మావోయిస్టు ప్రాంతాల్లో మూడంచెల భద్రత...డ్రోన్‌ పెట్రోలింగ్‌
x
Maoist areas...drone patrolling

మావోయిస్టు ప్రాంతాల్లో మూడంచెల భద్రత...డ్రోన్‌ పెట్రోలింగ్‌

తెలంగాణ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్లతో నిఘా వేశారు.కేంద్ర పారామిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


తెలంగాణ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మంచిర్యాల, కొమురం భీం,ఆదిలాబాద్, ములుగు, భద్రాచలం, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, జిల్లాల్లో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యత్మక ప్రాంతాలుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. 13 నక్సల్స్‌ ప్రభావిత అసెంబ్లీ స్థానాల్లో సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్‌ జరగనుంది.
- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు యాక్షన్ టీంలు ప్రవేశించాయని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బలగాలతో పహారా కాస్తున్నాయి.

మావోయిస్టు ప్రాంతాల్లో మూడంచెల భద్రత
మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాయుధ పోలీసుల పహరా పెట్టారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లు, ఛత్తీస్ గడ్ పోలీస్ సిబ్బంది ఇలా మూడు విభాగాల సిబ్బందితో ఎన్నికల బందోబస్తు ప్రణాళిక రూపొందించారు.మావోయిస్టులు ప్రవేశించారని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారంతో పోలీసులు పకడ్బందీ పోలీసు పోలింగ్ వ్యూహాలు రూపొందించారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రం నుంచి కూడా పోలీస్ సిబ్బందిని రప్పించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు.

డ్రోన్‌ పెట్రోలింగ్‌ యూనిట్లు
తెలంగాణ లోని ప్రాణహిత నది వెంబడి పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకునే పోలింగ్‌ కేంద్రాల్లో డ్రోన్‌ పెట్రోలింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసి నిఘా వేశారు. పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్, స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్స్ ఇలా.. అవసరాన్ని బట్టి ఒక్కోచోట ఒక్కోరకమైన పోలీసు బృందాలను నియమించారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పార్లమెంట్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని రామగుండం పోలీసులు చెప్పారు.

భారీ సాయుధ పహరా
మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సందర్భంగా భారీ సాయుధ పహరాను ఏర్పాటు చేశామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం శ్రీనివాసులు తెలిపారు. భద్రతా సిబ్బందికి సీపీ సలహాలు ఇచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పార్లమెంట్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ చెప్పారు.సివిల్ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్ హోంగార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, 443 కంపెనీలతో సహా మొత్తం 3300 మంది భద్రతా సిబ్బందిని మోహరించామని సీపీ వివరించారు.

కంట్రోల్ రూం
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించినట్లు సీపీ తెలిపారు.


Read More
Next Story