సమయం లేదు మిత్రమా.. ఇక ముగిద్దాం! విశాఖలోనే ఆపుదాం!!
నిజానికి ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగాలి. చంద్రబాబు అరెస్టుతో రెండు నెలలు యాత్ర సాగలేదు. తండ్రీ, కొడుకులిద్దర్నీ కేసులు వెంటాడుతున్నాయి.
(యుగంధర్ రెడ్డి, విశాఖపట్నం)
ముంచుకొస్తున్న ఎన్నికలొకపక్క.. పాదయాత్ర చేయాల్సిన ప్రాంతాలు, పలకరించాల్సిన మనుషులు మరోపక్క.. ఇప్పుడేమో సమయం లేదు. చేసేది లేక విశాఖపట్నంలోనే యువగళాన్ని ఆపాల్సి వస్తోంది. విషయమేమిటంటే టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ మనుమడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనుకున్న గడువుకు ముందే ఆపాల్సి వస్తోంది. నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ఆయన ఒడిశా సరిహద్దుల్లోని ఇచ్చాపురం దాకా వెళ్లి అక్కడ ఆగాలి. కానీ అనుకోని కారణాలతో డిసెంబర్ 17న విశాఖపట్నంలోనే నిలిపివేస్తున్నారు. అదే రోజు అక్కడ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆగి సాగిన యాత్ర...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబర్ మూడో వారంలో విశాఖ జిల్లాలో ముగియనుంది. 2023 జనవరి 27న కుప్పంతో ప్రారంభించిన యువగళం యాత్ర వంద నియోజక వర్గాలతో నాలుగు వందల రోజుల పాటు కొనసాగి శ్రీకాకుళంలో ముగియాల్సివుంది. అయితే, చంద్రబాబు నాయుడు అరెస్టు, మారిన రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో డిసెంబర్ లోనే ముగిస్తున్నారు. విశాఖ జిల్లాలో భాగమైన భీమిలి నియోజకవర్గంలో డిసెంబర్ 17 లేదా 19వ తేదీన పాదయాత్ర ముగించేలా పార్టీ నేతలు కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరయ్యేలా చూస్తున్నారు. ముగింపు సభకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆ చివరి దాకా వెళ్లాల్సిన యాత్ర..
నిజానికి ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగాలి. చంద్రబాబు అరెస్టుతో రెండు నెలలు యాత్ర సాగలేదు. ఢిల్లీకి విజయవాడకు మధ్య తిరగడమే సరిపోయింది. లేకుంటే ఈ యాత్ర ఒక కొలిక్కి వచ్చేది. ఇప్పటికీ తండ్రీ, కొడుకులిద్దర్నీ కేసులు వెంటాడుతున్నాయి. మరోపక్క సార్వత్రిక ఎన్నికల టైం ముంచుకొస్తోంది. 2024 మార్చి మూడో వారంలో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు తిరగడానికి కూడా సమయం సరిపోదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ లోనే పాదయాత్రను ముగించాలని పార్టీ నిర్ణయించింది.
తుపానూ ఓ కారణమే...
డిసెంబర్ 17న యువగళాన్ని ముగిద్దామనుకున్నారు. ఇంతలో తుఫాను వచ్చింది. దీంతో మరో మూడు రోజులు పాదయాత్ర వాయిదా పడింది. ఈ మూడు రోజులు కలిసివచ్చేలా మళ్లీ పాదయాత్ర రూట్ ను సరిచేశారు. 17న కాకపోతే 19వ తేదీన యాత్రను ముగించడం ఖాయం అంటున్నారు. ముగింపు సభకు భీమిలి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. నాలుగు ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లు, అనుమతులు ఆధారంగా ముగింపు సభ వేదిక ఖరారవుతుంది. ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భీమిలి నియోజక వర్గ పరిధిలోకి వచ్చే పద్మనాభం, భీమునిపట్నం మండలాలలో అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నారు.