నందినగర్‌లో కేసీఆర్ విచారణ మొదలు
x

నందినగర్‌లో కేసీఆర్ విచారణ మొదలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్ నందినగర్ నివాసంలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. భద్రత కట్టుదిట్టం చేశారు.


ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నందినగర్‌లోని నివాసంలో ఆయన విచారణ జరుగుతోంది. పలు డాక్యుమెంట్లు, ఇతరుల వాంగ్మూలాలను ముందుంచి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. ఈ కేసు నేపథ్యంలో సిట్ అధికారులు పలు డాక్యుమెంట్లు, పరికరాలతో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. నివాసంలోని రెండో అంతస్తులో విచారణ కొనసాగుతోంది. అధికారులు ఈ ప్రక్రియను వీడియో రికార్డు చేస్తున్నట్లు సమాచారం.

విచారణ సమయంలో కేసీఆర్ దగ్గర ఆయన న్యాయవాది సంతోష్ రావు ఉండేందుకు అనుమతించాలని కేసీఆర్ తరఫు న్యాయవాది రాంచందర్ రావు కోరినట్లు తెలిసింది. సిట్ విచారణ నేపథ్యంలో నందినగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, నివాసం చుట్టూ పోలీసులు నియంత్రణ చేపట్టారు.

కుటుంబసభ్యులు, సిట్ అధికారులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తూ, పార్టీ శ్రేణులు, అనుచరులపై ఆంక్షలు విధించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైపు నుంచి కూడా ఎవరినీ నివాసం వైపు రానివ్వడం లేదు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా నివాసంలోనే ఉన్నట్లు సమాచారం. భద్రత కోసం ఐదుగురు డీసీపీలతో కూడిన బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేసీఆర్‌కు మాత్రమే అనుమతి

ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మరికాసేపట్లో సిట్ అధికారులు విచారించనున్నారు. తాజా పరిణామంగా నందినగర్ నివాసానికి పోలీసులు, సిట్ బృందం ముందుగానే చేరుకుని భద్రత కట్టుదిట్టం చేసింది. కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరినట్లు సమాచారం. ఒంటి మామిడి వద్ద ఇతర వాహనాలను ఆపి, కేసీఆర్ కాన్వాయ్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు.

సిట్ అధికారులు ఎలక్ట్రానిక్ పరికరాలతో ఇంట్లోని రెండో ఫ్లోర్‌లో విచారణ గదిని తనిఖీ చేసి సిద్ధం చేశారు. కేసీఆర్ స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డింగ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోకి హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావులకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. విచారణ సమయంలో లాయర్‌కు అనుమతి ఇవ్వడం లేదని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్‌ఎస్ నేతలను సిట్ ప్రశ్నించిన నేపథ్యంలో, కేసీఆర్ విచారణ ఎంతసేపు కొనసాగుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Read More
Next Story