జనసేన పార్టీ అధ్యక్షుడు కె పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ జీవితంతో బీజేపీ నాటకమాడుతున్నదా? వివరాలు


జనసేనాని పవన్‌కళ్యాన్‌తో బీజేపీ దోబూచులాట

అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ఇదేమిటనుకుంటున్నారా. జనసేన పార్టీ అధ్యక్షుడు కె పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ జీవితంతో బీజేపీ ఆడుతున్న నాటకం. ఈ నాటకంలో బీజేపీ రక్తి కట్టిస్తుందా? విరక్తి పుట్టిస్తుందా? ఈ నాటకాన్ని పవన్‌ కళ్యాణ్‌ స్వాగతిస్తారా? తిరస్కరిస్తారా? అంటే నేను బీజేపీతో ఉన్నానని చాలా సార్లు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. శనివారం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ప్రకటనలు చూస్తే ‘ఇదేమి నాటకం’ అనాల్సిందే.
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మా పార్టీ తెలంగాణలో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌తో సంబంధం లేకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ వల్ల మాకు నష్టం జరిగిందనే భావనను కిషన్‌రెడ్డి వ్యక్తం చేశారు.
పైగా జనసేనకు ఏడు నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. అంటే తెలంగాణ ప్రజలకు పవన్‌కళ్యాణ్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలినందున ఆయనను దూరంగా పెట్టటమే మంచిదనే ఆలోచనలో బీజేపీ వారు ఉన్నట్లు తెంగాణ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
పవన్‌కళ్యాణ్‌ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పరోక్షంగా సాయం చేశారని, అది తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న డీలింగ్‌ వల్ల జరిగిందని బీజేపీ భావిస్తోంది. అందువల్ల పవన్‌ కళ్యాణ్‌కు తెలంగాణలో దూరంగా ఉండటం మంచిదని కిషన్‌రెడ్డి ఈ ప్రకటన చేసినట్లున్నారు.
ఏపీలో ఎందుకిలా..
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీతో కలిసే పవన్‌కళ్యాణ్‌ ప్రయాణం సాగిస్తున్నారు. మా పార్టీతో పవన్‌కళ్యాణ్‌ కలిసి పనిచేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శనివారం స్పష్టం చేశారు.
ఆమె బీజేపీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఏపీలో పవన్‌కళ్యాణ్‌ బీజేపీతో కలిసి నడుస్తున్నారన్నారు. బీజేపీతో అంటీ ముట్టనట్లు ఉన్న తెలుగుదేశం పార్టీతో ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌ పొత్తులు కుదుర్చుకున్నారు. టీడీపీ, జనసేన ఎవరు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే దాదాపు 90 మంది అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం పార్టీ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈనెల 20న విజయనగరం జిల్లాలో జరిగే యువగళం ముగింపు సభకు వీరందరికీ ఆహ్వానాలు అందే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లు కూడా ఎన్ననే విషయంపై తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అలయన్స్‌లో సీట్ల కేటాయింపుపై పవన్‌కళ్యాణ్‌ను చంద్రబాబు నాయుడు సంతృప్తి పరుస్తాడా? లేక అసంతృప్తితోనే సరే అనే విధంగా చేస్తాడా అనే చర్చ కూడా సాగుతున్నది.
టీడీపీ గెలుపు అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉంటే వారిని కాదని జనసేనకు ఆ సీట్లు కేటాయించాల్సి వచ్చినప్పుడు ఎలాగనే చర్చకూడా టీడీపీలో సాగుతున్నది. ఈ విషయాలపై చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా నోరు విప్పలేదు. పవన్‌కళ్యాణ్‌ మాత్రం నోరు విప్పడమే కాకుండా టిడీపీపై ఎటువంటి విమర్శలు చేయవద్దని, ఎవరైనా టీడీపీపై అసంతృప్తి ఉంటే వారు నిరభ్యంతరంగా జనసేన నుంచి బయటకు వెళ్లి పోవచ్చని సెలవిచ్చారు.

టీడీపీ, జనసేన అంతర్గత వ్యవహారాలు ఇలా ఉంటే బీజేపీ అధ్యక్షురాలు మాత్రం జనసేన మాతోనే ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమితో కలుస్తుందా? లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టిడీపీ అభ్యర్థులుగా ఇప్పటికే నిర్ణయించిన వారిలో కొందరు బీజేపీతో కలిసేందుకు రహస్య చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు మా పేర్లు బయటకు రావడం అంత మంచిది కాదని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయంటున్నారు.
బీజేపీతో కలిస్తే టీడీపీకి ఏమేరకు నష్టం
బిజేపీతో కలవాలా.. వద్దా.. అనే విషయంలో ఇప్పటికీ ఎటువంటి ప్రకటన చేయకుండా లోపాయికారి చర్చలకు టీడీపీ తెరలేపింది. బీజేపీని కలుపుకుంటే మైనార్టీల నుంచి ఎటువంటి ఇబ్బంది వస్తుందనే విషయంపై మైనార్టీ ముఖ్య నాయకులతో టీడీపీ చర్చిస్తున్నది. ఇదంతా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే జరుగుతున్నదని టీడీపీలోని మైనార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Next Story