
కేసీఆర్, హరీష్ అరెస్టులు ఎప్పుడు?: బీజేపీకి సీఎం రేవంత్ ప్రశ్న
నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. కేసీఆర్ అరెస్టులు, బీజేపీ ఓటు అడిగే హక్కుపై ప్రశ్నలు.
కేసీఆర్, హరీష్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో బీజేపీ నాయకులు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ బహిరంగ సభలో ఈ అంశాన్ని లీడ్‌గా తీసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అంశాన్ని శాసనసభలో చర్చకు పెట్టి సీబీఐకి అప్పగించామని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని తెలిపారు. కేసీఆర్, హరీష్ రావును జైలుకు పంపకుండా ఎవరు అడ్డుకుంటున్నారో బీజేపీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కిషన్ రెడ్డి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు.
బీజేపీకి ఓటు ఎందుకు? ఓటు అడిగే హక్కు ఉందా?
ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు వేసినా, బీఆర్ఎస్‌కు ఓటు వేసినా ఫలితం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. రెండు పార్టీల మధ్య విడదీయరాని బంధం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ గల్లీలో మోరీలు తీయాలంటే మోదీ అవసరమా అని ప్రశ్నించారు. రెండు సార్లు ఎంపీగా గెలిచినా ధర్మపురి అర్వింద్ అభివృద్ధి తీసుకురాలేదని విమర్శించారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీగా ఎందుకు మారలేదని నిలదీశారు. ఎయిర్‌పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డుకు నిధులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మూడు సార్లు మోదీ ప్రధాని అయినా జిల్లాకు ఏం వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ చరిత్ర, వ్యవసాయం, రైతుల పోరాటం
బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ చెత్తకుప్పగా మారిందని అన్నారు. సమస్యలు మరింత జఠిలం అయ్యాయని పేర్కొన్నారు. పన్నెండు ఏళ్లు మోదీ, పదేళ్లు కేసీఆర్ పాలించినా జిల్లా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. అదే సమయంలో జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని గుర్తు చేశారు. మండవ వెంకటేశ్వర రావు, సుదర్శన్ రెడ్డి లాంటి నాయకులు మంత్రులుగా పని చేసి మచ్చ లేకుండా నిలిచారని చెప్పారు.
నిజామాబాద్ వ్యవసాయానికి మారు పేరని తెలిపారు. ఒకప్పుడు క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం వస్తుందన్న నానుడిని ప్రస్తావించారు. ఇక్కడి వ్యవసాయం తెలంగాణతో పాటు దేశానికి ఆదర్శమని చెప్పారు. రైతు సమస్యలపై నిజామాబాద్ రైతుల పోరాటం దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలన, అభివృద్ధి పనులు, భవిష్యత్ హామీలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డీ.శ్రీనివాస్ నాయకత్వంలో 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 2023 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా తాను, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహేష్ గౌడ్ కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చామని తెలిపారు. 2029లో సీఎంగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ నాయకత్వంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా రైతు సమస్యలపై నిజామాబాద్‌లో పోరాటం చేశానని చెప్పారు. తన మనసులో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. జిల్లాకు అవసరమైన నిధులు మంజూరు చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.
వివిధ విద్యాసంస్థల కోసం 600 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో 1045 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. గతంలో మున్సిపాలిటీల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ ప్రతినిధులే ఉన్నారని అన్నారు. ప్రభుత్వం నిధులు ఇచ్చినా బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు.
నిధులు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేలు లేదా మున్సిపల్ శాఖ మంత్రి తన వద్దకు రావాలని తెలిపారు. జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ నుంచే గెలిస్తేనే పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.
నన్నెెలా పిలిచినా నో ప్రాబ్లమ్
కులం, మతం పేర్లతో తనను పిలిచినా అభ్యంతరం లేదని చెప్పారు. బీసీ కులగణన చేసినందుకు గౌడ్ అని పిలిచినా సంతోషంగా స్వీకరించానన్నారు. ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపినందుకు మాదిగ అని పిలిచినా ఆనందంగా ఉందన్నారు. ముదిరాజ్, యాదవ్, సర్దార్ అని పిలిచినా సంతోషమేనని చెప్పారు.
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ేనని తెలిపారు. మైనార్టీలకు అనేక పదవులు ఇచ్చామని చెప్పారు. షబ్బీర్ అలీ ఓడినా పదవి ఇచ్చామని, అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నామని గుర్తు చేశారు. ఎనిమిది మంది మైనార్టీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చామని వివరించారు.
వరంగల్, ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టులు తీసుకువచ్చామని చెప్పారు. నిజామాబాద్‌కు ఎయిర్‌పోర్టు తీసుకురావడం తమ బాధ్యతని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చిందని తెలిపారు.
లెక్క తప్పితే బాధ్యత తీసుకుంటా
3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదే సంఖ్యలో కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని వివరించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, ఇప్పటివరకు 9 వేల కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు. శిల్పారామం పక్కనే మహిళా సంఘాలకు స్థలం ఇచ్చామని తెలిపారు. వరి పండిస్తే 500 రూపాయల బోనస్ అమలు చేస్తున్నామని చెప్పారు.
70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. ఫామ్ హౌస్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు లెక్కలు చూస్తానని గతంలో చెప్పిన మాటను గుర్తు చేశారు. లెక్క తప్పితే బాధ్యత తీసుకుంటానని అన్నానన్నారు. గ్రూప్ వన్ కేసులో హైకోర్టు తీర్పు చెంప చెల్లుమనిపించేలా వచ్చిందని వ్యాఖ్యానించారు. చివరగా నిజామాబాద్ ప్రజలు బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోవద్దని కోరారు. కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.

