రాజ్ ఫుత్ నాయకుడు దారుణ హత్య.. రణరంగమైన రాజస్తాన్
x
ఆందోళన చేస్తున్న సుఖ్ దేవ్ మద్దతుదారులు

రాజ్ ఫుత్ నాయకుడు దారుణ హత్య.. రణరంగమైన రాజస్తాన్

రాజస్తాన్ లో మంగళవారం శ్రీ రాష్ట్రీయ రాజ్ ఫుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ గోగమేడిని దుండగులు హత్య చేశారు.


జైపుర్ లోని అతని ఇంటిలోనే పట్టపగలు కొంతమంది దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో రాష్ట్రమంతటా ఆందోళనలు చెలరేగాయి. హత్యపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రాన్ని నిరవధికంగా బంద్ చేస్తామని ఆయన మద్దతుదారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సుఖ్ దేవ్ గోగమేడిని చంపడానికి వచ్చిన వారిలో ఒకరిని ఆయన సెక్యూరిటీ సిబ్బంది కాల్చగా, నవీన్ షేకావత్ అనే దుండగుడు హతం అయినట్లు కమిషనర్ బిజూ జార్జ్ మీడియాకు తెలిపారు. పారిపోయిన ఇద్దరి కోసం రాష్ట్రమంతా గాలిస్తున్నామని చెప్పారు. హత్య జరిగిన సమయంలో ఆయన ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ హత్య రికార్డు అయింది. ఈ వీడియోలు బయటకు రావడంతో రాష్ట్రమంతా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటనపై గవర్నర్ కల్ రాజ్ మిశ్రా డీజీపీ నుంచి నివేదిక కోరారు.

ఎలా జరిగింది...

సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైన వివరాల ప్రకారం... మధ్యాహ్నం సమయంలో ముగ్గురు వ్యక్తులు జైపుర్ లోని సుఖ్ దేవ్ నివాసానికి వచ్చారు. ఆయనతో మాట్లాడాలని సెక్యూరిటీకి సిబ్బందికి చెప్పడంతో వారు లోపలకు అనుమతించారు. లోపల కూర్చుని కాసేపు మాటలు కలిపిన దుండగులు, తరువాత తుఫాకీలు తీసి పాయింట్ బ్లాక్ లో కాల్చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సుఖ్ దేవ్ 2015లో శ్రీ రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణిసేన ను స్థాపించి పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. 2018లో వచ్చిన పద్మావత్ చిత్రంపై భారీగా ఆందోళనలు చేపట్టారు. చారిత్రకంగా సినిమాను వక్రీకరించారంటూ నిరసన తెలిపారు.ఈ హత్యపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రోహిత్ గోదారా గ్యాంగ్ హత్యకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ హత్యపై రాజ్ ఫుత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైపూర్, జోధ్ పూర్ లో ఆందోళనలు చెలరేగాయి.

Read More
Next Story