
తెలంగాణ పత్తి రైతు చిత్తయ్యాడు: కేటీఆర్
గ్రామాలకు వచ్చే నిధులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే మెహర్బానీ కాదు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తి రైతులు చిత్తయ్యారంటూ మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతాంగం ఆగమైపోయిందని చురకలంటించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గెలిచి సర్పంచ్ అభ్యర్థులను కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగానే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతులను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు.
‘‘రైతుబంధు పాలన పోయింది రాబందు పాలన వచ్చింది. అదిలాబాద్ జిల్లాలో అత్యధిక మంది రైతాంగం పండించే పత్తి పంట కొనుగోలు చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లేదు. ఈ ముఖ్యమంత్రి వచ్చాక పత్తి రైతు చిత్తైపోయాడు. సోయా రైతులను పట్టించుకునే వాళ్ళు లేరు. ఇట్ల మొత్తం రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రైతన్న మా పార్టీ హయాంలో రాజు లెక్క ఉండేవాడు’’ అని గుర్తు చేశారు.
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఆయన ఇంటి ముందుకు వచ్చాయని, అందుకే ఏనాడూ తెలంగాణలోని రైతన్న కేసీఆర్ మీద కోపంతో లేడని అన్నారు కేటీఆర్. రైతుబంధు, రైతు బీమా ఇచ్చి, 7000 కొనుగోలు కేంద్రాలు పెట్టి పంట కొనుగోలు చేసిన చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ ని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణ నదుల పైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేశారని, అందుకే తెలంగాణ రాష్ట్రం పంజాబ్ వంటి రాష్ట్రాలను తలదన్ని దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా నిలిచిందని వివరించారు.
‘‘అదిలాబాద్ జిల్లాలో కేవలం కొన్ని వేల ఓట్లతో అదిలాబాద్, ఖానాపూర్, కాగజ్ నగర్ వంటి నియోజకవర్గాలు కోల్పోయాము. చిన్నచిన్న పొరపాట్ల వలన ఈ సీట్లని కోల్పోయాము కానీ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మన పార్టీ వెంట ఉన్నామని తేల్చి చెప్పారు. చూస్తుండగానే రెండు సంవత్సరాల కాలం అయిపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. మరో రెండేళ్ల తర్వాత కచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఎమ్మెల్యే అనిల్ యాదవ్ కు డబ్బులు ధర్పం లేకపోవచ్చు.. పేదవాడు కావచ్చు.. కానీ మంచి క్యారెక్టర్ మంచి మనసున్న నాయకుడు’’ అని అన్నారు.
‘‘అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన పార్టీ శ్రేణుల పైన ఉన్నది. అదిలాబాద్ ఉమ్మడి జిల్లాను మా పార్టీ హయాంలో అద్భుతంగా అభివృద్ధి చేశాము. కానీ బీజేపీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరుస్తామని చెప్పి స్వయంగా అమిత్ షా మాట ఇచ్చి తప్పిండు. తెలంగాణతో పాటు అదిలాబాద్ జిల్లాకి తీవ్రంగా నష్టం చేస్తున్న బీజేపీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు పలుకుతున్నది. కేంద్రంలోని కాటన్ కార్పొరేషన్ పత్తి కొనకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు నిలదీయలేదు. దీని పైన కూడా మనమే రోడ్డు ఎక్కి ధర్నాలు చేయవలసి వచ్చింది’’ అని అన్నారు.
‘‘రెండు సంవత్సరాల కాలంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి. గత ప్రభుత్వం అప్పుల పైన చెప్పిన తప్పుడు లెక్కలన్నింటినీ ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయదు.. రైతులకు రైతుబంధు ఇవ్వదు.. ముసలి వాళ్లకు పెన్షన్లు ఇవ్వరు.. మహిళలకు రెండున్నర వేలు ఇవ్వరు. తెలంగాణలోని సబండ వర్గాలకు అభివృద్ధి సంక్షేమం అందించిన నాయకుడిపైన రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.. అక్రమ కేసులు ఆరోపణలు చేస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం అందించడమే కేసీఆర్ చేసిన తప్పా…? తెలంగాణ తీసుకువచ్చి అభివృద్ధి చేయడమే తప్పా? రానున్న మున్సిపల్ ఎన్నికల్లోను పంచాయతీరాజ్ ఎన్నికల స్ఫూర్తితో పని చేద్దాము…మన పార్టీ అభ్యర్థులను భారీగా గెలిపించుకున్నాము. దీంతోపాటు ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాల్లో కూడా మంచి విజయం సాధించేలా కలిసి కృషి చేద్దాము. ఈ గెలిచిన సర్పంచులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రెండు సంవత్సరాల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాము’’ అని కోరారు.
‘‘గ్రామాలకు వచ్చే నిధులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే మెహర్బానీ కాదు.. అది రాజ్యాంగ బద్ధంగా గ్రామాలకు గ్రామ సర్పంచులకు దక్కిన హక్కు. దాన్ని కాదనే అధికారం ఎవరికి లేదు అనే విషయాన్ని ఇప్పుడు గెలిచిన సర్పంచులు గుర్తుంచుకోవాలి’’ అని స్పష్టం చేశారు.

