మహారాష్ట్ర బీఆర్ఎస్ ఛిన్నాభిన్నం
x
Maharastra KCR Meeting

మహారాష్ట్ర బీఆర్ఎస్ ఛిన్నాభిన్నం

కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు మహారాష్ట్రలో విస్తరించిన బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనంతరం ఛిన్నాభిన్నం అవుతోంది. మహా బీఆర్ఎస్ నేతలు వివిధ పార్టీల్లోకి వలస పోతున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఓటమి పాలవడంతో మహారాష్ట్రలో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ ఓటమి అనంతరం ఆ పార్టీ మహారాష్ట్ర నేతలకు దిశ నిర్దేశం చేసేవారే కరువయ్యారు. ఓటమి అనంతరం ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్ మహారాష్ట్ర నేతలను సంప్రదించడం లేదు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నా, తాము ఎన్నికల్లో పోటీ చేయాలో లేదో కనీసం చెప్పే వారే లేరని మహారాష్ట్ర నేతలు ఆవేదన చెందుతున్నారు. మహారాష్ట్రలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర నేతలు 40 మంది వరకు ఉన్నారు. వారిలో చాలామంది ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. కీలక నాయకులే పార్టీని వదిలి వెళుతుండటంతో పార్టీ కార్యకర్తలను నడిపించే వారే కరువై వారు కూడా ఇతర పార్టీల బాట పడుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ప్రభావం మహారాష్ట్రలో ఆ పార్టీ ఖాళీ అవుతోంది.


మహారాష్ట్రలో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం మహారాష్ట్ర బీఆర్ఎస్ పరిస్థితి అయోమయంలో పడింది.రాష్ట్ర సరిహద్దుల్లోని మహారాష్ట్రపై గతంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినా, ఓటమి తర్వాత మహారాష్ట్ర నేతల లేఖకు కూడా స్పందించలేదు. పార్టీ పేరు మార్చాక తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు తర్వాత పరాజయం పాలైంది. ఓటమి తర్వాత మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలను పట్టించుకునే వారు కరవయ్యారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత కేసీఆర్ మన పొరుగున ఉన్న మహారాష్ట్రలో పలు బహిరంగసభలు ఏర్పాటు చేసి పార్టీని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా బీఆర్ఎస్ తీర్థం స్వీకరించారు.

మమ్మల్ని నట్టేట ముంచారు...
లాతూర్ ప్రాంతానికి చెందిన ఐఎఎస్ అధికారి డాక్టర్ మల్లికార్జున్ ఖేల్కర్ వాలంటరీ రిటైర్ మెంటు తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరి కోఆర్డినేటరుగా పనిచేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తమ మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని డాక్టర్ మల్లికార్జున్ ఖేల్కర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘నేను బీఆర్ఎస్ పార్టీలో చేరి కార్యకర్తలను కూడా పార్టీలో చేర్పించాను, కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మా మహారాష్ట్ర బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది’’ అని ఖేల్కర్ పేర్కొన్నారు. పార్టీ పేరిట తమను నట్టేట ముంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ నుంచి ఎలాంటి దిశ నిర్ధేశం చేయక పోవడంతో తాము కేసీఆర్ కు 22మంది కీలక నేతల సంతకాలతో లేఖ రాశామని ఆయన తెలిపారు. తాము లేఖ రాసినా పార్టీ అధినేత కేసీఆర్ స్పందించలేదని డాక్టర్ ఖేల్కర్ తెలిపారు. మేం కొన్ని రోజులు చూసి మా దారి మేం చూసుకుంటామని ఖేల్కర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ కు దూరమవుతున్న మహా నేతలు
మహారాష్ట్రలో పార్టీ కోసం ఆరుగురు కోఆర్డినేటర్లను కూడా నియమించారు. కానీ ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఓటమి తర్వాత మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు అద్దె కూడా చెల్లించడం లేదు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ కేసీఆర్ కు అక్కడి నేతలు లేఖ రాసినా అధినేత నుంచి స్పందన లేదు. బీఆర్ఎస్ లో చేరి రాజకీయంగా ఎటు కాకుండా పోయామని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలోనే బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మహారాష్ట్రలో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీ దించడంలో కేసీఆర్ విముఖత వ్యక్తం చేసి, తెలంగాణకే పరిమితం అయ్యారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇతర పార్టీల్లోకి నేతల జంప్?
మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు తమ దారి తాము చూసుకునేందుకు ఇతర పార్టీ్లోకి జంప్ అయ్యేందుకు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణలో ఓటమి అనంతరం అకోలా ప్రాంత బీఆర్ఎస్ కోఆర్డినేటర్ పదాజిత్ భోడంకేర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ‘‘నేను రాజకీయంగా బీఆర్ఎస్ తో ఎదగవచ్చని పార్టీలో చేరితే, పార్టీ అధినేత కేసీఆర్ మమ్మల్ని పట్టించుకోలేదు, తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి అనంతరం పార్టీని పట్టించుకోకపోవడంతో నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరాను’’ అని పదాజిత్ భోడంకేర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మహా బీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీ

మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు నడిపేందుకు కేసీఆర్ 15 మంది నాయకులతో స్టీరింగ్ కమిటీని కూడా నియమించారు. ఈ స్టీరింగ్ కమిటీలో మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు భానుదాస్ ముర్కుటే, శంకర్ అన్న డోండ్గీ, అన్నాసాహెబ్ మానే,దీపక్ ఆత్రం, మాజీ ఎంపీ హరిబావు రాథోడ్ తదితరులున్నా వారిలో కొందరు ఇతర పార్టీల్లోకి జంప్ చేసే యోచనలో ఉన్నారు.


కేసీఆర్ కు లేఖ రాసినా స్పందన లేదు...
మహారాష్ట్రకు చెందిన 22 మంది బీఆర్ఎస్ నేతలు సమావేశమై పార్టీ భవితవ్యం గురించి చర్చించి పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. తాము రాసిన లేఖకు పార్టీ అధినేత నుంచి ఎలాంటి స్పందన లేదని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ‘‘ నా పేరు నిఖిల్ దేశ్ ముఖ్. నేను విదర్భ ప్రాంత బీఆర్ఎస్ కోఆర్డినేటర్ని. విదర్భ ప్రాంతంలో ఎంతో ఆర్భాటంగా మేం బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించాం. ఎన్నో ఆశలతో పార్టీని ప్రారంభించి కార్యకర్తలను కూడా చేర్చుకున్నాం, కానీ తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ అధినేత నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. మా పార్టీకి చెందిన 22 మంది నేతలు కలిసి సమావేశమై పార్లమెంటు ఎన్నికల్లో ఏం చేయాలని కోరుతూ కేసీఆర్ కు లేఖ రాశాం. కానీ పార్టీ అధినేత నుంచి తమకు ఎలాంటి సమాధానం లభించలేదు’’ అని విదర్భ బీఆర్ఎస్ నాయకుడు నిఖిల్ దేశ్ ముఖ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

బీఆర్ఎస్‌ను వీడిన ఒడిస్సా మాజీ ఎంపీ గిరిధర్ గొమాంగో
ఒడిశా రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ గిరిధర్ గొమాంగోను హైదరాబాద్ నగరానికి పిలిపించిన కేసీఆర్ ఆయనకు బీఆర్ఎస్ తీర్థం ఇచ్చారు. కేసీఆర్ ఓటమి అనంతరం గిరిధర్ గొమాంగో పార్టీకి రాజీనామా చేశారు. అసలే తెలంగాణలో బీఆర్ఎస్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ పనితీరుపై కేసీఆర్ దృష్టి సారించడం లేదు. దీంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి దూరమవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ
ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు ను చేర్చుకున్నారు. ఏపీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఓటమి తర్వాత రాజకీయాల్లో సైలంట్ అయ్యారు. మరో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్ ను వదిలి వైసీపీలో చేరారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చోటా మోటా నేతలు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. దీంతో ఏపీలోనూ బీఆర్ఎస్ ఖాళీ అయిందని చెప్పవచ్చు.


Read More
Next Story