చక చకా చక్రం తిప్పిన వసుంధర    ......
x
VASUNDHRA RAJE (OLD PHOTO)

చక చకా చక్రం తిప్పిన వసుంధర ......

రాజకీయాల్లో ఓర్పు, నేర్పు ఉండాలంటారు కదా.. దానికి అచ్చమైన మచ్చు తునక వసుంధర రాజే. కుటుంబ నేపథ్యమే కాదు రాజకీయాల్లోనూ మహారాణినే అంటున్నారు వసుంధర..


రాజకీయాల్లో ఓర్పు, నేర్పు ఉండాలంటారు కదా.. దానికి అచ్చమైన మచ్చు తునక వసుంధర రాజే. రాజకీయాల్లో పడి లేచిన కెరటం. మోదీ, అమిత్ షా ధ్వయం తెర మీదకు వచ్చాక తెర మరుగయ్యారు. అయినా తిప్పు కున్నారు. రాజస్థాన్ సీఎం రేసులో నేనున్నానంటూ జెండా ఎగురవేశారు. కాదన్న కమలం పెద్దలతోనే ఢిల్లీకి పిలిపించుకునేలా చేశారు. ఇప్పుడు రాజస్థాన్ రాజకీయం రంజుగా సాగుతోంది.

హుటాహుటిన ఢిల్లీకి...

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. రాజే బుధవారం రాత్రి ఇండిగో ఎయిర్‌వేస్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వసుంధర రాజే గురువారం ఉదయం జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ కానున్నారు. రాజస్థాన్‌లో అధికారాన్ని వసుంధర రాజేకు అప్పగించాలని పార్టీ హైకమాండ్ మరోసారి భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. డిసెంబరు 3న రాజస్థాన్‌లో బీజేపీకి మెజారిటీ వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. ఈ జాబితాలో వసుంధర రాజే, అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, రాజేంద్ర రాథోడ్, దియా కుమారి, బాబా బాలక్‌నాథ్, ఓం బిర్లా పేర్లు ఉన్నాయి.

చకచకా చక్రం తిప్పిన వసుంధర రాజే..

రాజకీయాల్లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోయినా వెనకబడ్డం ఖాయం. ఆ విషయం తెలిసిన వసుంధర చకచకా చక్రం తిప్పారు. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. సీఎం రేసులో అనేక మంది పేర్లున్నా తన పేరు పైకి వచ్చేలా చేశారు. మహిళా బిల్లు తెచ్చిన బీజేపీలో ఓ మహిళకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరా అంటూ మెలిక పెట్టారు. ఇక అంతే బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేయాలనుకున్న కమలనాధులు సంకట స్థితిలో పడ్డారు. అనుకున్నదే తడవుగా ఎమ్మెల్యేలను విందుకు ఆహ్వానించారు. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఆమెను ముఖ్యమంత్రిని చేసేందుకు అంగీకరించారట. ఇటువంటి పరిస్థితిలో రాజే ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే..

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి సహకారమందించిన మహిళలకు బీజేపీ మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. మూడు రాష్ట్రాల్లోనూ కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కరు చొప్పున డిప్యూటీ సీఎం పదవులు మహిళలకు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు మరింతగా రాజకీయ సాధికారత కల్పించేందుకు పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో ఓబీసీ, ఛత్తీస్‌గఢ్‌లో ఎస్టీ, రాజస్థాన్‌లో రాజకుటుంబానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి దక్కడం ఖాయమంటున్నాయి బీజేపీ వర్గాలు.

Read More
Next Story