జగన్ రూటే సెపరేటు..

ఈ మార్పు ఏవైపుకో..


జగన్ రూటే సెపరేటు..
x
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు (ఫైల్‌ ఫొటో)

రోగమొక చోటయితే మందొకచోట వేస్తే నయమవుతుందా? పొగొట్టుకున్న చోట వెతకడానికి బదులు మరొక చోట వెతికితే పోయింది దొరుకుతుందా? ఇవన్నీ ఒట్టి సామెతలేనా? అవుననే వైసీపీ అధిష్టానం అంటుంటే చెల్లని రూపాయి ఎక్కడైనా చెల్లదు కదా అంటోంది విపక్షం.

వైఎస్ జగన్ ఏదైనా ముందే చెప్పి చేస్తాడు. పద్ధతి మార్చుకుంటారా? మిమ్మల్నే మార్చేయమంటారా? అని జగన్ చాలా కాలంగా చెబుతూనే వచ్చాడు. ఆమధ్య ఎప్పుడో అందర్నీ కూడేసి మైకు తీసుకుని పెద్దగా అరిచి మరీ చెప్పారు. అయినా ఫలితం లేకపోయింది. ఉన్నట్టుండి ఏకంగా 11 మంది ఎమ్మెల్యేల్ని అటోళ్లని ఇటు ఇటోళ్లని అటూ మార్చేశాడు. చిత్రమేటంటే వాళ్లలో ముగ్గురు మంత్రులూ ఉన్నారు. మరో ముగ్గురికి టికెట్లే లేవు పొమ్మన్నాడు. మరికొందరికేమో పొమ్మనకుండా పొగ పెట్టాడు.
గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులను షిప్టింగ్‌ చేస్తున్నా, మీ ఇష్టమైతే ఉండండి లేదంటే బయటికి పోండన్నట్టుగా పార్టీ నాయకులతో చెప్పించారు. అసలింతకీ అభ్యర్థుల మార్పు మంత్రం ఎంతవరకు పని చేస్తుందన్నది రాష్ట్ర ప్రజల్ని తొలుస్తున్న ప్రశ్న. వీళ్లందరూ సుద్ధపూసలైతే ఎందుకు మార్చుతారన్న సందేహం కూడా ఓటర్లను వెంటాడుతోంది. ఏదో చేసే ఉంటారన్న శంకా వెన్నాడుతోంది. ఇంతకీ వీళ్లు ఏమి తప్పులు చేసి ఉంటారు? ఎంతెంత తిని ఉంటారు? అన్నది జనం నుంచి ఎదురవుతున్న అనుమానాలు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏమంటారంటే.. ప్రస్తుతం నియోజకవర్గం మార్చిన ఎమ్మెల్యేలు, మంత్రులందరూ నిలువు దోపిడీ చేసిన వాళ్లే. ఒక్కొక్కళ్లు అందినకాడికి దోచుకున్నారు. భూములు కబ్జా చేశారు. ఆక్రమణలు చేశారు. ఇప్పుడు నియోజకవర్గాల నుంచి పారిపోతున్నారు అంటున్నారు. ఈ ఆరోపణపై మంత్రి విడదల రజనీ కస్సుమన్నారు.
ఇంచార్జ్ లా అభ్యర్థులా? ఎవరు వీళ్లు?
గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈ మార్పులతో మా రాజకీయ జీవితం చిద్రమైందని ఆ 11మంది లబోదిబో మంటున్నారు. టీడీపీకి కాస్త మొగ్గున్నందుకే మార్చేస్తే మా బతుకేలేం కాను? పిచ్చి సర్వేలతో రాజకీయ జీవితాలకు సమాధి కడతారా? అంటూ నియోజకవర్గాలు మారిన వైఎస్సార్‌సీపీ నేతలు వాపోతున్నారు. అయితే పార్టీ గెలుపు ముందు ఈ ఏడుపులు పెడబొబ్బలు చెల్లుబాటు కావు కదా.
జగన్ రూటే సెపరేటు..
జగన్ రూటే సెపరేటు. అనూహ్య మార్పులే ఆయనకు పునాది. రాజకీయ లక్ష్యం ముందు తన మన తేడా చూపరు. గెలుపోటముల రుచి జగన్ కి తెలిసిన వేరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అయినవాళ్లయినా, పరాయి వాళ్లయినా పట్టించుకోరు. గమ్యం చేరేంత వరకు విశ్రమించరు. ఆ క్రమంలోనే తాజా మార్పులు చేర్పులు. వేమూరులో ఉండే మంత్రి మేరుగు నాగార్జునను సంతనూతలపాడుకు పంపించారంటే ఏమనుకోవాలి.. ఇది దేనికి సంకేతం. అర్థం చేసుకున్నోళ్లకి చేసుకున్నంత..
నాన్‌లోకల్‌ను ఆదరిస్తారా
స్థానికులకే ఎన్నికల్లో చుక్కలు చూపించే కాలమిది. కోట్లు పెట్టినా ఓట్లు రాని సమయం. అప్పుడెప్పుడో ఎన్టీరామారావో, ఇందిరా గాంధో గెలిచారంటే ఆవేళ్టి పరిస్థితులు వేరు, ఇవాళ అలా కాదన్నది రాజకీయ విశ్లేషకుడు ఉప్పల లక్మణ్ అభిప్రాయం. అటువంటిది ముక్కూమొఖం తెలియని వ్యక్తిని నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా పంపిస్తే ఆదరణ ఉండదని కూడా లక్ష్మణ్ చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికతకు పెద్దపీట వేస్తున్న తరుణంలో జగన్ చేసిన మార్పులు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం స్థానికతనే ప్రజలు కోరుకుంటున్నారన్న విషయం జగన్ కి తెలియంది కాదు. అయినా సరే మార్పులు చేశారంటే ఏదో పరమార్ధం ఉండే ఉండాలి. ఫలితం ఏమిటన్నది వేచి చూడాల్సిందే.


Next Story