‘‘నేను జాతిపిత కాదూ పిత కాదు’’ పౌర సమాజానికి ప్రతినిధిని
x

‘‘నేను జాతిపిత కాదూ పిత కాదు’’ పౌర సమాజానికి ప్రతినిధిని"

ఒంటరిజీవితానికి తోడులేక ఒక చిన్న లాడ్జి లో జీవించిన మరీ మరీ సామాన్యుడు జయశంకర్. ఇపుడు ఆ జయశంకర్ విగ్రహాలు తెలంగాణలో వందలాదిగా జనం మధ్య కనిపిస్తాయి.


‘‘నన్ను ఏమన్నా అనండి అనకండి, కాని నేను తెలంగాణ జాతి పిత అని నేననుకోవడం లేదు. తెలంగాణ కోసం ఏమైనా పోరాటం తప్పదు. నేను కనీసం ‘పతి’ కాలేదు, ‘పిత’ కూడా కాలేకపోయాను’’ అని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చెప్పేవారు. వివాహం చేసుకోలేదు. కనుక తండ్రి కాలేదు. కనుక తెలంగాణ పిత ఏ విధంగా అవుతాను? అని ఆయన తన జీవన గీత గురించి జయశంకర్ అనేవారు. కాని తెలంగాణ పోరాటం కోసం, ఆరాటం కోసం మరిచిపోలేని వ్యక్తి. అదే ఆయన వ్యక్తిత్వం, జీవితం.

జనధర్మతో జయశంకర్ స్నేహం

1958లో ఆరంభించిన జనధర్మ పత్రికలో జయశంకర్ ఎన్నో వ్యాసాలు, ప్రసంగాలు చేసిన వ్యక్తి. ఎందుకు తెలంగాణ అవసరమో, అత్యవసరమో, అన్యాయాలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశాలపై జయశంకర్ జనధర్మ వార్తలు రాసిన వారు. నీళ్లు, నియామకాలు, నిధుల విషయంపైన చాలా లోతైన పరిశోధనావ్యాసాలు జయశంకర్ రాసారు. మొట్టమొదట 1961న తెలంగాణ పోరాటం మొదలైంది జనధర్మ రచయితలు వ్యాసాలు ఉపస్యాసాలతోనే అని 1958 నుంచి ఎం ఎస్ ఆచార్య 1994 న చనిపోయేదాకా తెలంగాణ రావాలని కోరుకుంటూ ఉపన్యాసాలు, ప్రకటనలు, ఇంటర్వ్యూలో, వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. 1994 ముందు ప్రభుత్వం వారి టివి తప్ప మరొకటి లేదీ లేదు. కనుక పత్రికలే తెలంగాణ కు మాధ్యమం జనధర్మ వంటి దిక్కు. అప్పట్లో పత్రికలు మద్రాస్ నుంచి వచ్చేవి. తరువాత విజయవాడనుంచి మాత్రమే వచ్చేవి. హైదరాబాద్ కు పత్రికలు రావడం కూడా చాలాకాలం తరువాతనే. కేవలం ఆంధ్రభూమి డెక్కన్ క్రానికల్ ఒక్కటే పెద్ద పత్రిక తెలంగాణ కోసం ఉండేది. నిజానికి తెలంగాణ తరఫున మాట్లాడే వారు రాసేవారు, వినేవారూ, వార్తలు చూసేవారుకూడా లేని రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా రావడం ఒక వింత. ఈ ఉద్యమం కేవలం తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ రాష్ట్రసమితి వచ్చి పెరుగుతున్న సందర్భాలలో కూడా (తర్వాత భారతీయ రాష్ట్ర సమితి) తెలంగాణ వ్యతిరేక పత్రికల హవా ఉండేది. రాజకీయ పార్టీల సంగతి సరే సరి. తెలుగుదేశం పార్టీ టిడిపి అయితే తెలంగాణ పేరెత్తితే కూడా శాసనసభ రికార్డులో తొలగించే ఘనత చంద్రబాబు నాయుడుకు వారి అనుయాయులైన పత్రికా యజమానులకు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రతి జిల్లా కీలకమైన చోట్ల ఎడిషన్లు రావడం ఒక ఆశ్చర్యం. తెలంగాణ కోసం ప్రత్యేక పత్రికలు, టివి చానెల్స్ రావడం కూడా గొప్ప ఆశ్చర్యం కలిగించే రోజులు కూడా తెలంగాణ జనం చేసారు. కనుక తెలంగాణ పోరాడడం. 2014న తెలంగాణ గెలవడం అద్భుతమైన ఆశ్చర్య సంఘటన. అటువంటి వీరుల్లో ముఖ్యమైన వ్యక్తి జయశంకర్. కెసిఆర్, కోదండ్ రాం, ఉద్యమకారులను, అందుకోసం ప్రాణాలు అర్పించినవారిని మరిచిపోవడం సాధ్యం కాదు. సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి జయపాల్ రెడ్డి, ఎందరో వీధిపోరాటానికి కూడా దిగిన వారు చేసిన కృషి కూడా చాలా గొప్పది.

ఆరాటం సరిపోదు, పోరాటం తప్పదు

తెలంగాణ వచ్చింది. కాని ఎందరో తెలంగాణను కూల్చడానికి కుట్రలు చేస్తూనే వచ్చారు, వస్తారు కూడా. ఒక అత్యంత సంపన్నుడు ఒకాయనతో ‘తెలంగాణ రాదు. రానివ్వరు. నా మాట వినండి. పొరబాటున తెలంగాణ వస్తే, ఏ పదేళ్లలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లతో కలిపి విశాలాంధ్ర కావాలని డిమాండ్ చేస్తారు కూడా’ అని ప్రగాఢ విశ్వాసంతో అంటున్నారు కూడా అని ఒక ప్రముఖ దేశస్థాయి ప్రొఫెసర్ అన్నారు. నరనరాలలో తెలంగాణను వ్యతిరేకించిన వారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా తెలంగాణలో ఉన్నా కాంగ్రెస్ లో వచ్చిన వారైనా, టిడిపిలో ఉన్నాలేకపోయినా విశాలాంధ్ర అడుగుతూనే ఉంటారని ఒక సభలో వివరించారు.

విరామమా లేక విరమణా

తెలంగాణ వచ్చినా రాకపోయినా పోరాటం కొనసాగించాలని జయశంకర్ పదే పదే అనే వారు. ఇది విరామమే కాని విరమణ కాదు అని చెప్పేవారాయన. కె సి ఆర్ నిరాహార దీక్షతో కేంద్రప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావానికి 2009 సాధికారిక ప్రకటనతో పునాది లభించింది. 2009న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చితీరుతుందనే అనుకున్నాం. కాని మరో నాలుగేళ్లు ఆలస్యం జరిగింది. కాని ఈలోగానే జయశంకర్ 2011నాడే చనిపోయారు. అప్పడికి ముందుకూడా పోరాటం ఆపడానికి వీల్లేదు అని చెప్పేవారు.

చాలామంది తెలంగాణ వస్తుందంటారా అని పదేపదే జయశంకర్ తో అడుగుతుండే వారు. అంతకుముందు అనే పార్టీలలో ఉన్న నాయకులు తెలంగాణ కోసం ఏం చేస్తారో ఏమో అని అడిగితే ‘‘ముందు తెలంగాణ కోసం పోరాడదాం. తరువాత తెలంగాణను ఏవిధంగా నిలబెట్టుకుందాం, అనే ప్రశ్న కేవలం పార్టీల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, పౌర సమాజం నిలబెట్టుకోవలసిన విషయం పార్టీలతో సంబంధం లేదు’’ అని జయశంకర్ చాలా స్పష్టంగా చెప్పేవారు.

బుల్లెట్లతో కాదు, పట్టు వదలని ఉద్యమాలతోనే

తెలంగాణ కోసం పోరాటాలు ఎన్నో జరిగాయి, తుపాకులు కాల్పులు జరిగి వందలాది మంది చనిపోయారు. బుల్లెట్ల కన్న వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జయశంకర్ ఎప్పుడూ హింసతో తెలంగాణ రాదని చాలా వాదించేవారు. అట్లా అని ఆత్మహత్యలను ఎప్పుడూ అంగీకరించలేదు. ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటే చాలా బాధపడేవారు. ముఖ్యంగా 2009 తరువాత చాలా మంది నిస్పృహతో గురై ఆత్మహత్య చేసుకోవడం దారుణం. అసలు తెలంగాణలో ఉన్నా మరో రాష్ట్రంలోనైనా కూడా ఒక్క వ్యక్తి కూడా ఆత్మహత్యకు గురికావద్దు. రాజకీయాల్లో హత్యలకు బలి కావద్దు కేవలం పోరాటం, అహింసతో మాత్రమే తెలంగాణ సాధించాలని కాల్పులు, ఆత్మహత్యలు ఉండనే లేని సమాజం కావాలని జయశంకర్ అన్నారు.

యాచించి కాదు, శాసించి సాధిద్దాం

తెలంగాణ కోసం బిచ్చం అడుక్కోవద్దు. యాచించి కాదు, శాసించి తెలంగాణ సాధ్యం కావాలని జయశంకర్ గారి పాలసీ. తెలంగాణ రాకముందే జయశంకర్ కాన్సర్ కు బలైపోవడం దురదృష్టం. కాని అందుకు ఆయన దేనికి బాధపడలేదు, భయపడలేదు. ఎందుకంటే పోరాటం కొనసాగుతూ ఉంటే చాలు ఏదో ఒక రోజు జయిస్తాం అని నమ్ముకునే ఆశాభావం పూర్తిగా ఉండేదది ఆయన ప్రతిమాటలో.

సి కె ఎం

వరంగల్లు తెలంగాణకు అసలైన రాజధాని. రచయితలు నాటకీయ రంగం వంటివారి చైతన్యం తెలంగాణను నిలబెట్టింది. అక్కడినుంచే కార్యక్షేత్రం జయశంకర్ నుంచి చేసేవారు. వరంగల్ సి కె ఎం కాలేజ్ ప్రిన్సిపాల్ అంజయ్యగారు చాలా కాలం పనిచేసారు. అంజయ్యగారి కాలంలో ఎమర్జన్సీ రావడం, విప్లవం మాట విన్నా, ఇందిరాగాంధీని వ్యతిరేకించినా జైల్ తప్పని దశ అది. సికెఎం కాలేజ్ మ్యాగజైన్ ఎడిటర్ గా ఉన్నపుడు ఈ రచయిత (శ్రీధర్) ఉన్నపుడు ఒక్కో మాగజైన్ కాపీలన్నీ లెక్కపెట్టి పోలీసులు తీసుకుపోయారు. ఆనాడు ఎడిటర్ ని అరెస్టు చేయకుండా ప్రింటర్లను రక్షించుకోవడానికి ప్రభుత్వ పెద్దలకు వివరించి తద్వారా అరెస్టు ఆపడానికే అంజయ్యగారు ఈ మ్యాగజైన్ లు స్వాధీనం చేసుకునేందుకు ఒప్పుకోకతప్పలేదు. అంజయ్యగారి తరువాత జయశంకర్ ప్రిన్సిపాల్ గా సి కె ఎం కాలేజ్ ఒక ప్రముఖమైన పెద్ద కళాశాలగా సమర్థవంతంగా నడిపారు. ఎమర్జన్సీ తరువాత అప్పుడే ఈవ్యాస రచయిత జర్నలిస్టుగా జయశంకర్ ప్రిన్సిపాల్ గారిని మా మ్యాగజైన్ ఒక్కటన్నా ఇవ్వగలరా అని అడిగితే, ‘‘ఇదడిగితే ఏం చెప్పను. పోలీసుల ఎదురుగ పెట్రోల్ పోసి కాల్చిపారేసారు తెలుసా, ఇంక వివరాలు అడగకు. మరిచిపో’’ అన్నాడాయన. ఆ తరువాత జయశంకర్ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా, ఆ తరువాత కాకతీయ వైస్ చాన్స్ లర్ గా పనిచేసి వ్యవస్థను తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసారు. అయినా ఎక్కడకూడా తెలంగాణ కోసం పోరాటాన్ని ఆపలేదు. ఏ వేదిక దొరికినా ఆ విషయం కోసం వాదించేవారు.

కె సి ఆర్ నిర్మాత, జయశంకర్ దర్శకుడు

కే చంద్రశేఖర్ రావ్ తెలంగాణ రాష్ట్రసమితి లో ఉద్యమానికి కీలకమైన నిర్మాత. దానికి దర్శకుడు జయశంకర్. గంటల గంటలు తెలంగాణ స్ఫూర్తి గురించి మాట్లాడుతూనే ఉండేవారు. కెసి ఆర్ చేసిన ఆలోచనలు వ్యూహాలు, రాజీనామాలు, ఎన్నికలు, ఓడిపోవడం, గెలవడం, నిరాహార దీక్ష దశాబ్దాల పోరాటంలో కె సి ఆర్, జయశంకర్ జంటగా విరామం లేకుండా ఆరాట పడేవారు.

ఎన్నో సార్లు హనుమకొండనుంచి హైదరాబాద్ కు బస్సులో వచ్చేవారు. కొన్ని సార్లు ఈ రచయిత కూడా కలిసి ప్రయాణంచేసేవారం. మూడున్నర గంటలు తెలంగాణ ఎట్ల వస్తుందనే మాటలు తప్పమరేదీ ఉండదు. చేతిలో చిన్న సంచీ అంతే.

పార్టీలుగానీ, పెద్దలు గానీ ఇచ్చే కార్ ల కోసం ఎప్పుడూ ఆశించలేదు. ప్రభుత్వానికి చెందిన కారు ఎప్పుడూ అడిగేవారు కాదు. ఇచ్చినా వద్దనే వారు. వరంగల్లులోగానీ, హైదరాబాద్లో గానీ మామూలుగా ఆటోలు వచ్చిన సందర్భాలు బోలెడు. రిజిస్ట్రార్, వైస్ చాన్సెలర్, ప్రిన్సిపాల్ గా అధికారిక కార్లుమాత్రం వాడేవారు.

ఆయనది చిన్న మట్టి ఇల్లు తెలుసా

వరంగల్లు దగ్గరలో నక్సలైట్ల బాంబులతో పేల్చినప్పుడు అదిరిపోయి కూలిపోయిన ఇల్లు జయశంకర్ ది. అంతమామూలు ఇల్లు. మట్టిగోడలతో కట్టిన ఇల్లు తెలుసా అని ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. ఒంటరిజీవితానికి తోడులేక మామూలు ఒక చిన్న లాడ్జి హోటల్ లో ఉండి జీవితాన్ని నడిపించిన మరీ మరీ సామాన్యుడు జయశంకర్. వందలాది జయశంకర్ విగ్రహాలు తెలంగాణలో ఇప్పుడు ఎన్ని వచ్చాయంటే ఆశ్చర్యం. విచిత్రమేమంటే ఓ ఇల్లుకూడా లేని జయశంకర్ ఇప్పుడు కూడా ఎన్నెన్నో విగ్రహాలు నీడ లేకుండానే ఉంటాయి.

(ఆగస్టు 6 పుట్టిన రోజు సందర్భంగా)

(ప్రిన్సిపాల్, వైస్ ఛాన్సలర్, తెలంగాణ సిద్ధాంత శక్తి జయశంకర్ విద్యార్థి ఈ రచయిత)


Read More
Next Story