ఆరు గ్యారెంటీలు మీకు రావాలంటే.. ఇవన్నీ చేయాలి..
x
అభయహస్తం ఫోటో

ఆరు గ్యారెంటీలు మీకు రావాలంటే.. ఇవన్నీ చేయాలి..

పదేళ్ల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల్లో వాగ్ధానం ఇచ్చినట్లుగా ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంది.


ఈ నెల 28న నుంచి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. అభయ హస్తం పేరుతో దాదాపు రెండు పేజీల్లో సమాచారాన్ని పూర్తి చేసి ప్రజాపాలనలో ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలతో పాటు ఆరు గ్యారెంటీల పథకానికి అవసరమయ్యే మరికొన్నివివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.




దరఖాస్తు మొదటి విభాగంలో దరఖాస్తుదారుడి పేరు, లింగం, కులం, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, వృత్తి, ఇతర కుటుంబసభ్యుల సమాచారం, చిరునామా, రేషన్ కార్డు నంబర్ లాంటి సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది.

రెండో భాగంలో ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పొందడానికి కావాల్సిన సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది.

మహలక్ష్మీ పథకం కింద ప్రతినెలా రూ. 2.500 సాయం కావాలి అనుకుంటే ఎదురుగా ఉన్న బాక్స్ లో ‘టిక్’ మార్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే రూ. 500 గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది

రైతు భరోసా కింద సాగు రైతు అయితే పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ ఇవ్వాలి. కౌలు రైతు అయితే కౌలు భూమి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కూలీలైతే ఉపాధి హామీ కార్డు నెంబర్ పొందుపరచాలి

ఇందిరమ్మ ఇళ్లు కింద ఇల్లు లేనివారికి ఇంటి నిర్మాణం ఆర్థిక సాయం కోసం అని ఉన్న చోట టిక్ చేయాలి.




అమరవీరుల కుటుంబాలవారు, ఉద్యమకారులు అయితే 250 గజాల ఇంటి స్థలం కావాలంటే అమరుడి పేరు, సంవత్సరం, ఎఫ్ఐఆర్ నంబర్, డెత్ సర్టిఫికేట్ నంబర్ సమర్పించాలి. ఉద్యమకారులు అయితే తెలంగాణ ఉద్యమం సందర్భంగా అయిన కేసు తేదీ, సంఖ్య, జైలుకు వెళ్లి ఉంటే వాటి వివరాలు పేర్కొనాలి

గృహ జ్యోతి కింద నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పొందెందుకు ఇంటి మీటర్ కనెక్షన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.

చేయూత కింద పెన్షన్ కోసం ఏ కేటగిరి చెందిన వారో ముందు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, జీవనబృతి, ఒంటరి మహిళ, వితంతు, చేనేత, ఎయిడ్స్, ఫైలేరియా బాధితులు వంటి వివరాలు ఉన్నాయి. ఇందులో మీరు దేనికి అర్హులో దానికి ఎదురుగా టిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో వారికి రూ. 4000 ఫించన్ అందుతుంది. అలాగే దివ్యాంగుల కోసం రూ. 6000 ఫించన్ కోసం అయితే సదరం సర్టిఫికేట్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలి.




ఇలా ప్రతి గ్రామంలో వార్డుల వారీగా దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ దరఖాస్తులు వచ్చే సంవత్సరం జనవరి 6 వ తేదీ వరకూ తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇంతకుముందే కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన సంగతి విదితమే. ఇదే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Read More
Next Story