11 రోజుల్లో 3 కోట్ల మంది మహాలక్ష్ముల ప్రయాణం
x
ప్రయాణీకులతో మాట్లాడుతున్న సజ్జన్నార్

11 రోజుల్లో 3 కోట్ల మంది మహాలక్ష్ముల ప్రయాణం

వావ్‌.. వాట్ ఏ రెస్పాన్స్‌.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి రికార్డ్ సృష్టించారు.


తెలంగాణ మహిళలు రయ్‌ రయ్‌న దూసుకుపోతున్నారు. మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లో నిల్చునే పరిస్థితీ ఉండటం లేదు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఏకంగా 51.74 లక్షల మంది ప్రయాణాలు చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సుల్లో ప్రయాణించారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు. పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారు.

పెరిగిన ఆక్యూపెన్సీ రేషియో...

మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పెరిగింది. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగింది. ఈ నెల 16వ తేదిన 17 డిపోలు, 17వ తేదిన 20 డిపోలు, 18వ తేదిన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయింది. గత మూడు రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఓఆర్ సాధించాయి.

మహిళలకు జీరో టికెట్లు

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9 వ తేది నుంచి ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ స్కీంను టీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది. సమర్థవంతంగా ఈ స్కీమ్ ను అమలు చేసేందుకు ఈ నెల 15 నుంచి జీరో టికెట్లను మహిళలకు జారీ చేస్తోంది.

ఇతర రాష్ట్రాల మహిళలకు నో...

“ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోంది. ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకురావడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ ఫోన్ లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరుతున్నాం. ఫొటో కాపీలలు స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటోలు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటోలు ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు.

త్వరలో 2050 కొత్త బస్సులు

"ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చే ప్లాన్ చేస్తున్నాం. అందులో 1050 డీజిల్.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. విడతల వారీగా ఆ బస్సులు వాడకంలోకి వస్తాయి" అంటున్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్‌.

Read More
Next Story