పేమెంట్‌ కోటా వర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా  ఎవరు వీళ్లు, ఎక్కడి వాళ్లు!
x
రేవంత్‌ వర్సెస్‌ కేటీఆర్‌

పేమెంట్‌ కోటా వర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా ఎవరు వీళ్లు, ఎక్కడి వాళ్లు!

బహుశా ఏ ఇంజినీరింగో, మెడికల్‌ సీట్లలోనో వినే ఈ మాటలు జనం తలరాతల్ని మార్చే రాజకీయాల్లో కూడా ఉంటాయా?


పేమెంట్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటాలాంటి పదాలు మీరెక్కడో విన్నట్టుంది కదూ. బహుశా ఏ ఇంజినీరింగో, మెడికల్‌ సీట్లలో విని ఉంటారు. మీ పిల్లలకో, మీకు తెలిసిన వాళ్లకో, బంధువుల పిల్లలకో ఇప్పించి కూడా ఉంటారు. జనం తలరాతల్ని మార్చే రాజకీయాల్లో కూడా ఉంటాయా? ప్రజాప్రతినిధులకూ ఈ కోటాలు వర్తిస్తాయా? తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాల తీరు చూస్తే ఉంటాయనే నమ్మాల్సి వస్తోంది.

ఎవరెవరు ఏయే కోటాలో...

"బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొందరికి మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లిచ్చారు. వాళ్లలో ఎవరెవరున్నారో ఈ సభలో ఉన్నవాళ్లందరికీ తెలుసు" అని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో అన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌), మరో మాజీ మంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ రేవంత్‌ రెడ్డి వాళ్ల పేర్లు ప్రస్తావించకుండా మేనేజ్‌మెంట్‌ కోటా అనే పదాన్ని ఉపయోగించారు.

మేనేజ్‌మెంట్‌ కోటా అంటే...

మేనేజ్ మేంట్ కోటాలో ప్రజాప్రతినిధిగా వచ్చారంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. "పేమెంట్‌ కేటగిరీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి పీసీసీ పదవి దక్కించుకున్నది రేవంత్‌ రెడ్డి" అంటూ కేటీఆర్‌ తిప్పికొట్టారు. కేటీఆర్‌ మాటలకు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా వంతపలికారు.

హుందాతనమేనా...

నిజానికి ఈ పదాలు ఎన్నికలకు ముందు నుంచే వినపడ్డా అవి అసెంబ్లీలోకి వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. 'ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుల నోట వినపడాల్సిన మాటలు కావు. ఎన్నికలకు ముందు విమర్శలు చేసుకోవడం సహజం. విమర్శలకు ధీటుగా స్పందించడం, తిప్పికొట్టడమూ మామూలే. అయితే నిండు సభలో ఇటువంటి మాటలనుకోవడం అంటే చట్టసభల ప్రతిష్టను దిగజార్చడమే. ప్రజలకు వీళ్లు ఏమి సందేశం ఇస్తున్నట్టు?' అని ఆవేదనతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌. సభల్లో ఉండాల్సిన హుందాతనం కొరవడుతుందన్న జల్లి విల్సన్‌ మాటలతో ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. అయితే హుందాతనాన్ని ప్రదర్శించడమంటే ఇవాళ చేతగానితనానికి నిదర్శంగా మారిందన్నది మరో యువనేత ఆక్బర్ పాషా ఆవేదన. రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న భాష నిజానికి దిగజారుడు తనానికి సంకేతంగానే ఉంది.

ఆకట్టుకోవాలంటే ఇలా మాట్లాడాల్సిందేనా...

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీఆర్‌ఎస్‌.. అసెంబ్లీలో దూకుడు పెంచింది. అధికార పక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మాటలకు బ్రేకులు వేయాలంటే ఇలాంటి పదాలు వాడక తప్పదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. "బీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అనడానికి కాంగ్రెస్‌కు ఏమి హక్కుంది. నిజానికి కాంగ్రెస్‌ పార్టే కుటుంబ పార్టీ. జవహర్‌ లాల్‌ నెహ్రూ మొదలు నేటి సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలంతా ఎవరు? ఒకే కుటుంబానికి చెందిన వారు కాదా? వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌ పార్టీకి మాట్లాడే అర్హతే లేదు" అని హరీశ్‌ రావు సవాల్‌ చేశారు. ఇలా మాటల తూటాలు పేలడం రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షించిందనడంలో ఆశ్చర్యం లేదు.

Read More
Next Story