చంద్రబాబిక ‘ప్రశాంత’మేనా!
2021 వరకు పక్కా వైరి పక్షమైన టీడీపీతో చేతులు కలిపారు. ప్రశాంత్ కిషోర్ ఏక్షణంలోనైనా సైకిలెక్కుతారనుకున్న ఊహాగానాలకు ఇవాళ తెరపడింది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటారు. ఇప్పుడా సూత్రం వ్యూహకర్తలకు, సంస్ధలకు కూడా వర్తించనుంది. ఐదేళ్లూ ఒకేచోట ఉండే పరిస్ధితి అటు రాజకీయ నాయకుల్లోనూ లేదు, ఇటు చక్రం తిప్పుతారనే వాళ్ల దగ్గరా లేనట్టుగానే ఉంది. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే.. నిన్న మొన్నటి వరకు వైఎస్సార్ సీపీకి వ్యూహకర్త, జగన్ కి ప్రధాన సలహాదారు, అనేక సంక్షేమాలకు రూపకర్త అనుకున్న బీహార్ ఐటీ దిగ్గజం ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. 2021 వరకు పక్కా వైరి పక్షమైన టీడీపీతో చేతులు కలిపారు. ప్రశాంత్ కిషోర్ ఏక్షణంలోనైనా సైకిలెక్కుతారనుకున్న ఊహాగానాలకు ఇవాళ తెరపడింది.
చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిషోర్
ఊహించినంతా జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరఫున ప్రధాన పాత్ర పోషించారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేశ్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ కనిపించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. ప్రశాంత్ కిషోర్‌తో పాటు షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా ఉన్నారు. వీరందరూ చంద్రబాబుతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు.