80 మంది సిట్టింగులకు సీట్లు గల్లంతు?

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న టాక్‌


80 మంది సిట్టింగులకు సీట్లు గల్లంతు?
x
CM Camp office

ఇదేంటీ.. 80 మంది వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మేల్యేలకు సీట్లు గల్లంతవుతాయా? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న టాక్‌ ఇది. 151 మంది ఎమ్మెల్యేలలో పార్టీ మారినోళ్లు మారగా మిగతా వారిలో 80 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు సీట్ల దడ మొదలైంది. సీఎం చేయించిన సర్వేల్లో వీరందరికీ తక్కువ మార్కులు వచ్చాయట. దీంతో వీరి భవితవ్యం త్రిశంకు స్వర్గంలో పడింది.


ఏమిటీ పరిణామం...

2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని సృష్టించింది.ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్షమే లేకుండా చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఐదుగురు పార్టీ అధినేత జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కొందరు నిజంగానే ఇంట్లోకి బయటిరాకుండా స్తబ్ధుగా ఉండిపోయారు. సరిగ్గా ఈనేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు జరిగాయి. కేసీఆర్‌ ప్రభుత్వం ఓడిపోయింది. ఇక అప్పటి నుంచి వైసీపీలో బెంగపట్టుకుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

సర్వేలే ప్రామాణికమా?

సరిగ్గాఈ తరుణంలోనే వైసీపీ అధినేత జగన్‌ సొంత సర్వేలు చేయించుకున్నారు. ఆ ఫలితాలు చూసి కంగు తిన్న జగన్‌ ఇప్పుడు పార్టీ పూర్తి ప్రక్షాళనకు నడుంకట్టారు. ఇందులో భాగంగా దశలవారీగా ఎమ్మెల్యేలను పిలిచి టికెట్లు ఇవ్వలేనని చెప్పేస్తున్నారు. ఇలా ఎవరైతేనేం వచ్చే ఎన్నికల్లో 80 మందికి టిక్కెట్లు ఇవ్వటానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ఆ తప్పు చేయదల్చుకోలేదా?

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సరిగా పనిచేయకపోయినా తెలంగాణలో కేసీఆర్‌ టిక్కెట్లు ఇచ్చి అధికారం పోగొట్టుకున్నారనే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం ముందస్తు మేలు కొలుపును తీసుకోవాలని ఇలా చేస్తున్నారనే చర్చ కూడా సాగుతున్నది. ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన పార్లమెంట్‌ పరిశీలకులను కూడా కూర్చొబెట్టి ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ గెలిస్తే మీకందరికీ భవిష్యత్‌ ఉంటుందని, మీకు సీటు ఇవ్వలేకపోవడానికి కారణాలు ఇలా ఉన్నాయని వారికి వివరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు దిక్కుతోచడం లేదు.

పిలుపుల పరంపరలో...

మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి, పెనుగొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, అమలాపురం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చంటిబాబులకు సీఎం క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా పిలుపు అందింది. సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. మంగళవారం రాత్రికి ఎమ్మెల్యేలతో మాట్లాడే కార్యక్రమం ఈ రోజుకు పూర్తవుతుంది.

నగరి సీటు ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు

తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన క్రీడా శాఖ మంత్రి రోజ నగరి సీటు ఎవరికి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదని, జగనన్న కోసం పనిచేస్తానని తిరుమలలో విలేకర్లతో అన్నారు. అంటే మంత్రికి కూడా క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్‌ సమాచారం వచ్చి ఉంటుందని భావించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే రోజుకు పదిమందికిపైన పిలిపించి మాట్లాడుతున్నారు. తరువాత వరుసలో రోజా కూడా ఉండే అవకాశం ఉంది.

Next Story