ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశం

కాంగ్రెస్‌కు ఎంతోమంది టచ్ లో ఉన్నారట. వాళ్లూ గేమ్ షురూ చేస్తారట. హస్తినలో తేల్చుకొస్తామంటున్నారు..


కాంగ్రెస్ కు ఒకప్పుడు ఆయువుపట్టు ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కునారిల్లింది. పుట్టగతులు లేకుండా పోయాయి. ఇక ఈ పార్టీని గాడిన పెట్టడం నా వల్ల కాదంటే నా వల్ల కాదంటూ ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అధ్యక్షులు మారారు. ఇప్పుడు రుద్రరాజు తెరపైకి వచ్చారు. పాత వాళ్లందర్నీ కూడేసి ఓ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పిలుపొచ్చింది.

ఎందుకింత ఆకస్మిక పిలుపు

ఈనెల 21న ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో హైలెవెల్‌ డెలిగేషన్‌ మీటింగ్‌ ఢిల్లీలో జరగనుంది. ఈ మీటింగ్‌కు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్‌గాంధీ, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్‌ హాజరు కానున్నారు. ఏపీ కాంగ్రెస్‌ నేతలతో ప్రత్యేకంగా హైకమాండ్‌ భేటీ కానున్నదంటే ముఖ్యమైన విషయాలు ఉంటాయనేది మాత్రం స్పష్టం. నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నిలకు సంబంధించి హైకమాండ్‌ దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్‌ను బతికించడమే కాకుండా పట్టాలపైకి తీసుకు వచ్చేందుకు ఏమి చేయాలో అవన్నీ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను 21న ఖరారు చేయనున్నారు. రెండు రోజుల పాటు ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఆంధ్రరత్న భవన్‌లో తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్‌ పెద్దలకు వివరించనున్నారు. అక్కడే ఎన్నికలకు సంబంధించి భవిష్యత్‌ ప్రణాళిక రూపొందిస్తారు. ఎన్నికల ప్రచారానికి కేంద్ర పార్టీ నుంచి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనే నిర్ణయాన్ని కూడా ఈ భేటీలో నిర్ణయిస్తారు. షర్మిలను పార్టీలోకి ఆహ్వానించే విషయంలో కూడా కీలక నిర్ణయం ఈ భేటీలో తీసుకునే అవకాశం ఉంది.



ఒకచోట చెల్లని రూపాయి మరోచోట చెల్లుతుందా?
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల మార్పుల వ్యవహారం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఒకచోట చెల్లదనుకున్న రూపాయి ఇంకోచోట చెల్లుతుందా అనే ప్రశ్న కూడా సమావేశంలో ఉత్పన్నమైంది. ఎస్సీ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా మార్పులు జరుగుతున్నందున ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎస్సీలపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నిరూపించాల్సిన బాధ్యత కూడా పార్టీ తీసుకోవాల్సిన అవసరాన్ని చర్చించారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ నాయకులను తీవ్రంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవమానిస్తోందని, ఎవరిని ఎక్కడ అభ్యర్థిగా పెట్టినా వారి బలం ఏమీ ఉండదని, అది స్థానిక నేతల బలం మాత్రమేననే పోకడ వైఎస్సార్‌సీపీలో ఉన్నదన్న భావనకు సమావేవం వచ్చింది. అక్కడి ఎస్సీ, ఎస్టీ నేతలు ఆలోచించే విధంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల రూపకల్పన ఉండాలనే నిర్ణయాన్ని సమావేశం తీసుకుంది.
కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారా..
వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, మేధావులు కాంగ్రెస్‌ అధిష్టానానికి టచ్‌లో ఉన్నారా? అవునని అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు గిడుగు పద్మరాజు రుద్రరాజు. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో రాష్ట్ర, జిల్లా, సిటీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి వ్యవహరించాల్సిన వ్యూహాలను రూపొందించారు. పలు పార్టీలు, ప్రధాన అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని ఏ క్షణమైనా వారు పార్టీలో చేరవచ్చని సమావేశంలో రుద్రరాజు చెప్పారు. దీంతో ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న వారిలో కొంత మనోధైర్యం పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లోకి రాబోతున్నారని తీవ్రస్థాయిలో చర్చ జరగుతోంది. అందుకు బలం చేకూరుస్తూ పీసీసీ అధ్యక్షుడు పార్టీ నాయకుల వద్ద అధిష్టానానికి చాలా మంది టచ్‌లో ఉన్నట్లు చెప్పటం కూడా ఏపీలో చర్చకు దారి తీసింది. అధికార, ప్రతిపక్ష నాయకులపై కూడా సమావేశంలో పూర్తి స్థాయి చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ నుంచి బయటకి పోయిన వారు, జగన్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి బయటకు పోయిన వారే అందువల్ల వారు ఎక్కడి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో తిరిగి అక్కడికే రావాల్సిన పరిస్థితులు వచ్చినా రావచ్చని రుద్రరాజు వ్యాఖ్యానించడం మరో విశేషం.
వ్యక్తిగత స్వార్థంతోనే పాలన
అటు చంద్రబాబు కానీ, ఇటు జగన్‌కానీ వ్యక్తిగత స్వార్థం కోసమే పాలన సాగించారు తప్ప ప్రజల కోసం కాదనేది స్పష్టమైనట్లు సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతామన్న జగన్‌ ఇప్పుడు మాట్లాడటం లేదు. హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటేనే మంచిదన్న చంద్రబాబు ఆ నిధులు ఏమి చేశారు. ఈ అంశాలు వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుని వాస్తవాలు ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు. వైఎస్సార్‌సీపీ పెట్టిన పథకాల ద్వారా మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా అనే అంశం కంటే రాష్ట్ర అధోగతి పాలైనా పట్టించుకోని పాలకులు ప్రజలకు ఏ మాత్రం అవసరం లేదనే విషయంపై చర్చ సాగాల్సిన అవసరాన్ని సమావేశం చర్చిచింది.
సోషల్‌ మీడియా విభాగం ఏర్పాటు
ఏపీసీసీ సోషల్‌ మీడియా విభాగం కొత్తగా ఏర్పాటైంది. ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ అధికారిక పేజీలకు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌లను ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గురువారం ఆంధ్రరత్న భవన్‌లో స్కాన్‌ ద్వారా ప్రారంభించారు.
ఏఐసీసీ కార్యదర్శులు మెయప్పన్, క్రిష్టోఫర్‌ తిలక్, కేంద్ర మాజీ మంత్రి జెడీ శీలం, కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్‌వలి, జంగా గౌతం, సుంకర పద్మశ్రీ, రాకేశ్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరామమూర్తిలు పాల్గొన్నారు.


Next Story