ఓ గ్రూప్స్ పరీక్షా !.. నీ తేదీ మళ్లెప్పుడూ?
x
టీఎస్పీఎస్సీ

ఓ గ్రూప్స్ పరీక్షా !.. నీ తేదీ మళ్లెప్పుడూ?

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణ మళ్లీ సందిగ్థంలో పడింది. పరీక్షలకు పది రోజులు కూడా సమయం లేదు.. అయినప్పటికీ ఇంకా ఏర్పాట్లు ఏవీ పూర్తి కాలేదు, చేయలేదు.


గ్రూప్స్ నోటిఫికేషన్.. రాకపోతే ఒకతంటా.. వస్తే మరో తంటా.. వస్తూనే ఉద్యోగాల ఆశలపల్లకీలో ఊరేగిస్తూ ఉంటుంది.కానీ తరువాతే మొదలవుతుంది అసలు కథ. వేలకు వేలు కోచింగ్ ఫీజులు, ఓక్కో సబ్జెక్ట్ కు నాలుగు పుస్తకాలు.. ఆకాశన్నంటే ధరలు, చిన్న హస్టల్ రూంలు, ఇరుకు బెడ్లూ, చప్పిడి తిండి.. కానీ నౌకర్ రావాలంటే ఇవే పట్టించుకోకూడదు. పట్టించుకుంటే జాబ్ రాదు. మధ్యాహ్నం కడుపునిండా అన్నం తింటే నిద్ర ముంచుకు వస్తుంది.. కాబట్టి ఒంట్లో ఓపిక ఉండేలా ఎంగిలి పడితే చాలు.. రాత్రిపూట ఎక్కువ చదవాలన్నా మళ్లీ కడుపునిండకూడదు. ఇలా సగం ఆకలి.. సగం నిద్ర అనే కొలిమిలో నిరుద్యోగులు మరో ఆరు నెలలు వేచి చూడటం తప్పెట్లు లేదు.

జనవరి 6,7 తేదీల్లో జరిపే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇంకా ఏం తేల్చలేదు. కొత్త తేదీలు ప్రకటించలేదు. మళ్లీ జాబ్ క్యాలెండర్ అంటూ వాయిదా వేస్తారా అనే భయం నిరుద్యోగుల్లో ఉంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో.. ఈ గోస ఎప్పుడు తప్పుతుందో అని నిరుద్యోగులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇలా గ్రూప్- 2 వాయిదా పడటం, గత ఆరు నెలల్లో ఇది మూడో సారి. ఇంతకుముందు ఆగష్టు 28, 29 తేదీల్లో పరీక్ష కోసం ఏర్పాట్లు చేశారు. తరువాత అది కాస్త నవంబర్ వాయిదా వేశారు. ఎన్నికల కోడ్ సందర్భంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, తిరిగి వాటిని 2023 జనవరి 6, 7 తేదీలకి మార్చారు. ఇప్పుడు మరోసారి ఈ తేదీల్లో పరీక్ష నిర్వహించడం సందేహంగా మారింది.

2022లో గ్రూప్స్ పరీక్షలకు టీఎస్ఫీఎస్సీ వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో నిరుద్యోగులు ఎన్నో ఆశలతో తన ప్రిపరేషన్ ప్రారంభించారు. వీటికి తోడు పలురకాల పరీక్షల కు కొన్ని స్వయంప్రతిపత్తిగల బోర్డులు సిద్దం కావడంతో రాష్ట్రంలోని నిరుద్యోగుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.

‘ఇళ్లు అలకగానే పండగ కాదన్నట్లుగా’.. నోటిఫికేషన్లు అయితే వచ్చాయి గానీ, ఉద్యోగాలు మాత్రం రాలేదు. మొదట వాయిదాలపర్వం నడిపించిన టీఎస్పీఎస్సీ.. తరువాత అక్కడే లీక్ ల పర్వం మొదలైంది. ఏకంగా 16 పరీక్షలు రద్దు. దాదాపు ఒక గ్రూప్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన సమయం ఏడు సంవత్సరాలు కాగా, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చాక పరీక్ష రాయడానికి మొదట మూడు నెలలు, తరువాత మరో రెండు నెల్లు, ఇలా సమయం పొడిగిస్తూ పోయారుచివరకు లీకేజితో కథ మళ్లీ మొదటికొచ్చింది. గ్రూప్ 2 కు సంవత్సరం.. గ్రూప్ 3 జాడే లేదు. ఇలా ఒక్కో నోటిఫికేషన్ కు సంవత్సరాల తరబడి సమయం వృథా అవుతోంది. ప్రభుత్వం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరాాలతో, నిరుద్యోగులు పోటీ పరీక్షలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.

"నాకు చదవంటే విరక్తి వచ్చింది"అని జక్కుల శ్రీకాంత్( పేరు మార్చాం) అనే అభ్యర్థి తన ఆవేదన వ్యక్తం చేశారు. "నాకు పెళ్లి అయి ఓ బాబు ఉన్నాడు. బీటెక్ అయిపోయాక చాలా సంవత్సరాలు చదివాను. కానీ నోటిఫికేషన్లు ఏవీ రాలేదు. పెళ్లి అయ్యాక ఒక్కసారిగా నోటిఫికేషన్లు మొదలు కావడంతో, చేస్తున్న జాబ్ మానేసీ ప్రిపరేషన్ ప్రారంభించా.. రెండు సంవత్సరాలైన ఏది ముందుకు సాగట్లేదు. ఇప్పుడు మళ్లీ గ్రూప్2 కూడా వాయిదా పడేలా ఉంది. ఇంక నేను ఏం చేయాలి. ఇంకో ఆరునెల్లు చదివే ఓపిక, తీరిక నాకు లేవు" అంటూ ఫెడరల్ తో తన మనసులో ఉన్న బాధను పంచుకున్నారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన మరో అభ్యర్థి మహేష్(పేరు మార్చాం) మాట్లాడుతూ" అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయింది. అయినా ప్రిపరేషన్ ఆపట్లేదు. ఇన్ని రోజులు ఆగిన వాడిని మరో ఆరు నెల్లు ఆగలేనా" అని ప్రశ్నించాడు. కానీ ఇంట్లో ఇప్పటికే ఆర్థికంగా కష్టంగా ఉందని తన గోడు వెళ్లబోసుకున్నాడు. "కరోనా తరువాత ప్రిపరేషన్ ప్రారంభించా. నెలకు ఎంతలేకున్నా రూ. 6000 వేలు హస్టల్ ఫీజు అవుతోంది. మరో మూడు నాలుగు వేలు ఇతరత్రా ఖర్చులు అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి చదువుపేరుతో డబ్బులు వసూలు చేస్తున్నానా అనే ఆలోచన వస్తోంది, దాన్ని ఒక్కోసారి నియంత్రించుకోలేకపోతున్నా" అని అన్నారు. వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన అనిల్ అనే మరో అభ్యర్థి ఫెడరల్ తో మాట్లాడారు."బడ్జెట్ లో ఉద్యోగుల జీతాలు 30 శాతం అంతకుమించి చేరాయి, కాబట్టే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదనే వాయిదాలు" వేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న అన్ని నోటిఫికేషన్లు, జాబ్ క్యాలండర్ విడుదల చేస్తే జీతాల వాటా బడ్జెట్ లో కచ్చితంగా 40 శాతానికి చేరుకుంటాయి. అందుకే వీలైనన్నీ ఎక్కువ రోజులు లేదా సంవత్సరాలు పరీక్షలు వాయిదా వేస్తారని ఆక్షేపించారు. ఇదో పాలసీల మారిందని, వెంటనే యూపీఎస్సీ తరహలో ఉద్యోగాల నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి ఎండింగ్ వరకూ పరీక్షలు నిర్వహించాలని, అలాగే గ్రూప్ 2 పోస్టులు పెంచాలని కోరారు. కొన్ని జోన్లలో కనీసం పది, పదిహేను పోస్టులు కూడా లేవని, కానీ వేలల్లో అప్లికేషన్లు ఉన్నాయని చెప్పారు. కనీసం జోన్ కు వంద పోస్టులు ఉండేలా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.

ప్రస్తుతం గ్రూప్2 వాయిదా పడుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటి వరకూ టీఎస్పీఎస్సీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఇదే పక్కా అవుతుందనేది కాదనలేని నిజం. అయితే మరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు. ఎన్ని నెల్లు సమయం పడుతుంది అనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ముందు టీఎస్సీపీఎస్సీ వ్యవహరం తేలాలి. ఈ విషయం గవర్నర్ కోర్టులో ఉంది. తరువాత కొత్త బోర్డు నియామకం. ఎగ్జిక్యూటివ్ కమిటీల తీర్మానాలు, నిర్ణయాలు చేయాలి. వీటిలోనే అన్నింటికి స్పష్టత వస్తుంది. ఇవన్నీ తేలాలే సరికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తాయి. దాంతో జూన్ వరకూ పరీక్షలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

ఫలితాలు ఎప్పుడు

టీఎస్ఫీఎస్పీ ఇంతకుముందే గ్రూప్-4, మున్సిపల్ అకౌంట్స్ సహ అనేక రకాల పరీక్షలు నిర్వహించింది. వీటిలో కొన్నింటికి తుది కీ సైతం విడుదల జరిగింది. అయితే మెరిట్ లిస్ట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. వాటిని సైతం రద్దు చేస్తారా అనే అనుమానాలు కొంతమంది నిరుద్యోగ యువకులు వ్యక్తం చేశారు. అయితే తాము ఎంతో కష్టపడి చదివామని, అన్నింటిని ఓకేగాటన కట్టవద్దని వారు కోరుతున్నారు. త్వరగా టీఎస్ఫీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి పండగలోపే నియామక ప్రక్రియ పూర్తి చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read More
Next Story