవిని పరీక్షా కేంద్రంలోకి పంపించారు. దీంతో సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్న వైష్ణవి ఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాసింది.

ఆర్ జె సి ప్రవేశ పరీక్ష రాసేందుకు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చిన పెట్రోలింగ్ పోలీసులను పలువురు అభినందించారు. పరీక్ష రాసిన తర్వాత వైష్ణవితోపాటు ఆమె అమ్మమ్మ పెట్రోలింగ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో పోలీసులు పరీక్షా కేంద్రం వరకు పోలీసు కారులో లిఫ్ట్ ఇవ్వకుంటే ఒక సంవత్సరం పాటు తన చదువు నిలిచి పోయేదని వైష్ణవి చెప్పారు. పెట్రోలింగ్ పోలీసుల పెద్ద మనసును స్థానిక ప్రజలు ప్రశంసించారు. ఇదీ హైదరాబాద్ ఫ్రెండ్లీ పోలీసుల ఘనత.


Read More
Next Story