పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇన్ని అక్రమాలా:  హైకోర్ట్ ఛార్జ్ అవాక్కు
x
Telangana High Court

పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇన్ని అక్రమాలా: హైకోర్ట్ ఛార్జ్ అవాక్కు

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిపై హైకోర్టు ఆక్షేపించింది. పీసీబీ పనితీరు దారుణంగా ఉందని,ప్రక్షాళన చేయాలని హైకోర్టు ఆదేశించింది. పీసీబీ అక్రమాల బాగోతంపై స్టోరీ


తెలంగాణ రాష్ట్రంలో కాలుష్యాన్ని నియంత్రించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో అవినీతి, అక్రమాలు, విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, లొసుగులు వెలుగుచూశాయి. గత కొంత కాలంగా తెలంగాణలో వాయు, జల, శబ్ధ కాలుష్యం పెచ్చుపెరిగిపోతున్నా, దీన్ని నివారించడంలో పీసీబీ అధికారులు విఫలమయ్యారు. పెచ్చుపెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టాలని ప్రజలు పీసీబీకి ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు మాత్రం సకాలంలో చర్యలు తీసుకోవడం లేదు. గత ఏడు నెలలుగా పీసీబీపై దాఖలైన కేసులను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు అధికారుల పనితీరును తప్పుబట్టింది. పీసీబీ అధికారులు ఇంజినీరింగ్ కాలేజీల నుంచి పొందిన శిక్షణపైనే హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. పీసీబీని ప్రక్షాళన చేసి అసమర్ధ అధికారులను సాగనంపాలని హైకోర్టు ఆదేశించింది. పీసీబీ అధికారులు కార్యాలయాల్లో కూర్చొని ఉండటం కాదని, ప్రజల హక్కులను రక్షించాల్సిన బాధ్యత వారిపై ఉందని హైకోర్టు జడ్జీలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


కాలుష్య కారక కంపెనీ మూసివేత నోటీసులో లొసుగులు
రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫ్రోస్టర్స్‌ కంపెనీకి జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ డి కృపానంద్ జారీచేసిన కంపెనీ మూసివేత నోటీసులో పలు లొసుగులు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. మొదట పీసీబీ అధికారి కృపానంద్ కంపెనీకి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ప్టాస్టిక్‌ వాషింగ్‌ యూనిట్‌కు అనుమతి అవసరం లేదంటూ ఆ కంపెనీ సమాధానం ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన వివరణను పట్టించుకోకుండా, తమ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొంటూ అధికారి మూసివేత ఆదేశాలు జారీచేశారు. మూసివేత ఆదేశాలను సవాల్‌ చేస్తూ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు ఆదేశంతో ఇంజినీరుపై బదిలీవేటు
కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలో లొసుగులను ఉద్ధేశపూర్వకంగా వదిలిపెట్టినందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారి, పీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ డి కృపానంద్ ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 15వతేదీన ఆదేశాలు జారీచేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ మూసివేయాలని ఆదేశించి ఏడేళ్లు గడిచినా ఇంకా పరిశ్రమ నడుస్తుందని బెంచ్ పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో పీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ డి కృపానంద్ ను బదిలీ చేస్తూ పీసీబీ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

కాలుష్యాన్ని నియంత్రించే వారేరి?
తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (టీపీసీబీ)లో అవినీతి అధికారులు ఉన్నారంటూ హైకోర్టు పేర్కొంది. పీసీబీని సంపూర్ణ ప్రక్షాళన చేయాలని, అవినీతి అధికారులపై సుమోటోగా చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. గతంలో పలువురు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సోదాల్లోనే తేలింది. పరిశ్రమల కాలుష్యంపై ప్రజలు ఫిర్యాదు చేసినా పీసీబీ అధికారులు మాత్రం వాటిపై సత్వరం చర్యలు తీసుకోవడం లేదు. కొందరు అధికారులు పరిశ్రమల యజమానుల నుంచి డబ్బులు తీసుకొని కాలుష్య కారకాలను విడుదల చేస్తున్న పరిశ్రమలను కొనసాగిస్తున్నారని హైదరాబాద్ నగరానికి చెందిన కాలసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కాలుష్యం ఏ నెలకానెల పెరుగుతున్నా దాన్ని నిరోధించడంలో పీసీబీ అధికారులు విఫలమవుతున్నారు.

ఏసీబీ అధికారుల సోదాలు
హైదరాబాద్ కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఓ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదా చేయగా, సంపాదనకు మించిన ఆస్తులు వెలుగుచూశాయి. వనస్థలిపురంలోని జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంట్ ఇంజినీరు ఏ సురేందర్ రాజ్ ఇంట్లో ఏసీబీ ఇంట్లో జరిపిన సోదాల్లో వనస్థలిపురంలో నాలుగు ఇళ్లు, ఉప్పల్, హబ్సిగూడలో రెండు ఫ్లాట్లు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 13 ప్లాట్లు, నల్గొండ జిల్లా నేరడ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, 1.7 కిలోల బంగారం, 5 కిలోల వెండి, రెండు కార్లు వెలుగుచూశాయి. సంపాదనకు మించిన ఆస్తులున్నాయని ఏసీబీ సురేందర్ రాజ్ పై కేసు నమోదు చేసింది.

ఫిర్యాదులపై పీసీబీ ప్రాంతీయ అధికారిణి బదిలీ
హైదరాబాద్ కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ ప్రాంతీయ అధికారి సంగీతను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. డబ్బులిస్తేనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తారని వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పీసీబీ సంగీతకు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరింది. పలు పరిశ్రమల యజమానులు సంగీతపై జోనల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన పీసీబీ ఉన్నతాధికారులు సంగీతపై బదిలీ వేటు వేశారు. సంగీత స్థానంలో అసిస్టెంట్ ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ సంగీత లక్ష్మీని నియమించారు.

ఇళ్ల మధ్య రెడీ మిక్స్ ప్లాంట్
గచ్చిబౌలిలో నడిబొడ్డున అక్రమంగా ఏర్పాటు చేసిన రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంటుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నోటీసు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంటు మూసివేతకు నోటీసు జారీ చేశారు. ఎఫ్ సీఐ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ సొసైటీ లేఅవుట్ నివాసుల ఫిర్యాదుల మేర రెడీ మిక్స్ ప్లాంటుకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాలుష్య నియంత్రణ సవరణ చట్టం 1988 ప్రకారం ప్లాంటుపై చర్యలు తీసుకున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి కాలుష్య కారక పరిశ్రమలు ఏర్పాటు చేయరాదనే ఉత్తర్వులున్నా దాన్ని పాటించడం లేదు.

క్రషర్ల నుంచి వెలువడుతున్న దుమ్మూ,ధూళి
తెలంగాణలో కాలుష్య కారక 1000 స్టోన్ క్రషర్లలో 300 క్రషర్లు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి లేకుండానే నడుస్తున్నాయి. క్రషర్ల నుంచి వెలువడుతున్న దుమ్మూ,ధూళి వెలువడుతోంది. కాలుష్య కారక క్రషర్లపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రిపోర్టు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. 690 క్రషర్లలో 277 మూసివేయమని నోటీసులు జారీ చేశామని పీసీబీ అధధికారులు చెబుతున్నారు. జనవాసాలకు 800 మీటర్ల దూరంలో క్రషర్లు ఉండరాదు. కానీ హైదరాబాద్ శివార్లలోని క్రషర్లు అన్నీ పట్టణాలు, గ్రామాల సమీపంలోనే ఉన్నాయి.ఓఆర్ఆర్ సమీపంలో వట్టినాగులపల్లి, గోపన్ పల్లి, ఖాజాగూడ ప్రాంతాల్లో క్రషర్లు నడపరాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చినా బేఖాతరు చేశారు.జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో రాష్ట్ర రహదారులకు 100 మీటర్ల దూరంలో ఉండాలని పీసీబీకి విజిలెన్స్ సిఫారసు చేసినా అది కూడా బుట్ట దాఖలా చేశారు.

ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు
ఎస్‌ఎన్‌ఎస్‌ ప్యాక్టరీ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు పలు గ్రామాల్లో గాలి, నీరు కలుషితమవుతోంది. ఎర్రవల్లి మండల పరిధిలోని కొండేరు గ్రామ శివారులోని ఎస్‌ఎన్‌ఎస్‌ ప్యాక్టరీ 44వ నెంబర్‌ జాతీయ రహదారి పక్కనే ఉంది. ఈ పరిశ్రమ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలను సమీపంలో ఉండే నీటిలోకి యథేచ్చగా వదిలేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎంపీపీ అధ్యక్షురాలు స్నేహ, కొండేరు, జింకలపల్లి, శేకుపల్లి, ఎర్రవల్లి గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేసినా పీసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలోనూ అక్రమాలు జోరుగా సాగుతున్నాయని ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ సోదాల్లో తేలింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి సత్యనారాయణ అక్రమాస్తుల చిట్టా చూస్తే షాక్ అవ్వాల్సిందే. సత్యనారాయణకు చెందిన 8 చోట్ల దాడులు చేయగా 35 కోట్ల రూపాయలకు పైగా ఇళ్లు, స్థలాలు, ప్లాట్లు, ఫ్లాట్లు, బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లు వెలుగుచూశాయి. ఏపీకి చెందిన టాస్క్ ఫోర్స్ డివిజన్ సీనియర్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ కోరుకొండ రమేష్ అక్రమాలు వెలుగుచూశాయి. సంపాదనకు మించిన రూ.7కోట్ల ఆస్తులున్నాయని ఏసీబీ దాడుల్లో వెలుగుచూసింది. ఏపీలోని శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లాల దాకా కాలుష్య నియంత్రణ టాస్క్ ఫోర్స్ డివిజన్ బాధ్యతలు నిర్వర్తించిన కోరుకొండ రమేష్ ఏసీబీకి చిక్కారు.








Read More
Next Story