బదిలీలు షురూ చేసిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్ విభాగాల్లో బదిలీలను ప్రారంభించింది. అందులో భాగంగా ఇంటలిజెన్స్ డీజీ గా సీనియర్ ఐపీఎస్ అధికారి బత్తుల శివ్ ధర్ రెడ్డిని నియమించింది. అలాగే సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వూలు జారీ చేశారు. రానున్న రోజుల్లో కీలకమైన విభాగాల్లో సైతం స్థానం చలనం జరిగే అవకాశాలున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో గులాబీ పార్టీతో సన్నిహితంగా మెలిగారంటూ కొంతమంది అధికారులపై పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన తొలి కేబినేట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.