ప్రమాణ స్వీకారం చేయనున్న వేదిక పేరు ఏంటంటే..
x
సోనియాగాంధీతో రేవంత్ రెడ్డి

ప్రమాణ స్వీకారం చేయనున్న వేదిక పేరు ఏంటంటే..


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోయే వేదికకు ‘తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రమాణస్వీకారం’ అనే పేరుతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ పాలనను ఎన్నికల ప్రచారంలో నిరంకుశం పాలనగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి విజయం సాధించింది. అందుకే ప్రమాణ స్వీకార వేదిక పేరును ప్రజా ప్రభుత్వంగా పెట్టినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

ప్రమాణస్వీకారానికి ఇప్పటికే అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఎంపిక చేసుకున్న ఎల్బీ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన వేదికతో పాటు ఇరువైపులా రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర కాంగ్రెస్ అగ్రనేతలు కొలువుదీరుతారు. రెండో వేదికపై ఏఐసీసీ నేతలు, మూడో వేదికపై డీసీసీ నాయకులు ఉంటారు. వీటితోడు 300 మంది అమరుల కుటుంబాలను ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వనాలు అందించారు. వీరి కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల కోసం మరొక గ్యాలరీ, 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేశారు. ముప్పై వేల మంది ప్రజలు కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే రెండు ఎల్ ఈ డీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి.

Read More
Next Story