సీఎం జగన్‌ పుట్టిన రోజు కళ్యాణదుర్గంలో లెక్కకు మిక్కిలి బైకులతో ర్యాలీ నిర్వహించి తన బలమేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారా..


కెవి ఉష శ్రీచరణ్‌ తొలిచాన్స్‌లోనే మంత్రి పదవి కొట్టేసిన ఎమ్మెల్యే. ప్రతిష్టాత్మక కళ్యాణదుర్గంపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేసి సౌమ్యురాలుగా పేరుతెచ్చుకున్నారు. శాసన సభలో సీఎం జగన్‌ను మెప్పించి స్త్రీ శిశు సంక్షేమ శాఖను దక్కించుకున్నారు. ఐదేళ్లు తిరగకముందే అందరి నోళ్లలో నానడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనియాంశమైంది. సీఎం జగన్‌ చేపట్టిన ఎమ్మెల్యేల బదిలీల్లో ఉష పేరు కూడా ఉన్నట్లు ఉప్పందింది. దీంతో ఆమె ఒక అకేషన్‌ను ఎంచుకున్నారు. అదేంటంటే జగన్‌ పుట్టిన రోజు డిసెంబరు 20న ఆమె బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు.

ఈనెల 20న భారీ సంఖ్యలో బైక్‌లతో ర్యాలీ నిర్వహించేందుకు ఉష శ్రీచరణ్‌ రెడీ అయినట్లు స్థానిక పార్టీ నాయకులు చెబుతున్నారు. 20,000 వేల పైచిలుకు బైక్‌లు ర్యాలీలో పాల్గొంటాయని అంచనా. ఉష ఈ కార్యక్రమం ద్వారా సీఎం జగన్‌ దృష్టిని ఆకర్షించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
స్థాన చలనం తప్పదా?
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజవర్గం ఎమ్మెల్యే, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌కు స్థాన చలనం తప్పేట్లు కనిపించడం లేదు. వైఎస్‌ఆర్‌సీపీ చేయించుకున్న సర్వేల్లో కొందరు మంత్రులు కూడా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సర్వేల్లో వచ్చిన రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులను వైఎస్‌ఆర్‌సీపీ ఎంపిక చేస్తున్నది. కొందరు కొత్తవారు ఉండగా మరికొందరు పాతవారికి స్థానాలు మారుస్తున్నారు. గెలుపు ఖాయం అనుకున్న వారి స్థానాలు మాత్రం పదిలంగా ఉంటాయని నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలకు ఒకటికి రెండుసార్లు నిర్వహించిన సమావేశాల్లో చెప్పారు. ఎన్నికలకు ఏడా ముందు ఒకసారి, ఆరు నెలలు ఎన్నికలు ఉన్నాయనగా రెండు సార్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఎంపీలతో సమావేశాలు నిర్వహించి హెచ్చరించారు. టిక్కెట్‌ రాని వాళ్లు నన్ను ఏమీ అనుకోవద్దని, పార్టీ కోసం పనిచేయాలని అప్పట్లో చెప్పారు.


ఉన్నత విద్యావంతురాలు
కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న ఉష శ్రీచరణ్‌ 2014లో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. ఈమె ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. ప్రస్తుతం పిహెచ్‌డీ పట్టా కోసం చదువుతున్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టిక్కెట్‌ సంపాదించి గెలుపొందారు. రెండో సారి మంత్రి వర్గ ఏర్పాటులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవిని పొందారు. ఉన్నత చదువు ఉండటం, బాగా మాట్లాడగలిగే సత్తా ఉండటంతో ఈమెకు సీఎం వైఎస్‌ జగన్‌ అవకావం కల్పించారు. 2024 ఎన్నికల్లో ఉషకు సీటు దక్కుతుందా.. లేదా అనే చర్చ జోరుగా సాగుతున్నది. సర్వేలపై ఆధారపడిన వైఎస్సార్‌సీపీ ఉషకు టిక్కెట్‌ ఇవ్వకపోవడమే మంచిదనే భావనలో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలో తనను గెలిపించిన వారినే పెద్దగా పట్టించుకోకపోవడం, ప్రజలతో మమేకమై తిరగకపోవడం టిక్కెట్‌ ఇవ్వకపోవడానికి కారణంగా వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈమె కురబ సామాజిక వర్గానికి చెందిన మహిళైనప్పటికీ ఆ వర్గంవారితోనే సత్సంబందాలు లేవనే భావనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
పార్లమెంట్‌ సీటు ఇచ్చే అవకాశాలు
హిందూపురం లేదా అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఉష శ్రీచరణ్‌ పేను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సీటు దక్కే అవకాశాలు లేవు. అందువల్ల హిందూపురానికి ఉష పేరును పరిశీలిస్తున్నారు. లేదంటే అనంతపురం పంపించవచ్చు. ఈ రెండు కోట్ల ఎంపీ స్థానాలకు అవకాశం లేకపోతే పార్టీ నాయకత్వ బాధ్యలు అప్పగిస్తారనే టాక్‌ పార్టీలో ఉంది.
టిడీపీ పరిస్థితి ఏమిటి?
తెలుగుదేశం పార్టీకి కళ్యాణదుర్గం బలమైన నియోజకవర్గమని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఉన్నం హనుమంతరాయ చౌదరి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో సీటు సంపాదించిన ఉమామహేశ్వరావు ఓటమి చెందారు. తిరిగి తనకు టిక్కెట్‌ కావాలని ఇద్దరూ పట్టు పడుతున్నారు. వీరిలో ఎవరికి సీటు ఇచ్చినా రెండో వర్గం యాంటీగా పనిచేసే అవకాశాలు ఉన్నాయనేది టీడీపీలోని ముఖ్య నాయకులు చెబుతున్నారు. వీరు రాజీ మార్గంలో వెళితే తప్పకుండా టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని, ఇరువురు వర్గాలుగా ఏర్పడితే వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీనే గెలుపొందే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
కాపు రామచంద్రారెడ్డికి అవకాశం ఉందా?
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుపున కళ్యాణదుర్గం సీటు ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈయన 2004లో కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పట్లో కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీస్థాయిలో అభివృద్ది కార్యక్రమాల రూపకల్పనలో పాలు పంచుకున్నారని స్థానికులు చెబుతున్నారు. తిరిగి 2024లో అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నందున రెడీగా ఉన్నట్లు సమాచారం.


Next Story