కంటోన్మెంటు అసెంబ్లీ బరిలో లాస్యనందిత సోదరి నివేదిత
x
Lasyanandita Sister Nivedita

కంటోన్మెంటు అసెంబ్లీ బరిలో లాస్యనందిత సోదరి నివేదిత

సికింద్రాబాద్ కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను ఎన్నికల్లో పోటీచేస్తానని లాస్యనందిత అక్క నివేదిత ప్రకటించారు.


తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నికలు మే 13వతేదీన జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వతేదీన జరగనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలతో చర్చించిన నివేదిత అనంతరం తాను సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తక్కువ సమయం ఉన్నా కార్యకర్తలందరూ ఈ ఆత్మీయ సమావేశానికి తరలివచ్చారు.


చెల్లి లాస్యనందిత ఆశయసాధనకు కృషి చేస్తా
తాను తన చెల్లి లాస్యనందిత ఆశయసాధనకు కృషి చేస్తానని నివేదిత ప్రకటించారు. తన నాన్న జి సాయన్నను, తన చెల్లి లాస్యనందితను ఆదరించినట్లుగా తనను కూడా కంటోన్మెంటు ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు.కంటోన్మెంట్ నియోజకవర్గ కార్యకర్తలు,అభిమానుల కోరికపైనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రజల హర్షధ్వానాల మధ్య నివేదిత ప్రకటించారు.

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యనందిత మృతి
ఫిబ్రవరి 23వతేదీన పటాన్ చెరు వద్ద ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంటు ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికపై ఈసీ నుంచి ప్రకటన రాగానే తాను ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని నివేదిత చెప్పారు. తాను త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి తాను రాజకీయ రంగప్రవేశంపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని నివేదిత పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఎమ్మెల్యేను కోల్పోయామని నివేదిత కన్నీటి పర్యంతమయ్యారు.

మద్ధతు ఇవ్వాలని వినతి
‘‘కార్యకర్తలు, ఓటర్లు, నేతలు అందరూ ఒక మాట మీద ఉండి 5 సార్లు మా నాన్న సాయన్నను ఎమ్మెల్యేగా గెలిపించారు, చెల్లిని కూడా మంచి మెజారిటీతో గెలిపించారు, మన లీడరును కోల్పోయాం, మీ అందరి మద్ధతుతో ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయించుకున్నా, ఇన్ని సంవత్సరాలు మాకు మద్ధతు ఇచ్చారని, భవిష్యత్ లోనూ నాకు మద్ధతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా’’అని నివేదిత కోరారు.

కంటోన్మెంటులో రాజుకున్న రాజకీయ వేడి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేయడంతో రాజకీయ వేడి ప్రారంభమైంది. కంటోన్మెంటులో రెండు నెలలకే ఎమ్మెల్యే అయిన తన చెల్లి లాస్యనందిత మరణించినందున ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీలు సహకరించాలని నివేదిత కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మద్ధతు తెలపాలని ఆమె అభ్యర్థించారు. లాస్యనందిత అంత్యక్రియలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరిపింది. ఈ ఉప ఎన్నికపై ఏకగ్రీవానికి అన్ని పార్టీలు సహకరిస్తాయా? లేదా ఉప ఎన్నికలు జరుగుతాయా అనేది వేచి చూడాల్సిందే.



Read More
Next Story