141 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

పార్లమెంటు భద్రతపై చర్చ రచ్చ


141 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు
x
మాక్ పార్లమెంటు నిర్వహిస్తున్న చిత్రం

పార్లమెంటు భద్రతపై చర్చ రచ్చ రచ్చగా సాగుతోంది. నోరెత్తిన విపక్షంపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. పార్లమెంటు ఉభయ సభల నుంచి ఇప్పటికే 92 మంది సస్పెండ్ కాగా మంగళవారం మరో 49 మందిపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వేటు వేశారు.

దద్దరిల్లుతున్న పార్లమెంటు..
లోక్‌సభలో దుండగుల చొరబాటు, భద్రతపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. డిసెంబరు 13 నాటి ఈ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్‌ వేటు వేశారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్‌ అయ్యారు.
సభాపతి ఆదేశాలు ధిక్కరించారనే ఆరోపణపై వీళ్లు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన వారిలో ఎంపీలు సుప్రియా సూలే, ఫరూక్‌ అబ్దుల్లా, శశి థరూర్‌, కార్తి చిదంబరం, డింపుల్‌ యాదవ్‌, మనీశ్ తివారీ లాంటి సీనియర్లు ఉన్నారు. ‘‘సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దనే నిబంధన ఉంది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో విపక్షాలు నిరాశ చెందారు. అందుకే వాళ్లు విపరీత చర్యలకు పాల్పడుతున్నారు’’ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ విరుచుకుపడ్డారు.
141 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు..
మొత్తంగా 141 మందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. లోక్‌సభలో గత వారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్‌ చేశారు. ఇప్పటి వరకు లోక్‌సభలో 95 మందిపై వేటు పడినట్లైంది. మరోవైపు రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకున్నట్లైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 22తో ముగియనున్నాయి.
ఉభయ సభలు వాయిదా..
విపక్షాల ఆందోళన నేపథ్యంలో మంగళవారం కూడా ఉభయ సభలు స్తంభించాయి. భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయడంతో పాటు తమ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.
మాక్‌ పార్లమెంటును వీడియో తీసిన రాహుల్‌
మరోవైపు, సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంటు ఎదుట మాక్‌ పార్లమెంటు నిర్వహించారు. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కడ్‌ను అనుకరిస్తూ పలువురు ఎంపీలు చేసిన మిమిక్రీ ఆకట్టుకుంది. ఈ మిమిక్రీ మొత్తాన్ని రాహుల్‌ గాంధీ దగ్గరుండి వీడియో తీశారు. ఈ తీరుపై ధన్కడ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


Next Story