కూలోళ్ల నోట్లో మట్టి కొట్టి రూ.300 కోట్లు స్వాహా!
x

కూలోళ్ల నోట్లో మట్టి కొట్టి రూ.300 కోట్లు స్వాహా!

తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య పరీక్షల పేరిట రూ.300 కోట్ల స్వాహా జరిగిందా? అంటే అవునంటోంది సీపీఎం. ఈ మేరకు రేవంత్ రెడ్డికి సీపీఎం బహిరంగ లేఖ రాసింది.


తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేశామని చెప్పి రూ.300కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి వైద్య పరీక్షలు నిర్వహించినందుకు భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు (టీబీఓసీడబ్ల్యూ) సీఎస్ సీ కాంట్రాక్టు సంస్థకు 3,256 రూపాయలు చెల్లించిందని సీపీఎం వెల్లడించింది.

- గత ఏడాదిన్నర కాలంలో 9,50,000 మంది భవన నిర్మాణ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రూ.298 కోట్ల కాంట్రాక్టును సంస్థకు చెల్లించారు.

పరీక్షల పేరిట గోల్ మాల్
భవన నిర్మాణ కార్మికుల నుంచి రక్తపు నమూనాలను సేకరించి 18 రకాల పరీక్షలు చేస్తున్నట్లు రిపోర్టులు ఇచ్చారని సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ ఆరోపించారు.వైద్య శిబిరాలు నిర్వహించక పోయినా దొంగ లెక్కలు రాసి ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి.

టెండర్ లేకుండా కాంట్రాక్టుపై ఒప్పందమా?
సీఎస్ సీ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ 2022 వ సంవత్సరంలో ఏర్పాటైంది. సంస్థ ఏర్పాటైన ఏడాదికే దీనికి ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎలాంటి టెండరు పిలవకుండానే సీఎస్‌సీ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థకు బీఓసీ డబ్ల్యూ బోర్డు ఒప్పందం ఎలా కుదుర్చుకుందని సీపీఎం ప్రశ్నించింది.

ఏసీబీ దర్యాప్తు చేయించాలి
ఈ కాంట్రాక్టు ఒప్పందంపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే తెలంగాణ కార్మిక శాఖ అధికారులు స్పందించలేదు. ఈ కాంట్రాక్టు ఒప్పందం లోప భూయిష్టంగా ఉందని, కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ కమిషనరుకు విన్నవించినా ఫలితం లేదని సీపీఎం కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. ఆరోగ్య పరీక్షల పేరిట కార్మిక నిధులను దోపిడీ చేస్తున్నారని, దీనిపై వెంటనే ఏసీబీతో దర్యాప్తు జరిపించాలని సీపీఎం కోరింది.

ఒప్పందాన్ని రద్దు చేయాలి
సీఎస్ సీ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుండగా వారిలో 11 లక్షల మందికి వైద్య పరీక్షలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో పలు డయాగ్నస్టిక్ సంస్థలుండగా, వీటిని కాదని ముంబయికు చెందిన సంస్థతో తెలంగాణ కార్మిక శాఖ ఒప్పందం చేసుకోవడం ఏమిటని సీపీఎం ప్రశ్నించింది.


Read More
Next Story