నగరాల్లో పెరిగిన జీవనవ్యయం,జీతాలతోపాటు పెరిగిన ఖర్చులు
x
మెట్రోనగరాల్లో పెరిగిన జీవన వ్యయం

నగరాల్లో పెరిగిన జీవనవ్యయం,జీతాలతోపాటు పెరిగిన ఖర్చులు

మెట్రో నగరాల్లో మధ్య తరగతి వేతన జీవుల్లో ఆదాయంతోపాటు జీవన వ్యయం కూడా పెరుగుతోంది. పిల్లల విద్యా వ్యయం, గృహ బడ్జెట్‌ పెంపు వల్ల ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు.


దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో నివశించే ఉద్యోగుల ఆదాయంలో అధిక భాగం అద్దెలు, కుటుంబ పోషణ, పిల్లల చదువులకే వెచ్చించాల్సి వస్తుంది. హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆదాయంలో 21 శాతం ఇంటి అద్దెలకు వెచ్చిస్తున్నారు. నెలవారీ సంపాదనలో మరో 17 శాతాన్ని పిల్లల చదువులకు ఖర్చు చేస్తున్నారని వెల్లడైంది. సినిమాలకు 19 శాతం డబ్బు వెచ్చిస్తున్నారు.


పెరిగిన ధరలతో నగరవాసుల ఆందోళన
దేశంలో అనూహ్యంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది పేదలు, నిరుపేదలున్నారు. నగరాల్లో ఉద్యోగులకు ఒకవైపు ఆదాయం పెరుగుతున్నా, పెరుగుతున్న ఖర్చులతో అధిక మొత్తం అయిపోతుంది. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతున్నాయని సర్వేలో తేలింది.

దేశంలోని 17 నగరాల్లో గ్రేట్ ఇండియన్ వాలెట్ సర్వే
హోం క్రెడిట్ ఇండియా దేశంలోని 17 నగరాల్లో ద గ్రేట్ ఇండియన్ వాలెట్ పేరిట సర్వే చేసింది. హైదరాబాద్ సహా పూణే, ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కోల్ కతా, రాంచీ,భోపాల్, జైపూర్, లక్నో, పాట్నా, ఢిల్లీ, డెహ్రాడూన్, చండీఘడ్, లూథియానా నగరాల్లో 2,500 మందిని సర్వే చేసింది. 18 నుంచి 55 ఏళ్ల వయసు వారిని మధ్యతరగతి ప్రజల స్థితిగతులపై సర్వే చేశారు. ది గ్రేట్ ఇండియన్ వాలెట్ సర్వేలో దేశంలోని వినియోగదారులు, దిగువ మధ్యతరగతి వారి ఆర్థిక స్థితిగతులు వెలుగుచూశాయి.

జీతంలో 60 శాతం ఇంటి ఖర్చులకే...
సగటు ఉద్యోగుల ఆదాయంలో 60 శాతం ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తుందని వెల్లడైంది. సగటున నెలకు 33వేల రూపాయల జీతం పొందే ఉద్యోగులు అందులో 19వేల రూపాయలను పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, వైద్య ఖర్చులకు వెచ్చిస్తున్నారని తేలింది. హైదరాబాద్ నగరంలో ఉద్యోగుల నెల జీతం 42వేల రూపాయల నుంచి 44 వేల రూపాయలున్నా అందులో సగం డబ్బు కుటుంబ అవసరాలకే వెచ్చిస్తున్నారని తాజా సర్వేలో తేలింది. బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాల్లో ఐటీరంగం విస్తరిస్తుండటంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బెంగళూరు కంటే హైదరాబాద్ జాతీయ ఆదాయం 15 శాతం పెరిగింది.

హైదరాబాద్ నగరంలో పెరిగిన జీవన వ్యయం
దేశంలోని 17 నగరాల్లో హైదరాబాద్ నగరంలో జీవన వ్యయం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నగర వాసుల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందని సర్వేలో తేలింది. 2023 వ సంవత్సరంలో నెలవారీ ఆహార ఖర్చు నెలకు రూ.19వేలు ఉంది. ఈ ఏడాది ఆహార ఖర్చు 24వేల రూపాయలకు పెరిగిందని వెల్లడైంది. హైదరాబాద్ నగరంలో ఆదాయంలో 21 శాతం అద్దెలకే ఖర్చు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు పెరగడంతో పిల్లల చదువులకు 17 శాతం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫిట్ నెస్ కోసం 6 శాతం జీతాన్ని వెచ్చిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది ఇంటి అద్దెలు గణనీయంగా పెరగడంతో జీతంలో సగం కిరాయిలకే పోతే తామెలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

భారతీయుల వాలెట్ షేర్‌
తమ ఆదాయం గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో పెరిగిందని 52శాతం మంది వినియోగదారులు చెప్పారు. రాబోయే సంవత్సరం నాటికి తమ ఆదాయం పెరగవచ్చని 74 శాతం మంది వినియోగదారులు భావిస్తున్నారు. రాబోయే సంవత్సరంలో తాము మరింత పొదుపు చేయగలమని 66శాతం మంది ధీమా వ్యక్తం చేశారు. సగటు దిగువ,మధ్యతరగతి భారతీయుల వాలెట్ షేర్‌లో కిరాణా వ్యయం 26శాతం,ఇంటి అద్దె 21శాతం ఖర్చు అవుతుందని అధ్యయనం వెల్లడించింది. దీని తర్వాత ప్రయాణాల కోసం 19శాతం, పిల్లల విద్యకు 15శాతం, వైద్య ఖర్చులు 7శాతం, విద్యుత్ బిల్లులు 6శాతం, వంట గ్యాస్ 4శాతం, మొబైల్ బిల్లులు 2శాతం వెచ్చిస్తున్నారని సర్వేలో వెల్లడైంది.

క్రెడిట్ కోసం వినియోగదారుల ఆసక్తి
దేశంలోని దిగువ మధ్యతరగతి వినియోగదారులు యూపీఐ ప్రారంభించిన యాప్‌ల ద్వారా తక్షణ క్రెడిట్ యాక్సెస్‌ను అనుమతించే ‘క్రెడిట్ ఆన్ యూపీఐ’ ని ఉపయోగించడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. మెట్రోనగరాల్లోని ప్రజల ఆర్థిక శ్రేయస్సులో పెరుగుదల ఉన్నా, వారి ఖర్చులు కూడా పెరిగాయని హోమ్ క్రెడిట్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆశిష్ తివారీ చెప్పారు.


Read More
Next Story