
విద్యుద్దీపాల వెలుగుల్లో బతుకమ్మ కుంట సరస్సు
బతుకమ్మకుంటకు పునరుజ్జీవం, 25న బతుకమ్మ ఉత్సవాలు
నాడు అధ్వానంగా ఉన్న బతుకమ్మ కుంట విద్యుద్దీపాల కాంతుల్లో సుందర సరస్సుగా మారి మెరిసిపోతుంది.
తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని బతుకమ్మ కుంటను పూర్తి స్థాయిలో సుందరంగా తీర్చిదిద్దారు. కుంట చుట్టూ విద్యుద్దీపాలతో అలంకరించారు. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల కాంతుల మధ్య ఆడబిడ్డల పూల సంబరం బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకోనున్నారు. చెత్తాచెదారంతో నిండిన కుంటను హైడ్రా పునరుద్ధరించింది. దీంతో చెత్త కుప్పగా ఉన్న బతుకమ్మ కుంట కాస్తా నేడు అందమైన సరస్సుగా మారడంతో వాకర్స్ సందడి ఏర్పడింది.
బతుకమ్మకుంటలో సెప్టెంబరు 25న ఉత్సవాలు
ఈ సంవత్సరం సెప్టెంబరు 25వతేదీన బతుకమ్మ కుంట చెంత ఉత్సవాలను పునరుజ్జీవింపజేయనున్నారు. హైడ్రా పునరుద్ధరించిన సరస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించి పాల్గొననున్నారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన హైడ్రా కమిషనర్ ను స్థానిక మహిళలు అభినందించారు. ఒకవైపు గాజుల రామారంలో ఆక్రమించిన ఇళ్ల కూల్చివేతతో హైడ్రాకు వ్యతిరేకంగా మహిళలు బతుకమ్మ ఆడగా, మరో వైపు బతుకమ్మకుంటను పునరుద్ధరించినందుకు అంబర్ పేట మహిళలు హైడ్రాను అభినందిస్తున్నారు.
సరస్సు వద్ద ఛాయాచిత్ర ప్రదర్శన
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బతుకమ్ము కుంట చెత్తాచెదారంతో అధ్వానంగా ఉండటం, సుందరీకరణ తర్వాత అందంగా మారిన సరస్సు చిత్రాలతో ఫ్రదర్శన ఏర్పాటు చేశారు. పునరుద్ధరణకు ముందు, సుందరీకరణ తర్వాత బతుకమ్మ కుంట ఛాయాచిత్రాలను ప్రజల కోసం ప్రదర్శించారు. హైడ్రా ఏజెన్సీ చొరవతో పునరుద్ధరించిన సరస్సులో వరద నిర్వహణకు ఇన్లెట్, అవుట్లెట్ నాలాలను పునరుద్ధరించారు.నాలా పునరుద్ధరణతో సరస్సు చుట్టూ ఉన్న ఎగువ ప్రాంతాలలో వరదలను గణనీయంగా తగ్గింది. బతుకమ్మ కుంట చెంత చిన్నారులు మానవహారంగా ఏర్పడి సంబరాలు జరుపుకున్నారు.
Next Story