రేవంత్ గేట్లు తెరిచారు...బీఆర్ఎస్ నుంచి వలసలు షురూ
x
Danam Nagender Join Congress party

రేవంత్ గేట్లు తెరిచారు...బీఆర్ఎస్ నుంచి వలసలు షురూ

మోగిన ఎన్నికల నగారాతో తాను గేట్లు తెరిచానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాను గేట్లు తెరవగానే సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన చెప్పారు.


వందరోజుల పాటు తాము ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే మేం ఊరుకుంటామా అని రేవంత్ ప్రశ్నించారు. వందరోజుల పాలన తర్వాత పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగిందని, పరిపాలనను అధికారులకు అప్పగించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అసలు రూపం చూపిస్తానని రేవంత్ చెప్పారు. ఇప్పటి నుంచి తన రాజకీయం ఏమిటో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చూపిస్తానని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. అసలైన ఆట ఇప్పుడే మొదలెట్టానని కాస్కోండని ప్రతిపక్షాలకు రేవంత్ సవాలు విసిరారు.


ఇద్దరు సీనియర్ నేతల చేరిక
పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన మరునాడే బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ వారిద్దరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో వైపు బీఆర్ఎస్ నుంచి వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం స్వీకరించారు.
వరుస వలసలతో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో భవిష్యత్ లో ఎన్నికలకు ముందే మరికొంత మంది కాంగ్రెస్ తీర్థం స్వీకరిస్తారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఇలా బీఆర్ఎస్ నేతలు వలసలు ప్రారంభమయ్యాయని, భవిష్యత్తులో ఆ పార్టీ నుంచి ఎక్కువ మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. గేట్లు తెరిచామని సీఎం చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నాయి. మరో వైపు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు రోజుకొకరు ఇతర పార్టీల్లో వలస వెళుతుండటం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది.


Read More
Next Story