కేసీఆర్: 2023 ఫస్టాఫ్ సూపర్ హిట్.. సెకండాఫ్ ఫట్
x
మాజీ సీఎం కేసీఆర్

కేసీఆర్: 2023 ఫస్టాఫ్ సూపర్ హిట్.. సెకండాఫ్ ఫట్

కేసీఆర్, ప్రచారం అక్కరలేని ఓ సంచలనం. బక్కపలుచని వ్యక్తి. అరవై కేజీలు ఉంటాడు. కానీ వ్యూహాలు పన్ని ఆయకంటే ఎత్తు, దొడ్డు ఉన్న నేతలను ఎన్నో సార్లు బొల్తా కొట్టాంచారు.


అది గల్లీలో ఉన్న లీడర్ల దగ్గరి నుంచి ఢిల్లీలో ఉన్న లీడర్లకు నేరుగా తగులుందని తెలంగాణ ఉద్యమ సమయంలో స్వయంగా చూశాం. ఎత్తులు, పొత్తులతో తెలంగాణకి ‘నై’ అన్న లీడర్లతోనే ‘ఎస్’ అని అనిపించిన నాయకుడు. తెలంగాణ సమాజం ఆయన ఏం చెప్పినా వింది. మాట దాటే ప్రయత్నం చేయలేదు. అదీ ఆయనపై ఉన్న నమ్మకం.

ఉద్యమ నాయకుడు కాస్త ప్రభుత్వాధినేత అయిన తరువాత కూడా ఇదే జరిగింది. 2018లో ముందస్తు ఎన్నికల సమయంలో కూడా ఆయన మాట పై నమ్మకం ఉంచే 88 సీట్లను కట్టబెట్టింది. అలా టీఆర్ఎస్ ప్రస్థానం 2001 ప్రారంభం నుంచి 2022 వరకూ ఏం చెప్పినా చెయ్యేత్తి జై కొట్టింది.

ఈ లోపు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది. కేసీఆర్ రాజకీయ చరిత్రలో 2023కు ప్రత్యేక స్థానముందని చెప్పవచ్చు. దేశ చరిత్రలో అత్యద్భుతమైన నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు, కొన్ని అపఖ్యాతులను సైతం మూటగట్టుకున్నారు. వాటి పరిణామాలు ఏవిధంగా తెలంగాణ రాజకీయ చరిత్రను మార్చాయో చూద్దాం.

అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపన




భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 14, 2022న కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. అంబేడ్కర్ 125 వ జయంతి సందర్భంగా 125 అడుగల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తామని 2016లోనే కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న 11 ఎకరాలు కేటాయించారు. దాదాపు 146 కోట్ల ఖర్చుతో పార్లమెంట్ లో పోలీఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రారంభించగలిగారు. అంబేడ్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ సాధ్యమైందని చాలా సందర్భాల్లో కేసీఆర్ ప్రస్తావించారు. ఇదీ దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం.

దేశంలోనే అతిపెద్ద సెక్రటేరియట్ ప్రారంభం




ఏప్రిల్ 30, 2022న తెలంగాణ సెక్రటేరియట్ ను కేసీఆర్ ప్రారంభించారు. 2019న జూన్ 27న శంకుస్థాపన చేశారు. కేవలం 26 నెలల్లోనే సచివాలయ భవనాన్ని పూర్తి చేశారు. సెక్రటేరియట్ కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంగా సీఎం కేసీఆర్ పేరు పెట్టారు. మొత్తం రూ. 617 కోట్లను ఇందుకోసం ఖర్చుపెట్టారు.

మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో పదిలక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. సీఎం చాంబరే లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఎనిమిది అంతస్తులుగా సచివాలయాన్ని నిర్మించారు. ఇండో సార్సానిక్ శైలిలో నిర్మాణం జరిగింది.

పాలనా సౌధాన్ని ఓ వైపు నుంచి చూస్తే నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయం, వనపర్తి సంస్థానం, గుజరాత్ లోని సలైన్ పూర్ హనుమాన్ దేవాలయంలా కనిపిస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద సెక్రటేరియట్ అని తెలుస్తోంది. మొత్తం 600 వందల అడుగుల పొడుగు, 300 అడుగుల వెడల్పులో సచివాలయం నిర్మించారు.

అమరవీరుల స్మారకం..

జూన్ 22న తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభించారు. ఇది కూడా దేశంలోనే అతిపెద్ద స్మారకం. స్టెయిల్ లెస్ స్టీల్ తో నిర్మించారు. నిత్యం జ్వలించేలా, మట్టి ప్రమిద రూపంలో తెలంగాణ సెక్రటేరియట్ ముందు, 3.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. మొత్తం ఆరు అంతస్తులతో 150 ఫీట్ల ఎత్తుతో నిర్మించారు. దీనికి అవసరమైన మొత్తం స్టెయిల్ లెస్ స్టీల్ ను జర్మనీ నుంచి తెప్పించారు. నిర్మాణ కాంట్రాక్టర్ దుబాయ్ కు చెందినవారు. ఎన్ని వందల సంవత్సరాలైన నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇలా తెలంగాణ చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే ఇలాంటి అరుదైన, అద్భుతమైన నిర్మాణాలు చేసింది కేసీఆరే.. అయితే ఇదే సంవత్సరంలో కేసీఆర్ నాయకత్వంపైన కొన్ని మచ్చలు కూడా పడ్డాయి. అవే ఆయన అధికారం నుంచి దిగిపోవడానికి ప్రధాన కారణమైందని చెప్పవచ్చు. అవేంటంటే..

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ

ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి ముంచుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం.. తరువాత బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంది. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇందులో ఒక ముద్దాయని ఈడీ చార్జీషీట్ దాఖలు చేసింది. అందులో భాగంగా రెండు సార్లు విచారణకు హజరైయ్యారు. ఈ స్కాంలో 33 శాతం వాటా మేడమ్(కవిత)కు అందినట్లు మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ ఆరోపించింది. అరుణ్ పిళ్లై ఎమ్మెల్సీ కవిత బినామీగా వ్యవహరించారని ప్రధాన అభియోగం. కవిత అరెస్ట్ అవుతారని ఓకానొక సమయంలో కేసీఆర్ సైతం భయపడిపోయారు. కానీ ఈ కేసు విచారణలో నెమ్మదించింది.

బీజేపీ కి ‘బీ’టీం అనే ప్రచారం

బీజేపీకి, బీఆర్ఎస్ ‘బీ’ టీం అనే ప్రచారం బాగా జరిగింది. కవిత అరెస్ట్ విషయంలో ఆలస్యం జరగడం, తెలంగాణలో అసలు అవినీతే జరగడం లేదని ప్రచారం వెనక బీజేపీ ఉందనే అనుమానాన్ని కాంగ్రెస్ బాగా సొమ్ము చేసుకోగలిగింది. అంతకుముందు అధికార బీఆర్ఎస్ పై దూకుడుగా ముందుకు వెళ్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మార్పు వెనక కూడా బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం ఉందని అనుమానాలు ఉన్నాయి. ఇవి కాస్త తెలంగాణ పీఠం పై నుంచి కేసీఆర్ దిగిపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్న చిన్న తప్పులకే దేశంలోని ఇతర రాజకీయ పార్టీలపై దాడులు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ని అవినీతి ఆరోపణలు చేసిన కేసీఆర్ ఫాం హౌజ్ జోలికి వెళ్లే సాహాసం మాత్రం చేయలేదు.

పేపర్ లీక్ ఘటన

బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుదిబండగా మారిన అతిపెద్దఘటన పేపర్ లీక్. నేరుగా ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రభావితం అయ్యారు. ఏకంగా 16 పేపర్లు లీక్ అయినట్లు తెలియడంతో నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోయారు. పదేళ్ల తరువాత విడుదైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొదట పేపర్ లీక్ తో రద్దు కాగా, రెండో సారి నిర్వహించిన ప్రిలిమ్స్ ను హైకోర్టు రద్దు చేయడం నిరుద్యోగులకు పుండు మీద కారం చల్లినట్లయింది.

పూర్తి చేసిన పరీక్షల ఫలితాలను కోర్టు వివాదాల పేరిట నెలల తరబడి జాప్యం చేయడం కూడా కేసీఆర్ సర్కార్ పతనానికి కారణంగా చెప్పవచ్చు. ఈ ప్రభావం ఎలా ఉందంటే.. ఉత్తర తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊరిలో ఇదే అంశంపై చర్చ జరిగింది. ‘పొరగాండ్లను కేసీఆర్ ఆగం చేసిండంట’ అని.

చివరి మాస్టర్ స్ట్రోక్.. కుంగిన సర్వరోగ నివారిణీ




తెలంగాణలోని ప్రతిసమస్యకు ఓ పరిష్కారం ఉందని.. అదే కాళేశ్వరం అని కేసీఆర్ ప్రతి సందర్భంలోను ఎంతో గొప్పగా చెప్పేవారు. కోటీ ఎకరాల మాగాణీకి సాగునీరు, మరో 40 సంవత్సరాల వరకు తాగునీటికి సైతం భరోసా ఇచ్చేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ప్రచారంతో ఊదరగొట్టారు. మూడు బ్యారేజీలు, కిలోమీటర్ల కొద్ది సొరంగాలు, వందల కిలోమీటర్ల కాల్వలు, సర్జ్ పూల్స్, బాహూబలి మోటార్లు ఒకటేమిటీ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే అనేక అబ్బురపరిచే అంశాల సమాహార మన్నారు. కానీ ఎన్నికల ముందు ఒక్కసారిగా ఒక బ్లాక్ మొత్తం కుంగడం, కేసీఆర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.

కేసుల పేరుతో కుట్రలు జరిగాయనే ప్రచారం ప్రారంభించారు.. అది ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. దీన్ని కాంగ్రెస్ తన ప్రచారంలో తెలివిగా వాడుకుంది. ఇళ్లు కట్టుకుంటేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటం.. మరీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు.. ఎందుకు అని ప్రశ్నల వర్షం కురపించింది.

నిధులు మొత్తం కమిషన్ రూపంలో ఫాంహౌజ్ కు చేరాయని ఆరోపణలు గుప్పించింది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంతో గులాబీ పార్టీ విఫలం అయింది. కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కనీసం మాట మాత్రం అయినా తీయలేదంటే డ్యామెజ్ ఏ రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. బ్యారేజ్ కుంగుబాటు పై ఏం మాట్లాడిన ప్రజల ముందు సంజాయిషీ ఇచ్చుకున్నట్లు అవుతుందని నామోషీగా భావించింది. చివరికి అధికారానికి దూరమైంది.

ఇలా 2023 లో కేసీఆర్ చేసిన పనులన్నీ ఆయన అధికార గీతను నిర్దేశించాయి. ముఖ్యంగా చివర్లో జరిగిన డ్యామేజ్ తరువాత ప్రజలు కేసీఆర్ ఏం చెప్పినా వినలేదు, నమ్మలేదు. ఈవీఎంలో తమ తీర్పులను నిక్షిప్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత, జరిగిన చిన్న చిన్న ఆటుపోట్లు తప్ప, మేజర్ డ్యామేజ్ ఏం జరగలేదని చెప్పవచ్చు. 2009 ఎన్నికల సందర్భంగా సీట్లు తగ్గినా, కేవలం ఐదు నెలల కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటి సమైక్య పాలకులను తన వ్యూహలతో చెడుగుడు ఆడుకున్నారు. కానీ 2023లో కాలం ఎదురుతిరిగింది.

Read More
Next Story