దేశ ద్రోహులకు ఇక 90 రోజుల్లో శిక్ష ఆ చట్టాల పేర్లు మారాయ్!
నేరం చేసి పారిపోయిన వారు 90 రోజుల్లో లొంగిపోవాలి... లేదంటే వారి తరపున ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి తీర్పును ఇప్పిస్తారు
ఇప్పటి వరకు ఉన్న ఐపీసీ పేరు మారింది. సీఆర్‌పీసీ నేమ్ ఛేంజ్ అయింది. ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య చట్టం కానుంది. లోక్‌సభ ఈ మూడింటింటికి ఆమోదం తెలిపింది. దేశ ద్రోహం పై స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత దేశద్రోహం కాదంది. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితినే దేశద్రోహమని ప్రకటించింది. మైనర్లపై లైంగిక నేరానికి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. దేశద్రోహుల్ని ఎక్కడున్నా పట్టుకొచ్చి 90 రోజుల్లో శిక్షిస్తామని తేల్చిచెప్పింది.
కొత్త పేర్లు ఎలా ఉంటాయంటే...
బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాధార చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్‌సభ మూజువాణి ఓటింగ్ పద్ధతిన బుధవారం ఆమోదం తెలిపింది. ఈ మూడు చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య (బీఎస్).. పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తొలిసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే, వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో తాజా శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది. పార్లమెంట్‌లో 143 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ కొనసాగుతున్న వేళ ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించడం గమనార్హం.
ఏమేమి మార్పులు చేశారంటే...
ఆ తర్వాత వీటిలో మార్పులు చేసి.. ‘భారతీయ న్యాయ (రెండో) సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్షా (రెండో) సంహిత’, ‘భారతీయ సాక్ష్య (రెండో)’ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులను దిగువ సభ ఆమోదించడంతో వాటిని రాజ్యసభకు పంపనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే వీటిని ఆమోదించుకోవాలని కేంద్రం ఆశిస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. డిసెంబరు 22 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
దేశద్రోహ సెక్షన్‌కి సవరణ...
ఎవిడెన్స్ యాక్ట్ నుంచి 5 సెక్షన్ల తొలగింపునకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దేశద్రోహ సెక్షన్‌ను సవరించింది. దేశానికి వ్యతిరేకంగా పని చేసే వారిపై చర్యలకు శిక్షను కొనసాగించేందుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం లోక్‌సభలో ఆమోదించిన బిల్లుల ప్రకారం.. దేశ ద్రోహం కేసులో శిక్షను జీవిత ఖైదు నుంచి ఏడేళ్లకు మార్చారు. నేరం చేసి పారిపోయిన వారు 90 రోజుల్లో లొంగిపోవాలి... లేదంటే వారి తరపున ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి తీర్పును ఇప్పిస్తారు. దోషులను విదేశాల నుంచి తీసుకువచ్చి ఉరి వేస్తామని అమిత్ షా లోక్‌సభలో చెప్పారు.
గ్యాంగ్ రేప్‌కి 20 ఏళ్ల జైలు..
సీఆర్పీసీకి చేసిన మార్పుల ప్రకారం గ్యాంగ్ రేప్‌కు 20 ఏళ్ళ జైలు శిక్ష లేదా జీవిత కాలం జైలు శిక్ష, మైనర్‌పై అత్యాచారానికి జీవిత ఖైదు, అత్యాచారం కేసులో బాలిక చనిపోతే ఉరిశిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు చేశారు. మహిళలకు ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
డిజిటల్ ఎవిడెన్స్ పరిగణలోకి..
ప్రాధమిక హక్కులకు ప్రాధాన్యత కల్పించేలా చట్టాల్లో మార్పులు చేర్పులు చేసినట్టు అమిత్ షా లోక్‌సభలో చెప్పారు. నూతన చట్టాల ద్వారా నేర దర్యాప్తుకు సమయం కేటాయింపు ఉంటుందన్నారు. డిజిటల్ ఎవిడెన్స్ ను పరిగణలోకి తీసుకునేలా చట్టాల్లో మార్పులు చేర్పులు చేశారు.