‘దుర్గం చెరువు’ విషయంలో మీపై నమ్మకం లేదు: హైకోర్టు
x
DURGAM CHERUVU

‘దుర్గం చెరువు’ విషయంలో మీపై నమ్మకం లేదు: హైకోర్టు

దుర్గంచెరువు కాలుష్యకూపంగా మారడానికి అధికారులే కారణమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య కోరల నుంచి విముక్తి చేయడానికి నిఫుణుల కమిటీని నియమించింది.


హైదరాబాద్ లోని దుర్గం చెరువు కాలుష్య కాసారంగా మారడంతో పాటు చెరువు పరిమాణం కుచించుకుపోవడానికి గల కారణాలను అధ్యయనం చేయడం వాటికి పరిష్కార మార్గాలను సూచించడానికి అవసరమైన నిపుణుల కమిటిని తెలంగాణ హైకోర్టు శుక్రవారం నియమించింది.

నాగ్ పూర్ లోని నేషనల్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ డెరెక్టర్ అతుల్ నారాయణ్ వైద్య నేతృత్వంలోని ఈ కమిటిని నియమిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటిచింది. ఆరు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. రహస్య చెరువుగా పేరుగాంచి, ప్రకృతి మధ్య నెలకొని ఉన్న దుర్గం చెరువు కొన్ని సంవత్సరాలుగా కాలుష్యనీటికి కేరాఫ్ గా మారింది. దీనికి మరోవైపు ఆక్రమణలు సైతం తోడవడంతో పూర్తిగా ఉనికి కోల్పోయేస్థితికి చేరుకుంటోంది.

ఈ విషయాన్ని వార్త పేపర్లలో ప్రచురణ కావడంతో హైకోర్టు ఈ విషయాన్నిప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) గా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మొదటి వాదనల సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ లతో కూడిన బెంచ్ హెచ్ఎండీఏ అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘అధికారులు తమ మనస్సాక్షిని అమ్ముకున్నారని, అందుకే వారిని ఈ కమిటీలోకి తీసుకోవడం లేదని ప్రకటించింది. అసలు మీకు నోటీసులు కూడా ఇవ్వం’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘దుర్గం చెరువు చుట్టూ పట్టణీకరణ చాలా వేగంగా పెరిగింది. అందువల్ల ఐకానిక్ సరస్సుగా పేరుగాంచిన ఈ చెరువును రక్షించడానికి, తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఏమిటో వివరించండి’అని కమిటీకి సూచించింది. సమస్యను శాస్త్రీయ పద్దతిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసును తిరిగి ఫిబ్రవరి ఆరుకు వాయిదా వేసింది.

గత వాయిదాలో బెంచ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అతుల్ నారాయణని సంప్రదించినట్లు అమికస్ క్యూరీ వేదుల నారాయణ కోర్టుకు విన్నవించారు. ఆ తరువాత అతుల్ నారాయణ చైర్మన్ గా, నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతివర్థని, హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిని సభ్యులతో కూడిన ప్యానెల్ ను ధర్మాసనం ఏర్పాటు చేసింది.

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(TSPCB) చెందిన ఏ అధికారి పేరును ఇందులో సూచించలేదని, ఈ వ్యాజ్యానికి కారణం వీరే అని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే అధికారులు, అక్రమార్కులతో చేతులు కలిపినట్లు స్ఫష్టంగా తెలుస్తోందని, నిఫుణుల కమిటీని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హైకోర్టు అధికారులను హెచ్చరించింది.

‘ప్రస్తుతం చెరువును పునరుద్దరించే విషయంలో అధికారులు సహకారం తమకు అవసరంలేదని, కాలుష్య పరిస్థితి చూస్తే కంచె చేను మేసిందనే విషయం స్పష్టమవుతోంది’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కమిటీకి అవరసరమైన రవాణా, ఇతర ఖర్చులు సహ అన్ని రకాలుగా ఆర్ధికంగా అండగా నిలబడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే సభ్యులకు పోలీసు రక్షణ సైతం కల్పించాలంది. కోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి హమీ ఇచ్చారు.

Read More
Next Story