
అక్క ప్రచారంలో తమ్ముడు గాయబ్
తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్స్ సాధించాలని మోడీ, అమిత్ షా పిలుపునిస్తుంటే రాజాసింగ్ లాంటి నేత అంటీముట్టనట్టు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎలాగైనా ఎంఐఎం ని ఢీకొట్టి నిలబడాలని బీజేపీ యోచిస్తోంది. అది కూడా కొత్త అభ్యర్థి చేతిలో అసదుద్దీన్ ని ఓడిస్తే ఆ మజానే వేరు కదా. అందుకే విరించి హాస్పిటల్స్ చైర్ పర్సన్ మాధవిలతకి టికెట్ ఇచ్చి ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. బీజేపీలో రాజాసింగ్ ప్రచారానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఆయన ప్రచారంలో పాల్గొంటే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ, హైదరాబాద్ బీజేపీ క్యాడర్ లో, అభిమానుల్లో జోష్ వచ్చేస్తుంది. కానీ మాధవీ లతకి టికెట్ ఇచ్చినప్పుడు "హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వడానికి బీజేపీకి సరైన మొగోడే కనిపించలేదా" అని ప్రశ్నించిన రాజాసింగ్ ఆమెకి సహకరిస్తాడా అనే సందేహం వ్యక్తమైంది.
"కుటుంబమన్నంక ఇవన్నీ సహజం. తమ్ముడు రాజాసింగ్ ని కలిసి, కలుపుకుని ముందుకుపోతా" అని అక్క మాధవీలత చెప్పారు. అక్క బుజ్జగిస్తే తమ్ముడు మద్దతు ఇస్తాడు, ప్రచారంలో పాల్గొంటాడు.. ఆమె కోసం కాకపోయినా తాను నమ్మిన 'దేశం కోసం ధర్మం కోసం' బీజేపీని గెలిపించడానికి కృషి చేస్తాడు అనుకున్నారు.
కానీ రాజాసింగ్ ప్రచారంలో కనిపించడం లేదు. హైదరాబాద్ సీట్ ఆశించి రాకపోవడంతోనే అలకబూనారు అని తెలుస్తోంది. మరోవైపు తనకి కాకుండా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి శాసనసభా పక్ష నేత పదవిని కట్టబెట్టడంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని సమాచారం.
హైదరాబాద్ ప్రచారానికే కాదు.. పార్టీ నిర్వహించిన విజయసంకల్ప సభల్లోనూ రాజాసింగ్ పాల్గొనలేదు. పార్లమెంటు ఎలక్షన్స్ లో రాష్ట్రంలో డబుల్ డిజిట్స్ సాధించాలని మోడీ, అమిత్ షా పిలుపునిస్తుంటే రాజాసింగ్ లాంటి నేత అంటీముట్టనట్టు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
హైదరాబాద్ పార్లమెంటులో బీజేపీ చేతుల్లో ఉన్న గోషామహల్ స్థానం నుంచి సపోర్ట్ ఎంతైనా అవసరం. కానీ రాజాసింగ్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర బీజేపీ పెద్దలు లోకల్ క్యాడర్ మాధవీలతకి మద్దతు ఇవ్వాలని ఆదేశించినా పాజిటివ్ రిజల్ట్స్ కనపడటం లేదు. మరోవైపు మాధవీలత కూడా వారందరినీ కలుపుకొని పోతున్నట్టు కనిపించడం లేదు. ఈ వైఖరి పార్టీకి నష్టం చేకురుస్తుందేమో బీజేపీ శ్రేణులు కలవరపడుతున్నారు.
రాజాసింగ్ పై ముంబైలో పోలీస్ కేసు..
విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ముంబై మీరా రోడ్ పోలీసులు రాజా సింగ్ పై కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 25 న నిర్వహించిన ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, గీతా జైన్, నితీష్ రాణే లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ముంబై హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ర్యాలీలో ముస్లింలను అవమానించేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మార్చ్ 23 న మీరా రోడ్ పోలీసులు సదరు బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ర్యాలీ నిర్వాకుడు నరేష్ నైల్ పైనా కేసు నమోదు చేశారు. పోలీసులు IPC సెక్షన్లు 153 A, 188, 295-ఆ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.