కేసీయార్ నోటికి తాళంపడిందా ?
x
KCR

కేసీయార్ నోటికి తాళంపడిందా ?

కొడుకు ట్యాపింగ్ జరిగిందని అంగీకరించిన తర్వాత ట్యాపింగ్ జరగలేదని కేసీయార్ అనేందుకు లేదు. ట్యాపింగ్ తో తనకు సంబంధంలేదని తప్పించుకునేందుకూ లేదు.


కేసీయార్ నోటికి తాళం పడినట్లే ఉంది. రెండు కీలకమైన విషయాల్లో నోరిప్పి మాట్లాడలేకపోతున్నారు. రెండు విషయాలు ఏమిటంటే మొదటిదేమో టెలిఫోన్ ట్యాపింగ్ లో కూతురు కవిత అరెస్టుపై ఇంతవరకు స్పందించలేదు. కవిత అరెస్టయి సోమవారానికి నెలరోజులైంది. అరెస్టయిన దగ్గర నుండి కవిత ఢిల్లీలోని తీహార్ జైలులోనే ఉన్నారు. తన కూతురు అరెస్టు అక్రమమని కాని సక్రమమని కాని కేసీయార్ ఇంతవరకు మాట్లాడకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఒకపుడు కేంద్రప్రభుత్వానికి లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం దొరికినా ఆకాశమే హద్దుగా కేసీయార్ రెచ్చిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూతురును ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ, సీబీఐలు అరెస్టులు చేసినా నోరిప్పలేదు.

ఇక రెండో అంశం తెలంగాణా రాజకీయాలను కుదిపేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్. ట్యాపింగ్ అంశంపై విచారిస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే సుమారు పదిమంది పోలీసు అధికారులను అరెస్టుచేశారు. వీరంతా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ప్రత్యర్ధుల ఫోన్లను తాము టార్గెట్ చేసి వారి ఫోన్లను ఎలా ట్యాపింగ్ చేసింది పూసగుచ్చినట్లు చెప్పినట్లు వార్తలు, కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా 2018 ఎన్నికల్లో ప్రత్యర్ధిపార్టీల అభ్యర్ధులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా తాము దాడులు చేసి నగదును స్వాధీనం చేసుకున్నట్లు అప్పటి టాస్క్ ఫోర్స్ లో డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు తాజా విచారణలో సవివరంగా చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే అప్పటి డీఎస్పీ ప్రవీణ్ రావు, అడిషినల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతిరావుతో కలిసి కొందరు సీఐలు, మరికొందరు ఎస్ఐలు కూడా ట్యాపింగ్ అరాచకంలో పాల్గొన్నట్లు అర్ధమవుతోంది.

లీకులద్వారా అందుతున్న అరెస్టయిన పోలీసు అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం ప్రభుత్వంలోని పెద్దతలకాయ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ జరిగింది. ఇదే విషయమై మంత్రులు, అధికార కాంగ్రెస్ నేతలు, కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులంతా ట్యాపింగ్ కు బాధ్యులుగా కేసీయార్, కేటీయార్, హరీష్ రావులపైనే ఆరోపణలు చేస్తున్నారు. వ్యతిరేకులంతా ట్యాపింగ్ అంశంలో కేసీయార్ పై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ట్యాపింగ్ కు సంబంధంలేదని ముందు చెప్పిన కేటీయార్ తర్వాత ఇద్దరి ముగ్గురి ఫోన్లు ట్యాపింగ్ జరిగుండచ్చన్నారు. లంగాలు, దొంగల ఫోన్లు ట్యాపింగ్ జరిగితే దానికి ఎందుకింత గోల చేస్తున్నారంటు ఎదురుదాడికి దిగారు. దాంతో కేసీయార్ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని కేటీయారే నిర్ధారించినట్లయ్యింది.

ఈ నేపధ్యంలోనే పదిరోజుల క్రితం కరీంనగర్ పర్యటనలో కేసీయార్ మీడియాతో మాట్లాడుతు ట్యాపింగ్ విషయమై అన్నీ వివరాలు చెబుతానన్నారు. ట్యాపింగ్ జరిగిందా లేదా ? ట్యాపింగ్ లో ఎవరిని అరెస్టుచేయాలనే విషయాన్ని కూడా మూడు నాలుగు రోజుల్లో చెబుతానని చెప్పారు. ఈ మాటచెప్పి పదిరోజులు అవుతున్నా ఇంతవరు నోరిప్పలేదు. ట్యాపింగ్ అంశమైనా, కవిత అరెస్టుపైనా కేసీయార్ ఎందుకని నోరిప్పటంలేదు ? కూతురిని చూడటానికి కేసీయార్ ఢిల్లీకి కూడా వెళ్ళలేదు. తల్లి శోభారావు, సోదరుడు కేటీయార్, బావ హరీష్ రావులు ఢిల్లీకి వెళ్ళి జైల్లో ఉన్న కవితను కలిసొచ్చారు కాని కేసీయార్ మాత్రం వెళ్ళలేదు. ఈ రెండు అంశాలపైన కేసీయార్ ఎందుకు మాట్లాడటంలేదంటే రెండుకూడా సున్నితమైన అంశాలు కావటమే అని తెలుస్తోంది. పైగా రెండింటిలోను బీఆర్ఎస్ పూర్తిగా పీకల్లోతు కూరుకుపోయుంది.

పార్లమెంటు ఎన్నికలకు ముందు ఏమి మాట్లాడినా తానే వివాదాల్లో ఇరుక్కుంటానని కేసీయార్ ఆలోచించారా ? తనతో పాటు పార్టీ కూడా వివాదాల్లో ఇరుక్కుంటే పార్లమెంటు ఎన్నికల్లో మైనస్ అవుతుందని భయపడ్డారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తన హయాంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ కు బాధ్యత వహించాల్సింది కేసీయారే అని అందరికీ తెలుసు. పైగా తమ హయాంలో ట్యాపింగ్ జరిగిందని స్వయంగా కేటీయారే అంగీకరించారు. కొడుకు ట్యాపింగ్ జరిగిందని అంగీకరించిన తర్వాత ట్యాపింగ్ జరగలేదని కేసీయార్ అనేందుకు లేదు. ట్యాపింగ్ తో తనకు సంబంధంలేదని తప్పించుకునేందుకూ లేదు. ఏ రకంగా చూసినా తేనెతుట్టెను కదలించినట్లే అవుతుందని కేసీయార్ భావించినట్లున్నారు. అసలే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్ధుల పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉంది. ఈ సమయంలో తాను ఏదో మాట్లాడి చివరకు అదింకేదో అయిపోయి రివర్సు కొడితే మొత్తంమీద పార్టీ పుట్టిముణిగిపోవటం ఖాయం. ఇవన్నీ ఆలోచించే నోటికి తాళం వేసుకున్నట్లు అర్ధమవుతోంది.

Read More
Next Story