తెలంగాణలో పోలీసుల ఎన్నికల తనిఖీలు షురూ
x
Police Checking (Photo Credit : Hyderabad City Police)

తెలంగాణలో పోలీసుల ఎన్నికల తనిఖీలు షురూ

పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తనిఖీలకు శ్రీకారం చుట్టారు.గతంలో నగదు సీజ్ కేసులు నీరుగారిపోయినా, మళ్లీ చెకింగులకు తెర లేపారు,


పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఎన్నికల కోడ్ ప్రకారం తెలంగాణలో ఎవరైనా సరే రూ.50వేల కంటే ఎక్కువ డబ్బును వెంట తీసుకెళ్లడానికి అనుమతి లేదు. అంతకంటే ఎక్కువ డబ్బు తీసుకువెళితే ఆధారాలు ఉండాలి. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు కీలక పాత్ర వహించనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఆర్థికంగా బలమున్న అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మరో వైపు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేసి అక్రమంగా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు.


షెడ్యూల్ విడుదలకు ముందే తెలంగాణలో పోలీసుల తనిఖీలు
ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే తెలంగాణ పోలీసులు ధన ప్రభావంపై దృష్టి సారించారు. రాయదుర్గం, మేడ్చల్ ప్రాంతాల్లో రూ.70 లక్షల హవాలా డబ్బును ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకున్న బంగారు నగలు, డబ్బుకు గడువు లోపు ఆధారాలు చూపించకుంటే వాటిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తారు. ఎన్నికల సమయంలో బంగారమైనా, డబ్బైనా బయట తీసుకెళ్లేటప్పుడు, కచ్చితమైన ఆధారాలను కూడా వెంట తీసుకెళ్లాలి. నగలైతే, వాటికి సంబంధించిన బిల్లులను తీసుకెళ్లాలి. అదే డబ్బైతే, ఎవరు ఇచ్చారో, ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళుతున్నారో, ఏ అకౌంట్ నుంచి డబ్బును డ్రా చేశారో, ఏ అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చెయ్యాలనుకుంటున్నారో వివరాలు చెప్పాల్సి ఉంటుంది.

గత ఎన్నికల్లో రూ.800కోట్లు సీజ్ చేసినా...
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది డిసెంబరు నెలలో జరిగిన ఎన్నికల్లో పోలీసులు 800 కోట్ల రూపాయల నగదు, బంగారాన్ని సీజ్ చేశారు. ఇందులో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పక్షాన వారి ఉద్యోగులు ఓటర్లకు డబ్బును పంచేందుకు తీసుకువెళుతున్నా, ఎన్నికల అధికారులు, పోలీసులు మాత్రం అసలు అభ్యర్థులపై కేసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ఎన్నికల్లో ఓట్ల కొనేందుకు పేదలకు డబ్బు పంపిణీ చేసిన ఘటనలు కూడా గతంలో వెలుగుచూశాయి. ఎన్నికల్లో డబ్బు కీలకంగా మారినా, దీన్ని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుకున్న డబ్బును వదిలివేశారు. గత ఎన్నికల్లో పోలీసులు పట్టుకున్న రూ.800కోట్లను వదిలివేసినా, దీని గురించి ఎందుకు పత్రికలకు విడుదల చేయలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ఈసీని ప్రశ్నించారు.

డబ్బు దొరికినా నిందితులపై చర్యలేవి?
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడితే ఐపీసీ సెక్షన్ 171 ప్రకారం ఏడాది జైలు శిక్ష విధించాలి. కానీ కోట్లాదిరూపాయలు పట్టుబడినా ఒక్కరంటే ఒక్కరికి కూడా శిక్ష పడలేదంటే పోలీసులే విచారణను నీరుగార్చారని విదితమవుతోంది. గత ఎన్నికల సమయంలో పెట్టిన కేసుల్లో ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లడాన్ని నివారించడంలో ఎన్నికల కమిషన్, పోలీసులు సీజ్ పేరిట హడావుడి చేయడమే తప్ప ఒక్క అభ్యర్థిపై కూడా చర్యలు తీసుకోలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మాయమాటలు చెప్పి మూటలిచ్చి మభ్యపెట్టేవారిని నమ్మకండి, వారికి ఓటేయకండి అని శ్రీనివాసరెడ్డి ఓటర్లకు సూచించారు.

రూ.5.8 కోట్లు పట్టుబడినా చర్యలేవి?
జనగామ పట్టణంలో 2018 డిసెంబర్ 4వతేదీన ఎన్నికల సమయంలో ఏపీ 37 సీకే 4985 కారును ఆపి తనిఖీ చేయగా 5.8 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. ఈ డబ్బును షెల్ కంపెనీల పేరిట ఫోర్జరీ డాక్యుమెంట్లతో కారు సీటు కింద బాక్సుల్లో డబ్బును తరలిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ డబ్బులో రూ.2కోట్లు ఓ ఎంపీదని,మరో కోటిన్నర రూపాయలు మరో ఎంపీదని, మిగిలిన రూ.2.3 కోట్లు మరో వరంగల్ కీలక నాయకుడిదని తేలింది. దీనిపై పోలీసులు ఆర్థిక నేరం కింద మనీలాండరింగ్ కేసు నమోదు చేసినా, ఆ డబ్బును మాత్రం వారికి తిరిగి అప్పగించారు. ఇలా ఎన్నికల సమయంలో డబ్బు పట్టుబడిన పలు కేసుల్లో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డబ్బులు సీజ్ చేసిన కేసుల్లో అసలు అభ్యర్థులపై కాకుండా వారి ఉద్యోగులపై నామమాత్రంగా కేసు నమోదు చేసి, దీనిపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.

కోట్లరూపాయలు ఖర్చు చేసినా...
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ప్రచారం కోసం రూ.40 లక్షలకు మించి ఖర్చు చేయరాదని ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. కానీ పలువురు అభ్యర్థులు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 10 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చుచేశారనేది బహిరంగ రహస్యమే. ఎన్నికలు ముగిశాక ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 77 ప్రకారం నెలరోజుల లోగా ఎన్నికల వ్యయ నివేదికలను ఎన్నికల కమిషన్ అధికారులకు సమర్పించాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కోట్లాది రూపాయలను వెదజల్లినా, వారి వ్యయనివేదికల్లో మాత్రం రూ.20 లక్షల 35 లక్షల రూపాయలే ఖర్చు చేసినట్లు ఈసీకి నివేదికలు సమర్పించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నియమితులైన ఎన్నికల వ్యయ పర్యవేక్షణ అధికారులు కూడా అభ్యర్థుల వ్యయనివేదికలను సరిచూసి సంతకాలు కూడా చేశారు.

చేసిన ఖర్చు వ్యయనివేదికల్లో మాయం
విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు కూడా తాము కేవలం 25 లక్షలే ఖర్చ చేశామని వ్యయనివేదికల్లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు కోట్లాదిరూపాయలను వెచ్చించినా, ఆ వెచ్చించిన డబ్బు మాత్రం వారి వ్యయ నివేదికల్లో కనిపించలేదు. కొందరు అభ్యర్థులు ఓటుకు రెండు నుంచి అయిదు వేల రూపాయలను పంచినా, ఎన్నికల వ్యయ నియంత్రణ అధికారులు, రిటర్నింగ్ అధికారులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు.

ఈసీకి హైదరాబాద్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
కొన్ని రాజకీయ పక్షాల అభ్యర్థులు అంగట్లో సరుకుల్లాగా ఖరీదు కట్టి ఓటర్లను కొనుగోలు చేసినా ఎన్నికల అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగరానికి చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి యం పద్మనాభరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ కు మంగళవారం లేఖ రాశారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకొని పార్లమెంట్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా నిర్వహించాలని పద్మనాభరెడ్డి కోరారు.


Read More
Next Story