
డైవర్షన్ రాజకీయాలే కాంగ్రెస్ పాలన.. సిట్‌పై కేటీఆర్ ఫైర్
కేసీఆర్ సిట్ విచారణపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ డైవర్షన్ కోసమే విచారణలు జరుగుతున్నాయని ఆరోపించారు.
సిట్ విచారణ మొత్తం రాజకీయ డైవర్షన్ కోసమే సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారులకు కేసీఆర్ పూర్తిగా సహకరించారన్నారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టే ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. చట్టప్రకారం విచారణ ఎర్రవల్లిలో జరగాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు. కోర్టుకు వెళ్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చేదని, అయినా చట్టాన్ని గౌరవిస్తూ కేసీఆర్ స్వచ్ఛందంగా విచారణకు హాజరయ్యారని చెప్పారు. ప్రతి ప్రశ్నకు కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టు సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలేమీ లేవని, లీకులే తప్ప నిజాలు బయటకు రాలేదని కేటీఆర్ అన్నారు. ఈ కేసులో డొల్లతనం క్రమంగా బహిర్గతమవుతోందని తెలిపారు. సిట్ విచారణ పేరుతో ప్రజల్లో అపోహలు, అసత్యాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనను మూడు మాటల్లో చెప్పాలంటే డైవర్షన్, సబ్‌వర్షన్, పర్వర్షన్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ అసమర్థత వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో గత రెండు సార్లు రాష్ట్రానికి దక్కింది సున్నానేనని, ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందన్న భయంతోనే విచారణలు తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని కేటీఆర్ అన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ హత్య ఘటనను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మేడారం జాతరలో వసతులు అధ్వాన్నంగా ఉన్నాయని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీకి పదేపదే వెళ్లినా రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయారని సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు.
తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ చెప్పారు. ఎలాంటి ఒత్తిళ్లకైనా తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రాజకీయ కక్షతో చేసే విచారణల వల్ల నిజాలు మారవని స్పష్టం చేశారు. చివరగా, డైవర్షన్ రాజకీయాలు మానుకుని అభివృద్ధి, హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేటీఆర్ కోరారు.

