వైసీపీలో అసమ్మతి సెగలు, మారుతున్న సమీకరణలు


ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీలో రాజకీయ అలజడి మొదలైంది. పార్టీ టికెట్లు ఎవరికి దక్కుతాయో, ఎవరికి దక్కవో అర్థంకాని పరిస్థితి నెలకొంది. జిల్లాల విభజనలో ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గం వరకు ప్రకాశం జిల్లాగా ఉంది. అయితే ఒంగోలుకు దగ్గరగా ఉన్నందున సంతనూతలపాడు నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లాలోనే ఉంచారు. గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి, పర్చూరు, చీరాల బాపట్ల జిల్లాలోకి వెళ్లాయి. కందుకూరు నియోజకవర్గం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వెళ్లింది. దీంతో ఎనిమిది నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి.



అయోమయంలో ఎమ్మెల్యేలు
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన కొండపి, సంతనూతలపాడులకు గతంలో ఉన్న వారిని కాదని కొత్తవారిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. మిగిలిన నియోజకవర్గాలకు కూడా కొత్త వారిని ఎంపిక చేసే ఆలోచనలో వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఉంది. నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నాకు ఎదురు లేదనుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరమైంది. మార్కాపురం నియోజకవర్గానికి ప్రస్తుత ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జెంకె వెంకటరెడ్డిలు సీటు కోసం పట్టుపడుతున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం అయితే జెంకె వెంకటరెడ్డికి సీటు ఇవ్వాలి. కానీ ఇంతరకు ఏమీ తేల్చలేదు.
జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాలపై జిల్లా అధ్యక్షులు జెంకె వెంకటరెడ్డిని ఫెడరల్‌ ప్రతినిధి ప్రశ్నించగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులను స్వాగతించాల్సిందేనన్నారు. ఒంగోలు కేంద్రంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పిస్తే చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా బాలినేనికి మంచి పేరుందని, అందువల్ల ఆయనకు పార్టీలో ప్రయారిటీ ఇవ్వాల్సిందేనన్నారు. ‡
పార్టీలో పట్టు కోసం బాలినేని పోరాటం
ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం పోరాట బాట పట్టారు. సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న వారు ఉన్నారని, వారిని ఎదుర్కొనేందుకు నేను పోరాడక తప్పడం లేదని పలు సార్లు బాలినేని చెప్పారు. బాలినేని బావమరిది వైవీ సుబ్బారెడ్డితో రాజకీయంగా స్పర్థలు ఉన్నాయి. గతంలో బాలినేని సూచనలు సీఎం జగన్‌ పరిగణలోకి తీసుకునే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే బాలినేని ఒకటికి రెండు సార్లు రాజకీయ మంటపుట్టించే మాటలు మాట్లాడారు. దీనిపై సీఎం కూడా ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈనేపథ్యంలోనే ఒంగోలు అభ్యర్థిని మార్చక తప్పటం లేదని సమాచారం. తన కుమారుడు ప్రణీత్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని బాలినేని ఇప్పటికే సీఎంను కోరినట్లు సమాచారం. అయితే సీఎం ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. జిల్లా రాజకీయ పరిశీలకులుగా ఉన్న వేణుంబాకం విజయసాయిరెడ్డి బాలినేనికి నచ్చజెప్పాలని సూచించినా ప్రయోజనం లేకపోవడంతో రాజకీయ అనిశ్చితి జిల్లాలో నెలకొంది. మంత్రి ఆదిమూలపు సురేష్‌తో బాలినేని ఒకింత ఆగ్రహంతో ఉన్నట్లు బాలినేని సన్నిహితులు చెబుతున్నారు. బాలినేని చేస్తున్న ప్రతిపాదనలకు మంత్రి సురేష్‌ అడ్డుపడుతున్నారని బాలినేని సన్నిహితులు చెప్పారు. అందుకే సురేష్‌ వ్యవహారశైలిపై కాస్త కోపంతోనే బాలినేని ఉన్నారని సమాచారం.

బాలినేని చుట్టూ...
ఒంగోలు నియోజకవర్గం నిత్యం వార్తల్లోకి వస్తూనే ఉంది. ఇక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పలు సందర్భాల్లో పలు విధాలైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. నియోజకవర్గంలో తనకు సీటు రాకపోవచ్చు. మహిళల కోటాలో నా భార్య శచీదేవికి రావొచ్చని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. ఇటీవల మంత్రిగా అవినీతి విషయమై మాట్లాడుతూ మాకూ ఖర్చులు ఉంటాయి. మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నానన్నారు. ఆ తరువాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను అలా అనలేదు. పార్టీ ఫండ్‌గా వస్తే తీసుకున్నానని మాట మార్చారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బాలినేనిని ఒంగోలు నియోజకవర్గం నుంచి తప్పించి వేరేవారికి టిక్కెట్‌ ఇవ్వాలనే ఆలోచనకు అధిష్టానం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిని కలిసి బాలినేని మాట్లాడారు. అయినా ఆయన సంతృప్తి చెందలేదు.
ప్రతిపాదనలో కరణం బలరాం..
ఒంగోలు నియోజవర్గానికి ఒంగోలు మాజీ ఎంపీ కరణం బలరామ్‌ పేరును వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో బాలినేని కినుక వహించి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఏమైనా నేను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని చెబుతున్నారు.
మంత్రి నాగార్జున రాణిస్తారా?
సంతనూతలపాడు (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గానికి వేమూరు ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునను ఇన్‌చార్జ్‌గా వైఎస్సార్‌సీపీ నియమించింది. ప్రస్తుత ఎమ్మెల్యే తలతోటి జయరత్న సుధాకర్‌బాబును పక్కన బెట్టారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన బిఎన్‌ విజయకుమార్‌ రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి ఎలాగైనా గెలుపు సాధిస్తాననే ధీమాలో ఉన్నారు. నాగార్జునకు నియోజకవర్గం పూర్తిగా కొత్తయినందున రాణిస్తారా లేదా అనే సందేహాలు వైఎస్సార్‌సీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

సమీక్షలు మొదలు పెట్టిన సురేష్‌
కొండపి (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గంలోనూ అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్సార్‌సీపీ మంత్రి ఆదిమూలపు సురేషన్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు కొండపిలో వరికూటి అశోక్‌బాబు, డాక్టర్‌ వెంకయ్యలు ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. ఇరువురిని కాదని సురేష్‌కు బాధ్యతలు అప్పగించారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా డాక్టర్‌ బాలవీరాంజనేయ స్వామి రెండు సార్లు ఇక్కడ గెలుపొందారు. కొండపి నియోజకవర్గంతో సురేష్‌కు సంబంధాలు లేవు. మంత్రిగా అపుడపుడూ వచ్చిపోవడం తప్ప. నియోజవర్గానికి ఇన్‌చార్జ్‌గా ముఖ్యమంత్రి తన పేరు ప్రకటించాకే నియోజకవర్గంలో ఆయన హడావిడి మొదలయింది. అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి. అందుకు ఎంత ఖర్చవుతుందనే వివరాలు అధికారుల నుంచి సేకరించారు. నాయకుల నుంచి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి వద్ద పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకుని అడుగులు వేయాలని సురేష్‌ చూస్తున్నారు. అదే జరిగితే కొంతవరకు సురేష్‌పై పాజిటివ్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్లు చెప్పటానికి ఇష్టపడని కొండపి నియోజకవర్గ నాయకులు తెలిపారు.
Next Story