రోజుకో రకం సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్న సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట కొత్త రకం ఘరానా మోసాలకు తెర లేపారు.గతంలో ఢిల్లీ, నోయిడా, ముంబయి నగరాల్లో సాగిన ఈ రకం మోసాలు తాజాగా హైదరాబాద్ నగరానికి కూడా పాకాయి. డిజిటల్ అరెస్ట్ కొత్త రకం సైబర్ నేరం కావడంతో బడా వ్యాపారులు భయంతో కంగారుపడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ వ్యాపారిని ఇదే తరహాలో మోసగించారు.
కొరియర్ వచ్చిందంటూ డబ్బు కైంకర్యం
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బడా వ్యాపారికి ఇటీవల కొరియర్ వచ్చిందంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాము కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులమని చెప్పి, మీకు ఫెడ్ ఎక్స్ కొరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టారు. దీనిపై తాము కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. అంతే దీంతో భయ పడిన వ్యాపారి వారు చెప్పిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేయాలని కోరారు. డ్రగ్స్ కేసు భయంతో సదరు వ్యాపారి రూ.98 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాకు బదిలీ చేశారు. డబ్బును బదిలీ చేశాక అనుమానంతో వ్యాపారి హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ అధికారులు
దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అప్రమత్తమై బ్యాంకు ఖాతా గురించి ఆరా తీస్తే ఆ ఖాతా జమ్మూకశ్మీరులోని బారాముల్లా పంజాబ్ నేషనల్ బ్యాంకు జుజు అనే వ్యక్తి ఖాతాగా తేలింది. ఆ డబ్బును వెంటనే మరో ఐదు బ్యాంకులకు బదిలీ చేశారు. ఇందులో సైబర్ నేరగాళ్లు రూ.15లక్షలను అప్పటికే డ్రా చేశారు. మిగిలిన రూ.83 లక్షలను విత్ డ్రా చేయకుండా బ్యాంకర్లకు చెప్పిన హైదరాబాద్ సైబర్ అధికారులు నిలిపివేయించి, డబ్బును రికవరీ చేశారు.
ఐటీ అధికారులమంటూ మోసం
సికింద్రాబాద్ నగరంలోని బాలాజీ జ్యువెలరీ దుకాణానికి అయిదుగురు వ్యక్తులు తాము ఐటీ అధికారులమని తనిఖీలకు వచ్చామంటూ హడావుడి చేశారు. బంగారం కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని బెదిరించి దుకాణంలో ఉన్న బంగారాన్ని తనిఖీ చేయాలని సిబ్బందిని పక్కన కూర్చొబెట్టారు. దుకాణంలో ఉన్న 1700 గ్రాముల బంగారానికి ఆదాయపు పన్ను చెల్లించలేదని చెప్పి, దాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే బంగారంతో పారిపోయారు. ఐటీ అధికారులు ఇలా తనిఖీలు చేయరని, నోటీసులు ఇస్తారని తోటి వ్యాపారులు చెప్పడంతో మోసపోయామని గ్రహించి దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశంలో ఎన్నెన్నో కేసులు...
ఇలా హైదరాబాద్ నగరంలోనే కాదు గత ఏడాది దేశంలో 200 మందికి పైగా ఇలా కొత్త రకం మోసాల బారిన పడ్డారని సాక్షాత్తూ నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. డిజిటల్ అరెస్ట్ మోసాలు 2021వ సంవత్సరంలో 345 జరిగాయి. 2022వ సంవత్సరానికి వీటి సంక్య 685 కేసులకు పెరిగిందని నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నివేదికే వెల్లడించింది.
డిజిటల్ హౌస్ అరెస్ట్ అంటే ఏమిటి? సైబర్ నేరగాళ్లు డిజిటల్ హౌస్ అరెస్ట్ పేరిట కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఈ డిజిటల్ హౌస్ అరెస్ట్ బాగోతం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము ఐటీ,ఈడీ,కస్టమ్స్, సీబీఐ, ఎన్ఐఏ అధికారులమని నమ్మిస్తారు. సిమ్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని చెప్పి మోసగాళ్లు బెదిరిస్తారు. మీపై విచారణ పూర్తయ్యే వరకూ ఎక్కడకు కదలడానికి వీలు లేదని చెప్పి కట్టడి చేసి, డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. దీంతోపాటు మీకు సంపాదనకు మించిన ఆస్తులున్నాయని, ఐటీ ఎగవేశారని, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని చెప్పి కొందరు అధికారుల్లా మారువేషాల్లో, నకిలీ ఐడీ కార్డులు పెట్టుకొని రైడ్ చేస్తారు. వ్యాపారులు ఎవరికీ ఫోన్ చేయకుండా వారి ఫోన్ కనెక్షన్ ను కట్ చేసి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని డబ్బులు, బంగారాన్ని స్వాధీనం చేసుకొని విచారణకు కార్యాలయానికి రావాలంటూ చెప్పి పలాయనం చిత్తగిస్తారు. ఇదీ అరెస్ట్ పేరిట వీడియో కాల్ లోనే నిర్బంధించి డబ్బులు దండుకోవడమే ‘డిజిటల్ అరెస్ట్’.
మనీలాండరింగ్ పేరిట మోసం
ఇటీవల నోయిడా నగరంలో ఓ మాయగాడు తాను కేంద్ర సంస్థ దర్యాప్తు అధికారినని ఫోన్ చేసి బెదిరించారు. ఆధార్ కార్డుతో సిమ్ కొన్నారని, ఆ సిమ్ తో ముంబయిలో మనీలాండరింగ్ కు పాల్పడ్డారని చెప్పి తదుపరి విచారణ పేరిట కాల్ ను బదిలీ చేశాడు. మరో సైబర్ నేరగాడు లైన్ లోకి వచ్చి తాను ముంబయి పోలీసు అదికారినని బెదిరించి, ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కైప్ కాల్ చేశాడు. నోయిడా మహిళను డిజిటల్ అరెస్ట్ చేసి ఆమె నుంచి రూ.11.11 లక్షలను తన ఖాతాలో వేయించుకున్న తర్వాత ఫోన్ కట్ చేశాడు.
తెలంగాణ డీజీపీకే సైబర్ నేరగాళ్ల వల
తెలంగాణ డీజీపీ రవిగుప్తాకే సైబర్ నేరగాళ్లు వల పన్నిన వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. తెలంగాణలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, సాక్షాత్తూ తనకే సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారని, తన సోషల్ మీడియాలో సైబర్ లింక్స్ వచ్చాయని తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ రవిగుప్తా ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన సైబర్ క్రైంలపై అవగాహన కార్యక్రమంలో చెప్పారు.
మీ ఆధార్ తో డ్రగ్స్ రవాణ చేశారంటూ... ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఉన్న కేసులను మాత్రమే పరిశోధిస్తుందని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ముంబయి క్రైం బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానంటూ తనకు కూడా ఓ ఫోన్ కాల్ వచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి తెలిపారు. కొరియర్ ప్యాకేజీల్లో డ్రగ్స్ రవాణ చేయడానికి తన ఆధార్ కార్డు ఉపయోగించారని బెదిరించారని సదరు పోలీసు అధికారి చెప్పారు.
ఎన్నెన్నో రకాల మోసాలు
ఓ సైబర్ నేరగాడు స్కైప్ కాల్ చేయగా అందులో ఓ వ్యక్తి పోలీసు డ్రెస్ ధరించి కనిపించాడు, గంటల తరబడి విచారించి, అతనికి విదేశీ నిధులు వచ్చాయో లేదో చూడటానికి అతని బ్యాంక్ ఖాతా వివరాలు చూపించమని బాధితుడిని అడిగాడు. ఇంతలో మోసగాళ్లు అతని సిస్టమ్‌ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతానుంచి డబ్బును కొల్లగొట్టారు. ఈ మోసగాళ్లు బెదిరింపు లేఖలను పోలీసు డిపార్ట్‌మెంట్‌ల లెటర్‌హెడ్‌లపై పంపించి కూడా మోసాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు బాధితుల ఆధార్ కార్డులను సేకరించి వారిని బెదిరించి డబ్బు దండుకుంటున్నారు.
మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయండి...
డిజిటల్ అరెస్ట్ స్కాం మోసగాళ్లు సాధారణంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. మోసపోయినపుడు బాధితులు వెంటనే పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని నగర అసిస్టెంట్ పోలీసు కమిషనర్ నరేష్ రెడ్డి కోరారు. సైబర్ స్కామర్ల కొత్త మోడస్ ఆపరేండస్ గురించి పోలీసులు పౌరులను హెచ్చరించారు.
నయా మోసాలను నియంత్రిస్తాం : సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ డిజిటల్ హౌస్ అరెస్ట్ మోసాలు హైదరాబాద్ కు వ్యాపించడంపై నగర పోలీసులు తాజాగా హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ చెప్పారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని ఆమె సూచించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు అయ్యాక 90 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని శిఖాగోయల్ వెల్లడించారు. ప్రజలకు ఎస్ఎంఎస్ ల ద్వారా సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తామని ఆమె వివరించారు.