మజ్లిస్, బీజేపీ ప్రచార హోరు...కాంగ్రెస్ అభ్యర్థి ఒంటరి ప్రచారం
x
కాంగ్రెస్ అభ్యర్థి వలీవుల్లా సమీర్ ఒంటరి ప్రచారం

మజ్లిస్, బీజేపీ ప్రచార హోరు...కాంగ్రెస్ అభ్యర్థి ఒంటరి ప్రచారం

హైదరాబాద్‌‌లో మజ్లిస్,బీజేపీ ప్రచార హోరు సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి వలీవుల్లా ఒంటరి ప్రచారం సాగిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది.


హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మజ్లిస్, బీజేపీ ప్రచారం ఊపందుకుంది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, కొంపెల్లి మాధవీలత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ తో పాటు అతని తమ్ముడైన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఇతర మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారం కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. అలకవీడిన రాజాసింగ్ అమిత్ షా రాక సందర్భంగా ప్రచార పర్వంలో దిగారు. మొత్తంమీద హైదరాబాద్ నగరంలో బీజేపీ, మజ్లిస్ అభ్యర్థుల ప్రచార హోరు కనిపిస్తోంది.


కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోడ్ షో
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి,హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్ చార్మినార్ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రచారంలో అలీ మస్కతీ, ముజీబుల్లా షరీఫ్, మతీన్ షరీఫ్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు వలీవుల్లా సమీర్‌కు స్వాగతం పలికి లోక్‌సభ ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.అప్నే ఆప్ కో ఆజాద్ కరో, కాంగ్రెస్ కు ఓటు వేయండి అంటూ సమీర్ ప్రచారం చేశారుర. మతతత్వ మజ్లిస్, బీజేపీలను ఓడించి హైదరాబాద్ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరుతూ మహమ్మద్ వలీవుల్లా సమీర్ ప్రచారం సాగిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ప్రముఖులేరి?
కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వాడవాడలా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీతో అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా అంతర్గత అవగాహన ఉందని కొందరు భావిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నా హైదరాబాద్ పార్లమెంట్ ప్రచారంలో వారెవరూ కనిపించడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి వలీవుల్లా సమీర్ తన కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులతో తిరుగుతూ ఒంటరి ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో ప్రముఖ నేతలు ఎవరూ కనిపించడం లేదు.

అసదుద్దీన్ ఒవైసీకి శాలువతో సన్మానిస్తున్న ఆలయ పూజారి


అసదుద్దీన్ సుడిగాలి ప్రచారం

హైదరాబాద్ మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ శనివారం నాడు జరిపిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మత సామరస్యం చోటుచేసుకుంది. అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మలక్ పేటలో ఇంటింటి ప్రచారం సందర్భంగా హిందూ పూజారి ఒవైసీకి పూలమాల వేసి స్వాగతం పలికారు. మూసారాంబాగ్ లో మజ్లిస్ అభ్యర్థి ఆంజనేయ స్వామి గుడి పక్కనుంచి అసదుద్దీన్ వెళుతూ అర్చకుడి వద్దకు రాగా ఆయన శాలువా కప్పి ఆశీర్వాదం అందించారు. అనంతరం అర్చకుడితో కలిసి అసద్ ఫొటోలు దిగారు. ఈ ఫోటోకు మతసామరస్యం వెల్లివిరిసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చంద్రాయణగుట్టలోని మజీద్ సాహెబ్ మెట్ వద్ద పాదయాత్ర చేసి అసద్ ఓట్లు అభ్యర్థించారు.

అన్న కోసం తమ్ముడి ప్రచారం
హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ కోసం అతని తమ్ముడు మజ్లిస్ శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తున్నారు. మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన అన్నను గెలిపించాలని అక్బరుద్దీన్ ఓటర్లను కోరారు.

బీజేపీ ప్రచారర్యాలీలో అమిత్ షా , కిషన్ రెడ్డి తదితరులు


హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం అంతంత మాత్రమే...

హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీతో అంతర్గత అవగాహన ఒప్పందం ఉంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్ లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాసయాదవ్ ఎన్నికల బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై ఓటర్లకు వివరించి చెబుతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో హిందూ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలో దించిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.


Read More
Next Story