కాంగ్రెస్ కొంప ముంచింది ఇతడేగా!   దుబాయ్ లో దొరికాడు!
x
మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ (file shot)

కాంగ్రెస్ కొంప ముంచింది ఇతడేగా! దుబాయ్ లో దొరికాడు!

తాను బురద పూసుకున్నాడు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కూడా పూశాడు. హస్తం పార్టీ కొంప ముంచాడు. దేశం కాని దేశం పారిపోయాడు. ఇప్పుడక్కడ మన ఈడీకి చిక్కాడు.


ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కొంప ముంచినోళ్లలో ఇతనొకరు. తాను బురద పూసుకోవడమే కాకుండా కాంగెస్ ముఖ్యమంత్రికి కూడా అంటించి దేశం కాని దేశం పారిపోయాడు. ఇప్పుడక్కడ చిక్కాడు. రేపో మాపో ఇండియాకి తీసుకువస్తున్నారు. ఆ బెట్టింగ్ యాప్ ఏంటో, దాని కథేంటో దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చబోతున్నాయి.

బెట్టింగ్ యాప్ లలో ఇదొకటి..

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన యాప్ లలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ఒకటి. నగదు మార్పిడి దీని వ్యాపారం. నిజానికిదో చాటుమాటు వ్యాపారం. గుట్టురట్టవడంతో ఈ యాప్‌ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ దుబాయ్ పారిపోయారు. దేశదేశాల్లో దొరలుగా చెలామణి అయ్యే దొంగల్ని పట్టిచ్చే ఇంటర్‌పోల్‌ (Interpol)కు మన ఎన్ఫోర్స్ మెంట్ విభాగం (ఈడీ) విషయం చెప్పి రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయించింది. దీంతో ఈ రవి ఉప్పల్ ను దుబాయ్‌ (Dubai) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్‌కు తీసుకురానున్నారు. ఇంకో యజమాని సౌరభ్‌ చంద్రఖర్‌ కోసం దుబాయ్ పోలీసులు గాలిస్తున్నారు.

ఎవరీ రవి ఉప్పల్..

ఈ రవి ఉప్పల్ ఛత్తీస్‌గఢ్‌లోని భిలాల్‌ ప్రాంతానికి చెందినవాడు. ఇతని దోస్ సౌరభ్‌ చంద్రఖర్‌. దుబాయ్‌ కేంద్రంగా భారత్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ను పెట్టి వ్యాపారం మొదలు పెట్టారు. ఇదో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌. ఈ ముసుగులో మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈడీ రంగంలోకి దిగింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా, భోపాల్‌, ముంబయి వంటి నగరాల్లో సోదాలు చేసింది. వందల కోట్లలో అక్రమ నగదు బయటపడింది. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

ఈ సౌరభ్ చంద్రశేఖర్ ఎవరు

రవి ఉప్పల్‌కు ఏదేశం పడితే ఆదేశం వెళ్లే వీలున్న వనౌటు దేశ పాస్‌పోర్ట్‌ ఉంది. దాంతో స్వేచ్ఛగా తిరిగేవారు. భారత పౌరసత్వాన్ని వదులుకోకుండానే ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ యాప్‌ మరో ప్రమోటర్‌ సౌరభ్ చంద్రశేఖర్‌ది కూడా ఛత్తీస్ గడే. వీళ్లిద్దరిదీ ఒకే ఊరని అంటున్నారు. ఈ మధ్య సౌరభ్ పెళ్లి యూఈఏలో ఘనంగా జరిగింది. ఇందుకు 200 కోట్లు ఖర్చు చేశాడట. అతడి పెళ్లికి బాలీవుడ్‌లోని ప్రముఖ సెలబ్రిటీలు హాజరయ్యారని ఈడీ చెబుతోంది. మానిలాండరింగ్ కేసులో రవి ఉప్పల్‌, సౌరభ్ చంద్రఖర్‌పై నాన్‌-బెయిలబుల్‌ వారెంట్ జారీ అయ్యింది. ఆ తర్వాత ఈడీ అభ్యర్థన మేరకు వీరిద్దరిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.

అబ్బే.. మేము అలాంటోళ్లం కాదు...

అయితే, ఈ మనీలాండరింగ్‌ ఆరోపణలను రవి ఉప్పల్‌, సౌరభ్‌ చంద్రఖర్‌ ఖండించారు. మహదేవ్‌ యాప్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, దాన్ని శుభమ్‌ సోని అనే వ్యక్తి నడిపిస్తున్నాడని చెప్పారు. ఇదిలాఉంటే ఈ బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారంలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌పైనా ఆరోపణలు వచ్చాయి. ఈ యాప్‌ ప్రమోటర్లు బఘేల్‌కు 508 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఈడీ ఆరోపించింది.

ఎన్నికలకు ముందు బఘేల్ పై ఆరోపణ..

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఆరోపణలతో కాంగ్రెస్ బాగానే నష్టపోయింది. ఇప్పుడు ఈడీ అధికారులు అసలు యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ ను ఇండియా తీసుకువస్తున్నారు. ఇప్పుడైనా అసలు నిజం బయటపడుతుందేమో చూడాలి.

Read More
Next Story