
బీసీల విషయంలో బీఆర్ఎస్ ఎప్పుడూ చిత్తశుద్ధి లేదు: కవిత
మున్సిపల్ ఎన్నికల వేళ BRS వైఖరిపై కవిత ప్రశ్నలు లేవనెత్తారు. BC రిజర్వేషన్లు, ప్రచారం లోపం, కొత్త పార్టీ ప్రకటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ వైఖరిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తప్పుబట్టారు. ఈ పార్టీకి బీసీ రిజర్వేషన్లపై ఎప్పుడూ చిత్తశుధ్ది లేదని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ఆలోచించి నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించాలని కవిత కోరుకుంటున్నారా? అన్న చర్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని కవిత వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఏమాత్రం చురుకుగా లేదని అన్నారు. బీసీల అంశంలో BRS స్పష్టమైన వైఖరి చెప్పలేదని అన్నారు. ముందుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తావించిన కవిత, రాష్ట్రస్థాయి నేతలుగా చెప్పుకునే వారు క్షేత్రస్థాయిలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ రావు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ఎందుకు చేయడం లేదని, వారు రాష్ట్ర నాయకులు కాదా? అని ప్రశ్నించారు.
అనంతరం BC రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యమంలో BRS చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆమె ఆరోపించారు. BCల కోసం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించలేదని గుర్తుచేశారు. జనగణన విషయంలో కూడా గందరగోళం సృష్టించారని చెప్పారు. BC రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మాధవరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో BRS టికెట్ ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
ఆ నిర్ణయం ద్వారా పార్టీ BCల పట్ల ఉన్న వైఖరి బయటపడుతోందని వ్యాఖ్యానించారు. ఆ పిటిషన్ వల్ల తీసుకొచ్చిన ప్రభుత్వ ఆదేశం నిలిచిపోయిందని ఆమె గుర్తుచేశారు. ఈ క్రమంలో BRS పెద్ద నాయకులు పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారా అనే సందేహాన్ని కవిత వ్యక్తం చేశారు. పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన నాయకత్వం మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారిందన్నారు.
తదుపరి తన రాజకీయ భవిష్యత్తుపై కవిత స్పందించారు. మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని తెలిపారు. సరైన సమయాన్ని, మంచి ముహూర్తాన్ని చూసే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణం ప్రజల మద్దతుపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
తనపై విమర్శలు చేస్తున్న వారిపై స్పందించిన కవిత, రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, వ్యక్తిగత ఆరోపణలు వస్తే తాను స్పందిస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో తన రాజకీయ వ్యూహం మరింత స్పష్టంగా ఉంటుందని చెప్పారు.
మొత్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాల్సి ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

