తెలంగాణ అసెంబ్లీలో బుధవారం 'మంటలు'
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం 'మంటలు' సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై దాడికి అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. విద్యుత్ సహా పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సిద్ధమయ్యారు. మరోపక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెడీ అయ్యారు. కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చేందుకు కూడా ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్ రావు కాగితాల కట్టలతో సభకు రానున్నట్టు సమాచారం.
డిసెంబర్ 9 దాటిందిగా అంటూ కేటీఆర్ ట్వీట్
మూడో అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసింది బీఆర్‌ఎస్. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసింది అధికార పక్షం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఆర్థికంగా భారం పడుతుండటంతో... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న అభిప్రాయానికి వచ్చింది. సరిగ్గా ఈ పరిస్థితినే దృష్టిలో పెట్టుకునే మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం ఓ విచిత్రమైన ట్వీట్ చేశారు. అలివిగాని హామీలు ఇచ్చి ఇప్పుడు డబ్బులు లేవంటున్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాదిరే రేవంత్ రెడ్డి కూడా డబ్బుల్లేవని చేతులెత్తేస్తారా? అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.
ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రమంటే...
ఆర్థిక, విద్యుత్ రంగాలతో ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్న అధికార పక్షం.. తాజా పరిస్థితులపై అసెంబ్లీలో తమ వాదనను వినిపించేందుకు రెడీ అవుతోంది. ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయడానికి తయారైంది. ఈ శ్వేత పత్రం అసెంబ్లీలో మంటలు పుట్టించే అవకాశం ఉంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీన్ని ముందే ఊహించారో ఏమో.. 'పవర్ పాయింట్ ప్రజెంటేషన్, శ్వేతపత్రం అంటే బీఆర్‌ఎస్ భయపడుతోందని, రేపు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఏమి చేసిందో తేలుస్తామని' గాంధీభవన్‌లో చెప్పారు.
సవాళ్లు, ప్రతిసవాళ్లు తప్పవా?
కొత్త ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తుందన్న అభిప్రాయంతో గులాబీ దళం కూడా అలర్ట్ అవుతోంది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి దీటుగా కౌంటర్ ఇచ్చే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. బుధ, గురువారాల్లో జరిగే సమావేశాల్లో ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై ప్రభుత్వం తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పూర్తి వివరాలను వెల్లడించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది.
మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు చాన్స్ ఇవ్వండి..
అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకు కూడా ఆ అవకాశం కల్పించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కోరింది బీఆర్‌ఎస్. ఆర్థిక, సాగునీటి అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మాజీ మంత్రి హరీశ్‌రావు. విద్యుత్ రంగంపై మాజీ మంత్రి కేటీఆర్ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ అప్పులు మాత్రమే చూపిస్తూ ఆస్తులను దాచిపెడుతోందన్న విమర్శలను ఇప్పటికే చేశారు. విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ తీసుకువచ్చిన సంస్కరణలను వినిపించాలన్న యోచనలో గులాబీ దళం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపెడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఢీకొట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సై అంటుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
Next Story