హైదరాబాద్ లో 15 యేండ్ల తర్వాత కాంగ్రెస్ కోలాహలం
హైదరాబాద్ లో కాంగ్రెస్ విజయోత్సవ కోలాహలంలేక ఎన్ని సంవత్సరాలయిందో. ఇపుడు మళ్లీ గాంధీ భవన్ వార్తలకెక్కుతూ ఉంది.
ఓట్ల లెక్కింపు మొదలయ్యేందుకు చాలా టైముంది. అయితే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ పునరాగమన సందడి మొదలయింది.
హైదరాబాద్ లో కాంగ్రెస్ విజయోత్సవ కోలాహలంలేక ఎన్ని సంవత్సరాలయిందో. ఎపుడో 2014-2009 మధ్య హైదరాబాద్ లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయం కార్యకర్తలతో, నేతలతో కలకలలాడుతూ ఉండింది.
2004 లో డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో గెలిచి పదేళ్లుగా కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక్క కుదుపు కుదిపి మేల్కొలిపాడు. ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను ఉత్తేజ పరిచాడు. పదేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో ఢీలా పడిపోయిన కాంగ్రెస్ ముఖం మీద చల్లనీళ్లు చల్లి ‘లేవండి, తెల్లవారింది’ అని నిద్ర లేపాడు.
అంతకు ముందు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోవడంతో కాంగ్రెస్ సొమ్మసిల్లిపోయింది. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందుకున్నారు. అంతర్జాతీయ ప్రతికలకెక్కిన కీర్తితో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలాంటపుడు వైఎస్ నాయకత్వం తీసుకున్నారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను చైతన్య పరిచారు. ప్రజలను ఉత్తేజ పరిచారు.
అంతవరకు హైదరాబాద్ లో గాంధీ భవన్ కు ఎవరూ పెద్దగా వచ్చే వారు. పిసిసి సెక్రటరీ కుమార్ రావు, ఫ్రొటోకోల్ వ్యవహారాలు చూస్తున్నవేణు, కరీంనగర్ కు చెందిన మృత్యుంజయ్, రైతు నాయకుడు కోదండరెడ్డి ప్రధాన కార్యదర్శి డి నిరంజన్ తదితరులు రెగ్యులర్ గా గాంధీభవన్ లో కనిపించే వారు. మేనేజర్ ‘పంతులు గారు’, టెలిఫోన్ ఆపరేటర్ ప్రభు రోజూ ఠంచన్ గా గాంధీ భవన్ కు వచ్చే వారు. ‘పంతులు గారు’ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్యకు తెనాలి స్కూల్లో సమకాలీకులు కూడా.
ఇలా కొంతమంది పదహారాణాల కాంగ్రెస్ వాళ్లతోనే గాంధీ భవన్ నడిచింది. సరే, కొంత మంది పత్రికల వాళ్లు కాంగ్రెస్ బీట్ వల్ల అక్కడే తిష్టవేసి ఉండేవారు. పదువుల్లో ఉన్నవాళ్లు సాధారణంగా గాంధీ భవన్ కు రావడం చాలా అరుదు. ముఖ్యంగా మంత్రులు రావడం బాగా తక్కువ. పదవులు లేని వాళ్లే గాంధీ భవన్ కు అండ. నిజానికి అపుడో విమర్శకూడా ఉండింది. గాంధీ భవన్ కాంగ్రెస్ వేరు, సెక్రేటేరియట్ కాంగ్రెస్ వేరు అని. మొదటి బలహీనుల కాంగ్రెస్ అయితే, రెండోది బలవంతులది.
అయితే, 2004 లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక చాలా మంది గాంధీ భవన్ కు రావడం మొదలయింది. అలా 2009దాకా గాంధీ భవన్ జనంతో, నేతలతో నిత్య సమావేశాలతో కలకలలాడింది. వైఎస్ ఆర్ మరణం, ఆపైన ఉదృతమయిన తెలంగాణ ఉద్యమం గాంధీ భవన్ని మళ్లీ మసక బరిచాయి.
2014 లో తెలంగాణ రావడం, ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో గాంధీ భవన్ కళ తప్పింది. ఒక దశలో గాంధీ భవన్ ని కాంగ్రెస్ పార్టీ ఖాలీ చేసిందా అనేటట్లు ఉండింది. లోన కుక్కలు స్వేఛ్చగా వచ్చి వెళ్లుతూ ఉండేవి. సిబ్బంది కూడా బాగా నీరసపడి కనిపించారు. జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందని చెబుతారు. ఈ అమావాస్య దాదాపు ఎనిమిది సంవత్సరాలు సాగింది.
అంతకు ముందు డి శ్రీనివాస్ హయాంలో రకరకాల కారణాల వల్ల కలకలం బాగా తగ్గిపోయింది. ఎన్ ఉత్త మ్ కుమార్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉండిన కాలంలో గాంధీ భవన్ ని సజీవంగా ఉంచేందుకు బాగా కృషి చేశారు. అయితే, ఆయనకు పరిస్థితులు అనుకూలించలేదు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా రావడం ఒకసుడిగాలి సృష్టించింది. ఆయన గాంధీ భవన్ ని కేంద్రం చేసుకోవడంతో గాంధీ భవన్ కి మళ్లీ 2004 నాటి రోజులు వచ్చాయి.
2021 జూలై లో రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతల తీసుకునేందుకు రేవంత్ రెడ్డి భారీ ర్యాలీతో వచ్చారు. అప్పటినుంచి ఇప్పటి దాకా జనం. కార్యకర్తలు గాంధీ భవన్ చుట్టూ బారులు తీరుతూనే ఉన్నారు.
2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు గెలుపొంది, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ ఎస్ లోకి ఫిరాయించేలా చేసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు తోచినపుడల్లా కాంగ్రెస్ కు డెత్ సర్టిఫికేట్ ఇస్తూ వచ్చారు. ఇపుడయితే, కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలే మిగిలారు. ఇలాంటి నిరుత్సాహ వాతావరణం గాంధీ భవన్ లో ఉండింది. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలనుంచి జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కెసిఆర్ జైత్ర యాత్ర మొదలు పెట్టినపుడు కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు రేవంత్ రెడ్డి ముందుకు రావడమే గొప్ప.
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలాన్నిచ్చింది. గాంధీ భవన్ ఒక రాజకీయ కేంద్రమయింది. ఇపుడు ఎగ్జిట్ పోల్స తర్వాత కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ను అక్రమించుకుంటున్నట్లు సందడి. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ హైదరాబాద్ వచ్చి ఓట్ల లెక్కింపు అనంతర పరిణామాలను మానిటర్ చేస్తారట.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకట్టుకునే అయస్కాంతం ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గిర ఉందని చాలా మంది భావిస్తుంటారు. అందువల్ల పొరపాటు హంగ్ హౌస్ ఏర్పడితే కాంగ్రెస్ ఎమ్యెల్యేలను కాపాడే బాధ్యతను అధిష్టానం ఆయనకు అప్పగించిందని ఒక వార్త. ఎమ్మెల్యేలందరని కౌంటింగ్ కేంద్రాలనుంచే రిసార్ట్ లకు తరలిస్తారని వదంతి. అయితే, అలాంటిదేమీ లేదని శివ కుమార్ హైదరాబాద్ వస్తూ బెంగుళూరులో విలేకరులకు చెప్పారు.
“2014లో నుంచి బీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. రెండు సార్లు టార్గెట్ మిస్సయ్యాం. ఈ సారి అసెంబ్లీలో ఉన్న 119 స్థానాలలో కాంగ్రెస్ ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారం చేపడుతుంది.ఎగ్జిట్ పోల్స్(Exit Polls) చెప్పిందదే. గెలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు తరలిస్తామనే వార్తలు అబద్దం. పుకార్లు మాత్రమే. అందులో ఏమాత్రం నిజం లేదు. సీఎం కేసీఆర్ ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తున్నట్లు వినబడుతోంది. కానీ మా ఎమ్మెల్యేలు పార్టీకి విధేయులు. ఎట్టి పరిస్థితిలో ప్రలోభాలకు లొంగరు,” అని ఆయన అన్నారు.
మరొక వైపు, ఢిల్లీ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ దూతలు వస్తున్నారు. మెజారిటీ వస్తే తీసుకోవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు ఏఐసిసి ప్రతినిధులుగా మాజీ కేంద్రమంత్రులు చిదంబరం,సుశీల్ కుమార్ షిండే, సీనియర్ నాయకుడు సూర్జేవాలాని నియమించారు.
ఇది ఇలా ఉంటే, సీఎం కేసీఆర్ శుక్రవారం అధికార నివాసం ప్రగతిభవన్ లో పనిచేసే సిబ్బందికి కానుకలు అందించారు. కొత్త బట్టలు పెట్టడంతో పాటు ఇతర వస్తువులను అందించి వారితో కాసేపు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఉదయం కేటీఆర్, హరీశ్ రావు తదితరులు కేసీఆర్ ను మంతనాలాడినట్లు సమాచారం.