వైఎస్‌ఆర్‌సీపీలో సీట్లు దక్కని వారి చూపెటు

షర్మిల ఎంట్రీ వెనుక కాంగ్రెస్‌ భారీ స్కెచ్‌


వైఎస్‌ఆర్‌సీపీలో సీట్లు దక్కని వారి చూపెటు
x
వైఎస్‌ షర్మిల

వైఎస్‌ఆర్‌సీపీలో సీట్లు దక్కని వారు ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో ఉన్నారు. వారిని ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. వైఎస్‌ఆర్‌సీపీలో రెండు సార్లు గెలిచిన వారిలో కొందరికి నియోజకవర్గాల మార్పు జరుగుతున్నది. ఏకంగా 62 మంది ఎమ్మెల్యేల సీట్లు గల్లంతవుతున్నట్లు తెలుస్తుంది. వైఎస్సార్‌సీపీలోని ముఖ్య నాయకులు ఈ విషయంపై మాట్లాడుతూ నిజమేనంటున్నారు. వైఎస్సార్‌సీపీ చేయించిన సర్వే ప్రకారం 62 మంది ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు కానున్నాయి. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే ఆరుగ్గురు కొత్త వారిని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. మిగిలిన వారిని ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చారు.

వైఎస్‌ఆర్‌సీపీలో జరుగుతున్న పరిణామాలను టీడీపీ కూడా ఆసక్తిగా పరిశీలిస్తున్నది. ముఖ్యనాయకులు ఎవరైనా వస్తే పార్టీలోకి తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. టీడీపీలో గెలిచిన ఐదుగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే వారికి తిరిగి టికెట్లు వైఎస్సార్‌సీపీ ఇస్తుందనే నమ్మకం లేదు. గుంటూరు వెస్ట్‌ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన మద్దాలగిరి వైసీపీలోకి వచ్చినా టిక్కెట్‌ వైసీపీలో దక్కలేదు. ఇలా ఎందరో ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఈ నియోజకవర్గాల్లో పెద్ద కుదుపు
ఇప్పటికే వేమూరు, రేపల్లె, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, తాడికొండ, మంగళగిరి, గుంటూరు వెస్ట్‌లకు అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ మార్చేసింది. పొన్నూరు, పెదకూరపాడు, సత్తెపల్లి నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను మార్చే అవకాశాలు ఉన్నాయి.
విజయనగరం జిల్లా బొబ్బిలి, ఎస్‌ కోటల్లో కూడా అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ జిల్లాలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అక్కడ వరికూటి రామచంద్రరావును నియమించారు. మంత్రి విశ్వరూప్‌కు కూడా ఈ సారి టిక్కెట్‌ దక్కే అవకాశాలు లేవని తెలిసింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఏలూరులో కూడా ఆళ్ల నాని స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గన్నవరం, పెనమలూరుల్లో అభ్యర్థుల మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పరిస్థితి అయోమయంగా ఉండటం, అద్దంకి, కొండపి, ఎస్‌ఎన్‌ పాడులకు మార్పులు చేయడం తెలిసిందే.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు టౌన్‌లో ఉన్న మాజీ మంత్రి అనిల్‌కుమార్, గూడూరు, కావలి సీట్లలో కూడా మార్పులు జరుగుతాయని పార్టీ వర్గాలు చెప్పాయి. శ్రీకాళహస్తి, జిడి నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, మదనపల్లి నియోజకవర్గాల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం.
అనంతపురం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒక మంత్రికి సీటు దక్కే అవకాశాలు లేవని తెలిసింది. ఈ లెక్కన వీరంతా అసంతృప్తితోనే ఉన్నారని సమాచారం.

షర్మిల ఎంట్రీతో వీరందరికీ సీట్లు
షర్మిలను కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచన వెనుక కాంగ్రెస్‌ పార్టీ భారీ స్కెచ్‌ వేసినట్లు తెలిసింది. వైఎస్సార్‌సీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలు మార్పునకు గురైన వారిని ఎలాగైనా కాంగ్రెస్‌వైపుకు తిప్పుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉంది. అది జరగాలంటే నాయకురాలుగా వైఎస్‌ షర్మిల ఉంటేనే సాధ్యమవుతుందనే ఆలోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది.
వైఎస్‌ఆర్‌ అభిమానులను ఏకంచేసే యత్నం
వైఎస్‌ఆర్‌ను అభిమానించే వారు వైఎస్సార్‌సీపీతో పాటు టీడీపీలోనూ కొందరు ఉన్నారని కాంగ్రెస్‌ భావిస్తోంది. వీరందరినీ ఏకం చేస్తే కాంగ్రెస్‌ బలం పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిపై ఉన్న అభిమానం కాంగ్రెస్‌కు ప్లస్‌ అవుతుందనే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉంది.
ఆశావహులకు, అసంతృప్తి వాదుకు రెడ్‌కార్పెట్‌
ఎవరైతే టిక్కెట్లు కావాలని ఆశిస్తున్నారో వారిలో కాస్త ఆర్థిక, అంగబలం ఉన్న వారిని రంగంలోకి దించాలనే ఆలోచన కాంగ్రెస్‌ చేస్తున్నది. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలోని అసంతృప్తి వాదుకు కాంగ్రెస్‌ రెడ్‌కార్పెట్‌ పరచనుంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌ బలం పెరగటం ఖాయం.
వైఎస్‌ మార్క్‌ పాలన, ఇందిరమ్మ రాజ్యమే ధ్యేయం
వైఎస్‌ మార్క్‌ పాలన, ఇందిరమ్మ రాజ్యం ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తామని ఎన్నికల్లో హామీలు ఇవ్వడంతో పాటు మిషన్‌ ఇంద్రధనస్సును అమలు చేస్తామని కాంగ్రెస్‌ వారు చెప్పనున్నారు. ఇప్పుడు జగన్‌ చేస్తున్నది వైఎస్‌ఆర్‌ ఆలోచనలు కాదని, ఎస్సీ ఎస్టీలకు ఈ పథకాల వల్ల నష్టమే కాని లాభం లేదని కాంగ్రెస్‌ వారు చెబుతున్నారు. రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్దికి తీసుకోవాల్సిన ఒక్క చర్యను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకోలని కాంగ్రెస్‌ వారు అంటున్నారు. ఇది తప్పకుండా కాంగ్రెస్‌కు అనులమవుతుందని అంటున్నారు.
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలే టార్గెట్‌
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు 29 ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఆయా కులాల వారు వైఎస్సార్‌ను ఎంతగానో అభిమానిస్తారని, ఆయన పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందనే విషయాన్ని వివరంగా చెప్పాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉంది. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే ఆమె ద్వారా వైఎస్‌ఆర్‌ పాలన ఎలా సాగిందో వచ్చే పాలన కూడా అలాగే సాగుతుందనే విషయాన్ని సష్టం చేయించాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తోంది.
కర్నాటక, తెలంగాణ ఊపులో ఆంధ్రప్రదేశ్‌
కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో అదే ఊపుతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రచారం సాగించి కాంగ్రెస్‌కు ఒక ఊపు తీసుకు రావాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ వారు ఉన్నారు. అందుకు ఇప్పుడు స్తబ్ధుగా ఉన్న పార్టీ నాయకులను రంగంలోకి దించి చురుకుగా పనిచేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు.
కుటుంబ మద్దతు వైఎస్‌ షర్మిలకే
కుటుంబ మద్దతు వైఎస్‌ షర్మిలకే ఉండే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే తల్లి విజయమ్మ షర్మిలను బలపరుస్తోంది. అలాగే కుటుంబంలోని కొందరు వ్యక్తులు షర్మిలనే అభిమానిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ భార్య భారతి బంధువులపై హత్యారోపణలు రావడం, వారిపై పోలీసు విచారణలు సాగుతుండటాన్ని షర్మిల కూడా ప్రస్తావించారు. అంటే కుటుంబంలోని బందువులందని మద్దతు ఎక్కువగా షర్మిలకే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గెలిస్తే షర్మిలనే ముఖ్యమంత్రి
తెలంగాణలో అనుసరించిన ఫార్ములానే ఆంధ్రాలో కూడా అమలు చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌లో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే త్రిముఖ వ్యూహ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే షర్మిలను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కసితోనైనా ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న కాంగ్రెస్‌ నాయకులు రంగంలోకి దిగి, రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రంపై పోరాటాలు చేస్తామని స్పందిస్తే తప్పకుండా కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉంటాయనే ఆలోచన కాంగ్రెస్‌ పెద్దల్లో ఉంది.


Next Story