జార్ఖండ్ లో వంద ఎకరాల్లో శ్రీవారి ఆలయం
x
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

జార్ఖండ్ లో వంద ఎకరాల్లో శ్రీవారి ఆలయం

టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలకమండలి నిర్ణయాలను చైర్మన్ భూమనకరుణాకర్ రెడ్డి వెల్లడించారు.


జార్ఖండ్ లో వంద ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మంగళవారం పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 28న 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించడంతో పాటు వేతనాలు సైతం పెంచుతున్నామని వెల్లడించారు.

అలాగే వచ్చే సంవత్సరం జనవరి 15 మరో 1500 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తీర్మానించారు. అలాగే మరో 350 ఎకరాలు సైతం కొనుగోలు చేయాలని, దాని కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థలంలో రిటైర్డ్ ఉద్యోగులు, తదితరుల కోసం వినియోగించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంటున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

కొండపై శానిటేషన్ చేసే ఉద్యోగులకు వేతనాలు పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. పోటు కార్మికులకు సైతం వేతనాలు రూ. 28 నుంచి రూ. 38 వేలకు పెంచాలని, వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్ లేబర్ గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని తీర్మానించారు.

తిరుమల కొండపై ఫిబ్రవరిలో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులను ఆహ్వనించి సదస్సు నిర్వహించాలని కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ చెప్పారు.

అలాగే కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు సైతం రూ. 20,000 వేలకు పెంచాలని సైతం తీర్మానించారు. అలాగే తిరుపతిలో పాతబడిపోయిన సత్రాలు తొలగించి, కొత్త అతిథి గృహాలు నిర్మాణానికి టెండర్లు పిలవాలని పాలకమండలిలో చర్చించినట్లు తెలిపారు.

తిరుపతి పారిశుద్ధ్యం పనులు కోర్టు తుది తీర్పును లోబడి ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం చేసే భక్తులకు రూ. 300 ప్రత్యేక దర్శనం కల్పించాలని, అలాగే చంద్రగిరి ఎల్లమ్మ ఆలయ అభివృద్దికి రూ. రెండు కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాలకు ఇచ్చే ప్యాకేజీలను ప్రస్తుతం ఇస్తున్న వాటికి అదనంగా కోటీ రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

టీటీడీ నిర్మించే ఆలయం జార్ఖండ్ లోని దేవ్ గర్హ్ లో ఉంది. ఇక్కడే వైద్యనాథ్ జ్యోతిర్లింగంతో పాటు జయదుర్గా దేవి శక్తి పీఠం సైతం ఉంది. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం శ్రీవారి ఆలయం నిర్మాణం జరగనున్నట్లు తెలుస్తోంది. టీటీడీ ప్రతి రాష్ట్రంలోనూ శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించింది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్ లో శ్రీవారి ఆలయం నిర్మించి ప్రారంభించింది. అలాగే చత్తీస్ గఢ్, గుజరాత్ లోనూ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి.

Read More
Next Story