అనుకున్నట్టే ఆమ్రపాలికి పెద్ద పోస్టు
కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ చక్రం తిప్పితే రేవంత్ ప్రభుత్వంలో ఆమ్రపాలి కీలకం కాబోతున్నారని వార్తలు కోడై కూశాయి.
ఆమ్రపాలి.. గుర్తున్నారుగా.. తెలంగాణలో పేరున్న ఐఎఎస్. మరో ఐఎఎస్ స్మితా సబర్వాల్ కి దీటుగా గూగుల్ సెర్చ్ లో వెతికిన పేరు ఆమ్రపాలి. కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ చక్రం తిప్పితే రేవంత్ ప్రభుత్వంలో ఆమ్రపాలి కీలకం కాబోతున్నారని వార్తలు కోడై కూశాయి. అనుకున్నట్టే ఆమెకు మంచి పోస్టే వచ్చింది. మహా నగరాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసే హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పూర్తి బాధ్యతలను ఆమెకు అప్పగించారు.
శివార్లలో పట్టుసాధించేందుకేనా..
ఏడు జిల్లాలు.. 7200 చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్‌ఎండీఏ విస్తరించి ఉంది. దాదాపు కోటిన్నర జనాభా ఈ పరిధిలో ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ఆదరణ కరవైన నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం హెచ్‌ఎండీఏపై దృష్టి పెట్టి ఆమ్రపాలికి ఈ పెద్ద పోస్టు ఇచ్చినట్టు భావిస్తున్నారు. భవిష్యత్తులో హెచ్‌ఎండీఏ పరిధి వరకు నగరం విస్తరించనుంది. దీంతో 3 కోట్ల వరకు జనాభా పెరగనుందని అంచనా.
హెచ్‌ఎండీఏకు ఉన్నత పరిపాలనాధికారిగా కమిషనర్ మాత్రమే కొనసాగుతుండగా.. తాజాగా సంయుక్త కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని నియమించింది. 2019 నుంచి హెచ్‌ఎండీఏకు కమిషనర్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కొనసాగుతున్నారు. వేలం ద్వారా రూ. వందల కోట్ల విలువైన భూముల అమ్మకాలు, అవుటర్ రింగ్ రోడ్ లీజు ఇతర ప్రాజెక్టులు ఆయన హయాంలోనే జరిగాయి.
పార్టీ పట్టు కోసమా, రియల్ ఎస్టేట్ పెంపు కోసమా
హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ టౌన్‌షిప్‌లు, శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మాణం ఇతరత్రా ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ప్రణాళికలు తయారవుతున్నాయి. ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే విద్యుత్, నీరు, రోడ్లు కీలకం. అటువంటి వాటిలో ముఖ్యమైంది హెచ్‌ఎండీఏ. అందుకే ఇద్దరు అధికారులను నియమించినట్టు సమచారం.
అర్వింద్ ను ఉంచుతారా, సాగనంపుతారా?
పూర్తి స్థాయి కమిషనర్‌ను పోస్టును కొనసాగిస్తూనే కొత్తగా జాయింట్ కమిషనర్ పోస్టులో అదనంగా మరో ఐఏఎస్ అధికారిని నియమించారు. ఇప్పటివరకు కమిషనర్‌గా ఉన్న అర్వింద్ కుమార్‌ను హెచ్‌ఎండీఏలో కొనసాగిస్తారా.. ఆ స్థానంలో నూతన అధికారిని నియమించనున్నారా.. అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. సంయుక్త కమిషనర్‌గా ఒకటిరెండు రోజుల్లో ఆమ్రపాలి బాధ్యతలు తీసుకోనున్నారు. ఆమ్రపాలితో అభివృద్ధి చేయించి ఆ పేరును కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల ప్లాన్ గా ఉంది.