
TIRUMALA || ముత్యపుపందిరి వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ మలయప్ప..!
మూడో రోజు రాత్రి మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో దర్శనమిచ్చారు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
ముత్యపుపందిరి వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.
వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళి కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Next Story