మాదీ జిమ్మేదారి ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి
x
CM A. Revanth reddy

మాదీ జిమ్మేదారి ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

అర్హులందరికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నాదీ జిమ్మదారి(బాధ్యత) అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ హమీ ఇచ్చారు.


తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేత పత్రంలో ఎవరిని నిందించలేదని ఆయన అన్నారు. మిగిలిన శాఖలకు సంబంధించిన శ్వేత పత్రాలు కూడా విడుదల చేస్తామని చెప్పారు. అంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాలను సీఎం నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.

రెవెన్యూ రిసీట్స్ కోసం కాగ్, అప్పులు, అడ్వాన్స్ విషయంలో ఆర్బీఐ అంకెలను ప్రామాణికంగా తీసుకున్నామని వివరించారు. ప్రస్తుత వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలనే లక్ష్యంతో ఆర్దిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 2014 నాటికి ఆర్బీఐ దగ్గర 303 రోజులకు సంబంధించి నిధులు ఉంటే ప్రస్తుతానికి అంటే 2023-24 వరకూ కేవలం 30 రోజులు మాత్రమే ఉందని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని వారు ఇచ్చిన చెక్ లు బౌన్స్ అయి రుణ ఎగవేత దారుడిగా మారారన్నారు. అందుకే వాస్తవ లెక్కలను ప్రజల ముందు ఉంచుతున్నామని, ఈ నివేదికతో కొంతమంది కళ్లు తెరుచుకుంటాయని ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. కొంతమంది వారి ఇంటి విషయాలు ఇక్కడికి తెచ్చి మాట్లాడుతున్నారని, సహజంగానే ఇక్కడి నుంచి అక్కడి వెళ్లగానే కొంతమందికి దు:ఖం కూడా వస్తుందని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

రాష్ట్రం కోసం కష్టపడుతున్న అధికారులను పక్క రాష్ట్రం వాళ్లు అనడం సమంజసం కాదని చెప్పారు. ఇందులో చెప్పింది ప్రతీ అంశం రూల్ ప్రకారమే జరిగిందని వివరించారు. కొత్త ప్రభుత్వాన్ని ఎంతోమంది కలుస్తారని చెప్పారు. ‘ నేను స్వయంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కాల్ చేశాను. ప్రధానితో మాట్లాడే అవకాశం కోసం, నేను బేషజాలకు పోదల్చుకోలేదు. సిద్దాంతపరంగా మేం విభేదించిన ఆయన ప్రధానమంత్రి. నిధుల కోసం ప్రధానిని కలవాల్సిన అవసరం ఉంది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల నుంచి విలువైన సలహాలు, సూచనలు ఉంటే స్వీకరిస్తాం. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ లేవనెత్తిన అంశాలను మా అధికారులు నోట్ చేసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామనే హమీ ఇచ్చారు..

Read More
Next Story