తెలంగాణలో పెరిగిన తలసరి ఆదాయం,సామాజిక,ఆర్థిక నివేదిక -2024వెల్లడి
తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగిందని రాష్ట్రప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక,ఆర్థిక నివేదిక -2024 వెల్లడించింది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి అగ్రస్థానంలో ఉంది.
సామాజిక ఆర్థిక నివేదిక ప్రకారం హైదరాబాద్ నగరం రెండో స్థానంలో ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక,ఆర్థిక నివేదిక -2024 వెల్లడించింది.2023-24వ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం రూ.14.64 లక్షలుగా ఉంది. గత ఏడాది కంటే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 11.9శాతం పెరిగింది.2023-24లో తలసరి ఆదాయం తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం రూ.3.47 లక్షలు. జాతీయ తలసరి ఆదాయం రూ.1.83లక్షలు. అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే రూ.1.64 లక్షలు అధికమని తేలింది. తెలంగాణ వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి సాధించింది. తెలంగాణలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగంలో 10.1శాతం వృద్ధిని సాధించింది.
పెరిగిన బడ్జెట్ అంచనాలు
2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 2024-25 తెలంగాణ బడ్జెట్ అంచనాలు 22.8 శాతం పెరిగాయి. 2023-24లో రూ. 2,24,625 కోట్లు కాగా 2024-25 నాటి బడ్జెట్ అంచనా రూ.2,75,891 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రాబడి 15.4 శాతం పెరిగింది.
అభయ హస్తం ఆరు హామీలు...
అభయ హస్తం పథకం ఆరు హామీల అమలుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.53,196 కోట్లను రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. మహాలక్ష్మీ పథకం కింద ఒక్కో నిరుపేద మహిళకు నెలకు రూ.2,500, ఉచిత బస్సు రవాణ సౌకర్యం, రూ.500లకే ఎల్పీజీ సిలిండరు, రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు,వరి ధాన్యానికి 500రూపాయల బోనస్, గృహ జ్యోతి పథకం కింద అర్హులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, భూమి ఉంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, సొంత ఇల్లు లేని వారికి 250 గజాల స్థలం, విద్యా భరోసా కార్డు కింద విద్యార్థికి రూ.5లక్షలు, మండలానికి అంతర్జాతీయ పాఠశాల, చేయూత పథకం కింద వృద్ధులకు రూ.4వేల పెన్షన్ అందించాలని నిర్ణయించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద బీమాను రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు.
బడ్జెట్ కేటాయింపుల్లో పంచాయతీరాజ్ శాఖకు అధిక నిధులు
బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కువ భాగం రూ.40,080 కోట్లను పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖకు కేటాయించారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు ,నీటిపారుదల కోసం రూ.28,024 కోట్లు కేటాయించారు.విద్యకు రూ.21,389 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.11,500 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.21,874 కోట్లు,ఎస్టీ సంక్షేమానికి, రూ.13,313 కోట్లు,బీసీ సంక్షేమానికి రూ.8,000కోట్లు,మైనారిటీలకు రూ.2,262 కోట్లను బడ్జెట్ లో కేటాయించారు.
రైతులకు ప్రాధాన్యం
రైతు భరోసా, పంట రుణాల మాఫీ పథకం,పంటల బీమా, రైతు బీమా,వరి పంటకు బోనస్ పథకాల ద్వారా రైతన్నల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. కుటుంబాల విభజనతో రాష్ట్రంలో చిన్న కమతాల సంఖ్య పెరిగిందని తేలింది.సన్న, చిన్నకారు రైతుల సంఖ్య 91.4 శాతానికి పెరగడంతో సగటు భూ కమతాల విస్తీర్ణం హెక్టారు నుంచి 0.80 శాతనికి పెరిగింది.
21.10 శాతం మంది పిల్లలు విద్యకు దూరం
తెలంగాణలో 14 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలు, యువతలో 21.10 శాతం మంది విద్యకు దూరంగా ఉంటున్నారని తాజా సామాజిక,ఆర్థిక నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఇన్, అవుట్ పేషంట్లలో 11 శాతం మంది 14 సంవత్సరాల లోపు పిల్లలున్నారని తేలింది.
సంక్షేమానికి పెద్దపీట
సీఎం ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. మహాలక్ష్మీ పథకం కింద 54.75 లక్షల సబ్బిడీని ఎల్ పిజీ సిలిండర్లకు అందించారు. ఇందిరమ్మ ఇళ్లు, స్కాలర్ షిప్ లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద సాయం అందించారు.
Next Story